Wednesday, August 19, 2020

పిడివాదులకు హెచ్చరిక

బీసీలు మనువాదులు అని నిర్ధారిస్తూ కొంత మంది ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్నారు. దానికి మరి కొంత మంది విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. మొత్తం మీద వాళ్ళందరికీ ఒక నిశ్చితాభిప్రాయం ఉన్నది. అదే బీసీలు మనువాదులని.  ఈ విషయాన్ని ఒకసారి చెప్పి వొదిలెయ్యకుండా అవకాశం దొరికినప్పుడల్లా బీసీలే ద్రోహులు అనే విధంగా రాస్తున్నారు. 

బీసీలను టార్గెట్ చేసి రాసినట్లయితే కులానికొక్కడు సంఘటితంగా లేరు కాబట్టి తాము ఏమి రాసినా చెల్లుతుందని వారి విశ్వాసం. ఇదే పోస్టులు దళితుల మీద ఎవ్వరు పెట్టినా అట్రాసిటీ కేసులు ఎదుర్కోవాల్సి వచ్చేది. 

Tuesday, August 18, 2020

వృథా పరిశోధన





తెలంగాణ ప్రభుత్వం పూనికతో 2017లో ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా హైదరాబాద్‌లో జరిగాయి. ఈ మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడెమీ చాలా పుస్తకాలు ప్రచురించింది. అయితే ఈ పుస్తకాలన్నింటిలోనూ అత్యధిక పేజీలతో వెలువడిన గ్రంథం ‘తెలంగాణలో భావకవితా వికాసం’. అకాడెమీ 11వ ప్రచురణగా వెలువడిన ఈ గ్రంథానికి సామిడి జగన్‌ రెడ్డి సంపాదకత్వం వహించాడు. ‘ప్రణయం-ప్రకృతి - ప్రశంస - మహిళా కవితావళి - 1920-43, 1948-66’ అనే ఉపశీర్షికతో ఈ కవితలను సంకలనం చేసిండు. 

ఈ పుస్తకం మొత్తం మొదటి పేజీ నుంచి ఆఖరిపేజీ వరకూ తప్పులతడకగా ఉన్నది. ఒక గ్రంథం ఏదైనా ప్రభుత్వ శాఖ తరపున వెలువడినట్లయితే దానికి సాధికారత ఉంటుంది. వివిధ విశ్వవిద్యాలయాల్లో దాన్ని పాఠ్యాంశంగా పెడతారు. రెఫరెన్స్‌ గ్రంథంగా సూచిస్తారు. అట్లాగే యువ పరిశోధకులు ఆ గ్రంథంలోని విషయాలు ప్రామాణికంగా భావిస్తారు. ముఖ్యంగా ప్రాంతేతరులు దాన్ని కరదీపికగా భావిస్తారు. అందుకే తెలంగాణవాదిగా, సాహిత్య విమర్శకుడిగా, పరిశోధకుడిగా ఇందులోని అసత్యాలు, అసంబద్ధ విషయాలను పాఠకుల దృష్టికి తీసుకురావడం బాధ్యతగా భావిస్తున్నాను. అందులో భాగమే ఈ వ్యాసం. ఈ వ్యాసం తెలంగాణ మీది ప్రేమతోనే తప్ప ఎవరిపైనా ఆరోపణలు చేయడం కోసం రాయడం లేదు అనే విషయాన్ని గుర్తించాలి. 

తెలుగు సాహిత్యంలో ఇప్పటి వరకు వెలువడ్డ దాదాపు అన్ని సంకలనాలకు పుస్తకం లోపల ఏమున్నదో తెలియజెప్పేందుకు ‘విషయ సూచిక’ ఉంటుంది. ఈ పుస్తకానికి అట్లాంటి విషయ సూచిక ఏమీ లేదు. మొత్తం 538 కవితలున్న ఈ పుస్తకానికి విషయ సూచిక ఇవ్వక పోవడం వల్ల ఏ కవి రచన ఏ పేజీలో ఉందో వెతకడానికి మొత్తం 638 పేజీలను తిరగేయాల్సి వచ్చింది. సరే అట్లా పుస్తకం మొత్తం తిరగేస్తే గానీ ఒక్కో కవివి 20కి పైగా కవితలున్నాయనే విషయం తెలియలేదు. ఇందులో బూర్గుల రామకృష్ణారావువి 15 కవితలుండగా ఆయన కుమారుడు బూర్గుల రంగనాథరావువి 25 కవితలున్నాయి. అట్లా అని ఇవేవి అరుదైన కవితలేమీ కావు ఈ ఇద్దరి సమగ్ర సాహిత్యాన్ని ఇటీవలే ఆచార్య ఎస్వీరామారావుగారు సంకలనాలుగా తీసుకొచ్చారు. అట్లాగే మరో కవి వానమామలై వరదాచార్యులు గారివి 21 కవితలు. అందులో 18 కవితలు ఒక్క ‘మణిమాల’ సంపుటి నుంచి తీసుకొని దీనిలో జోడించారు. సి. నారాయణరెడ్డి కవితలు మరో 20 ఉన్నాయి. 

వీళ్ళు కొంత మేరకు ఆధునిక దృక్కోణంతో కవితలు రాసిండ్రు. అయితే ఆధ్యాత్మిక కీర్తనలు రాసిన కైరం భూమదాసువి 19 కీర్తనలు ఇందులో ఉన్నాయి. అట్లాగే మామునూరు నాగభూషణరావువి 12 కవితలు సురవరం ప్రతాపరెడ్డివి మరో 11 కవితలు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమయి ఉంటుందనుకుంటా! అదేమి టంటే ‘విషయ సూచిక’లో కవి-కవితను పేర్కొన్నట్లయితే ఒకే కవివి ఎన్ని కవితలు ఇందులో ఉన్నాయో ఈజీగా తెలుస్తుంది కాబట్టి సంపాదకులు ఆ పనిని విరమించుకున్నారు. చూడంగనే ఇట్టే తెలిస్తే ఎవరైనా విమర్శించే అవకాశముంటుంది. అందుకే సంపాదకులు ఆ కష్టానికి ఒడిగట్టలేదు. 

ఈ కవితల కూర్పుకు ఒక కాలక్రమం కూడా ఏమీ పాటించలేదు. అట్లా పాటించినట్లయితే ఒక సంపుటి నుంచి తీసుకున్న రచనలన్నీ ఒకే దగ్గర పేర్కొనాల్సి వస్తది కాబట్టి సంపాదకులు ఆ పని చేయలేదు. ఎందుకంటే బుక్కపట్టణం తిరుమల నరసింహాచార్యులు ‘సురభి’ పేరిట 1927లో ఒక సంపుటిని వెలువరించాడు. కాలక్రమంలో ఈ సంకలనాన్ని వెలువరించినట్లయితే ‘సురభి’లోని కవితలన్నీ ఒకే దగ్గర పేర్కొనేందుకు అవకాశముండేది. ఇట్లా ఒకే కవివి ఎన్ని కవితలు చేర్చిన విషయాన్ని తెలియకుండా పక్కదారి పట్టించేందుకుగాను రెండు కవితలు వేరే కవులవి ఇచ్చి ఆ తర్వాత ‘సురభి’లోనుంచి పేర్కొన్నారు. అట్లాగే ‘మణిమాల’ నుంచి తీసుకున్న 18 కవితలు, ‘బూర్గుల రంగనాథరావు సాహిత్యం’ తదితర పుస్తకాల నుంచి తీసుకున్న సమాచారమంతా ఒకే దగ్గర ఇవ్వాల్సి వస్తది. ఇది సంపాదకులకు ఇష్టం లేదు. నిజానికి ఇది పాఠకులను తప్పుదారి పట్టించడమే! కాలక్రమంలో కవిత్వ కూర్పు చేసినట్లయితే ఇందు లోని కొన్ని తప్పులను ఉపసంహరించుకునేందుకు అవకాశముండేది అట్లనే ఒకే కవితను రెండు సార్లు చదివే కష్టం కూడా పాఠకులకు తప్పి ఉండేది. 

ఇందులో 34వ పేజీలో ‘నిరాశ’ పేరిట బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు రాసిన కవిత మళ్ళీ 76వ పేజీలో కూడా ప్రత్యక్షమైంది. పాలమూరు సంస్థానాలల్లో చాలా మంది తిరుమల/బుక్కపట్టణంవాళ్ళు ఉన్నారు. అట్లాగే ‘సురపురం’ సంస్థానంలో కూడా ఈ ఇంటిపేరు కలవారు ఉన్నారు. ‘సురభి’ సంపుటి ప్రచురణకు జటప్రోలు సంస్థాన రాజా వెంకటలక్ష్మారావు బహ ద్దరు సహాయం చేసిండు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ‘సురభి’ అనే గ్రామం పేరుంది. కానీ తిరుమల బుక్కపట్టణం వారి వంశవృక్షంలో ఎక్కడా కూడా బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు పేరు లేదు. మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్యాన్ని విస్తృతంగా అధ్య యనం చేసిన పండితులు వైద్యం వెంకటేశ్వర్లు ఈ కవి అనంతపురం వాడు కావొచ్చని అభిప్రాయపడ్డారు. జగన్‌ రెడ్డి ఏ ఆధారాలతో ఈయన్ని తెలంగాణ వాడుగా నిర్థారించాడో తెలియాలి. 

తిరుమల బుక్కపట్టణం నరసింహాచార్యులు ప్రాంతం సందిగ్ధం కాబట్టి వదిలేసినా ఆంధ్రావారు, ఆంధ్రావాదుల కవితలు కూడా ఇందులో యథేచ్ఛగా సంకలితమయ్యాయి. సంపాదకుడి దృష్టిలో రాయప్రోలు సుబ్బారావు, ఊటుకూరు సత్యనారాయణ, సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, డాక్టర్‌ పి.వి. రమణయ్య, భాగవతుల పూర్ణయ్య, ఇంద్రగంటి నాగేశ్వరశర్మ, ఆదిపూడి సోమనాథరావు, ఆదిపూడి ప్రభాకరామాత్య, యన్‌. భారతీ రత్నాకరాంబ, నౌడూరు బుచ్చిబంగారయ్య ఇంకా తెలంగాణేతర కవులు పదుల సంఖ్యలో ఈ సంకలనంలో స్థానం సంపాదించుకున్నరు. ఇందులో నౌడూరు బుచ్చిబంగారయ్య పేరు మార్చి చౌడూరు బుచ్చిబంగారయ్య పేరిట తెలంగాణ సిటిజన్‌షిప్‌ ఇచ్చేసిండు సంపాదకుడు.

పైన పేర్కొన్న విధంగా వానమామలై, బూర్గుల రంగ నాథాచార్యులు, సి.నారాయణరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డిల రచనలు ఇబ్బడిముబ్బడిగా ఈ సంకలనంలో ఉన్నాయి. బహుశా సంకలనం పేజీల సంఖ్యం పెం చడం కోసం చాలా మంది కవులవి ఐదారుకు మించి కవితలున్నాయి. వారిలో బోయినపల్లి రంగా రావు కవితలు -12, దేవులపల్లి రామానుజరావు కవితలు ఏడు, ఊటుకూరు రంగారావు కవితలు-7, దాశరథి కవితలు -5, శేషభట్టర్‌ వేంకట రామానుజాచార్యులు, గవ్వా సోదరులు, బెల్లకొండ చంద్రమౌళి శాస్త్రి, శేషాద్రి రమణకవులు ఇట్లా చాలా మంది కవుల రచనలు ఒక్కొక్కరివి ఐదారుకు మించి ఉన్నాయి. కవితా సంకలనం అంటే వారి ప్రతిభకు అద్దం పట్టే ఒకటి రెండు కవితలుంటాయి. కాని ఒక్కొక్కరివి 25 అంటే ఆశ్చర్యంగా ఉన్నది.

అత్యధికంగా కవితలు ‘గోలకొండ కవుల సంచిక’ లోనివే. 94 కవితలు తీసుకున్నాడు. ఇది కవిత చివరన సంపాదకులు పేర్కొన్న సమాచారం ద్వారా తెలిసిందే! అయితే లోతుగా పరిశీలించినట్లయితే ఇష్టానుసారంగా వీటిని పేర్కొన్న విషయం అవగతమవుతుంది.ఉదాహరణకు మామునూరు నాగభూషణరావు కవితల్లో ఒక్క ‘నిజాం రాష్ట్ర ప్రశంస’ మాత్రమే గోలకొండ కవుల సంచికలో ఉన్నది. అయితే ఈ సంపాదకుడు మాత్రం ‘వాంఛితము’, ‘జీవితాదర్శము’ కూడా గోలకొండ కవుల సంచిక నుంచే తీసుకున్నట్టు పేర్కొన్నాడు. మరోచోట ‘గోలకొండ కవుల పత్రిక’ పేరిట ఈయన రచన ‘జ్ఞాతివైరము’ను పేర్కొ న్నాడు. రూప్ఖాన్‌పేట రత్నమ అని ఒక దగ్గర మరో దగ్గర రంగమాంబ అని పేర్కొన్నాడు. అట్లాగే సురవరం ప్రతాపరెడ్డి పేరిట పేర్కొన్న కొన్ని కవితలు ‘ఆయనవే’ అని ఎట్లా నిర్ధా రించిండ్రోకూడా పాఠకులకు తెలియాల్సి ఉన్నది. ఎందుకంటే ‘కవికుమారుడు’, ‘దీర్ఘదర్శి’ అనే కలం పేరుతో సురవరం రాసినట్టుగా సంపాదకుడు పేర్కొన్నారు. ఆధారాలు చెప్పలేదు.

ఇందులో ‘సుజాత’ పత్రిక నుంచి తీసుకున్న కవితల్లో ఎక్కువ తెలంగాణేతరులవే! ఇందులోనే శ్రీశ్రీతో, చలం రచనలు చోటు చేసుకున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. జగన్‌రెడ్డి ఈ పుస్తకం చివర్లో ఐదు పేజీల్లో మూడు అనుబంధాలను జోడించాడు. ఇందులో రెండో అనుబంధంలో సుజాత పత్రిక ‘1927-34’ వరకు వెలువడింది అని పేర్కొన్నాడు. అది తప్పు. ఈ పత్రిక 1927 జనవరి నుంచి 1930 జనవరి వరకు వెలువడింది. అట్లాగే దీనికి కొన్ని రోజులు బి.ఎన్‌.శర్మ సంపాదకులుగా వ్యవహరించారు అని రాసిండు. అది కూడా తప్పే. ఈ పత్రికకు కొన్ని రోజులు పి.ఎన్‌.శర్మ అనే పసుమాముల నృసింహశర్మ అనే అతను సంపాదకులుగా వ్యవహరించారు. ఇంకా బోలెడన్ని తప్పులు ప్రతి పేజీలోనూ ఉన్నాయి. బాధాకరమైన విషయమేందంటే సంపాదకుడు కనీస పరిశోధక మర్యాదలు కూడా పాటించలేదు. నా సంపాదకత్వంలో వచ్చిన ‘సురవరం కవిత్వం’ నుంచి కవిత్వాన్ని తీసుకొని డైరెక్ట్‌గా తానే ఒరిజినల్‌ ప్రతులు చూసినట్టుగా పత్రికలను పేర్కొన్నాడు. కొన్ని కవితలకు ‘సురవరం కవిత్వం’ నుంచి అని పేర్కొన్నప్పటికీ అన్ని కవితలూ నా సంకలనంలోనుంచి తీసుకొని కొన్నింటికే క్రెడిట్‌ ఇవ్వడం మర్యాద కాదు. 

ఇందులో ఉన్నదంతా భావకవిత్వమేనా అనే చర్చ కూడా ఇక్కడ చేయడం లేదు. అట్లా చేసినట్లయితే మరిన్ని బొక్కలు బయటపడే అవకాశముంది. ఇందులో కొందరు మహిళల్ని మాత్రమే చేర్చిండు. మిగతా వాళ్ళని ఎందుకు విస్మరించిండో తెలియాలి. ఇట్లా చాలా లోతైన విషయాలపై ఇంకా చర్చ బాకీ ఉంది. బోలెడన్ని అనువాద కవితలు తీసుకోవడంలో ఉద్దేశ్యమేమిటో తేలాలి. ఎంతో ఉదారంగా లక్షల రూపాయలు వెచ్చించి 2000ల ప్రతులు ముద్రించారు. ఇంత నిర్బాధ్యతగా పుస్తకాన్ని అచ్చేసినందుకు, ప్రజాధనాన్ని ఎలాంటి నిపుణుల కమిటీ ఆమోదం లేకుండా (ఉంటే వారి పేర్లు పుస్తకంలో ఉండేవి) విచ్చలవిడిగా ఖర్చు చేసినందుకు అప్పటి తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి బాధ్యత వహించాలి. తప్పులతడకతో నిండిన ఈ పుస్తకాన్ని ప్రభుత్వం అమ్మకాల నుంచి ఉపసంహరించుకోవాలి. అట్లాగే దీనిలోని తప్పులన్నింటిని సవరించి తెలంగాణ ఔన్నత్యాన్ని నిలబెట్టేవిధంగా పునర్ముద్రించాలి. భవిష్యత్‌లో పుస్తకాలు ముద్రించే ముందు విషయ నిపుణుల ఆమోదం మేరకే పుస్తకాలు ప్రచురించాలని వినతి. 

సంగిశెట్టి శ్రీనివాస్

Tuesday, August 11, 2020

బహుజన రాజకీయ చైతన్య స్ఫూర్తి గాజుల లక్ష్మీనరసు శెట్టి

 



ఇండియాలో మొట్ట మొదటి బహుజన రాజకీయ చైతన్య స్ఫూర్తి గాజుల లక్ష్మీనరసు శెట్టి. జోతిరావు ఫూలె సామాజి సంస్కరణ, విద్యా రంగం పై దృష్టిని కేంద్రీకరిస్తే గాజుల ఈస్టిండియా కంపెనీ దుర్మార్గాలపై గళమెత్తిండు. తన ఉద్యమాలతో బ్రిటీష్ పార్లమెంటుని కదిలించిండు. ఈస్టిండియా కంపెనీ వారి ఏకపక్ష పాలనను నిరసించేందుకు క్రిసెంట్ అనే ఆంగ్ల పత్రికను 1843లోనే స్థాపించిండు. మద్రాసు కేంద్రంగా పనిజేసిండు. చిన్నయసూరి లాంటి బ్రాహ్మణేతర పండితులను ప్రోత్సహించిండు. ఈయన బలిజ కులానికి చెందిన తెలుగు వాడు. మద్రాసులో పేరు మోసిన సిద్దులు అండ్ కంపెనీ ఓనర్. అయితే పత్రిక నిర్వాహణ మూలంగా ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. అయినా తాను నమ్మిన సిద్ధాంతం కోసం 1868 లో చనిపోయే వరకు కృషి చేసిండు. ఇప్పుడీ పుస్తకాన్ని అచ్చు వేసేందుకు మిత్రులు ఆర్థికంగా సహకరిస్తే ఎక్కువ కాపీలూ వేయడానికి వీలవుతుంది. సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తూ..

అస్తిత్వ వాదాలపై మన తెలంగాణ పత్రికలో నా వ్యాసం

 

Monday, August 10, 2020

విద్యుద్గళం నిస్సార్‌కు నివాళి

తెలంగాణ రాష్ట్ర ఉద్యమారంభంలో వామపక్ష ఉద్యమాల్లో ఉండి అస్తిత్వవాదాలతో మమేకమయిన వాళ్ళు చాలా తక్కువ. అట్లాంటి తక్కువ మందిలో ముందు వరుసలో ఉండే విద్యుద్గళం నిస్సార్‌. అవును విద్యుద్గళమే! ఆ కంఠంలో ఒకరకమైన షాకింగ్‌ ఫోర్స్‌ ఉండేది. వోల్టేజి ఉండేది.  దోపిడీ, దుర్మార్గాలపై పిడుగులు  కురిపించేది. సిపిఐ రాజకీయాలతో ఉండి కూడా తెలంగాణ, ముస్లిం అస్తిత్వ ఉద్యమాలతో మమేకమయిన కవి, పాటగాడు, గాయకుడు, కథకుడు మొహ్మద్‌ నిస్సార్‌. ఎందుకంటే మొదట్లో సిపిఐ పార్టీ తెలంగాణ ఉద్యమానికి మద్ధతియ్యలేదు. అయినప్పటికీ నిస్సార్‌ తెలంగాణ రాష్ట్రం కోసం గళం విప్పిండు. డప్పుకొట్టిండు. కేవలం రాయడమే కాదు. దాన్ని కైగట్టి పాడెటోడు. గొంతులోని ఒకరకమైన కంచు ధ్వని అందరినీ కట్టిపడేసేది. సాదా సీదాగా జబ్బకు సంచేసుకొని మీటింగులకొచ్చేది. అన్నా నీ పాట అనంగనే గొంతందుకునేది.. అట్లాంటి ఉద్యమ గొంతుక ఇయ్యాళ శాశ్వతంగా మూగపోయింది. కోవిడ్‌ కాలంలో కనీసం కడసారి సూపుకు కూడా నోసుకోలేక ఈ నాలుగు దు:ఖపు వాక్యాలు మీతో పంచుకుంటున్న.  

పొట్టకూటి కోసం క్లీనర్‌గా, ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా పనిచేసిన నిస్సార్‌ తర్వాతి కాలంలో ఆర్టీసీలో కండక్టర్‌గా ఉద్యోగంలో చేరిండు. ఓపెన్ యూనివర్సిటీలో  పట్టా అందుకున్నడు. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే ఉద్యమాలతో మమేకమయిండు. ఆర్టీసీలోని కమ్యూనిస్టు అనుబంధ సంఘాల్లో పనిచేస్తూనే ప్రజా నాట్యమండలి కార్యదర్శిగా పనిచేసిండు. కార్యదర్శిగా ఉంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించిండు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఉద్యమానికి ప్రాణ వాయువుగా ఉండిన ఎన్నో పాటలను అల్లిండు. ఒక్క తెలంగాణ ఉద్యమమే గాకుండా ముస్లిం అస్తిత్వ వాద ఉద్యమాలతో కూడా మమేకమయిండు. ఎన్నో ఉత్తేజకరమైన పాటలు రాసిండు. అందులో

‘‘ముసల్మానులం మేము  ఈ దేశ మూ వాసులం

హిందుస్థానీయులం మేము అంత

జాంబవంతుని వారసులం’’ అంటూ మూలనివాసీ సిద్ధాంతాన్ని ప్రచారం చేసిండు. అట్లాగే 

‘‘సాయబో సాయబు నిన్నంటరు నవాబు

నీ జిందగి ఎంత గరీబుదో నవాబు

దునియా మీది దు:ఖమంత దువాజేస్తే పోతదంటు’’ రాసిండు. 

‘‘ఏ ఐసా క్యోం భాయియో ముసల్మాన్‌ సాథియో

చేతి పనులు చేసి చేసి చేతులే పనిముట్లు అయ్యే

అర్కతెంత ఉన్నా గాని బతుకులింత బర్కతు లేదు’’ అని చేతి వృత్తులు చేసుకుంటున్న ముస్లిము జీవితాల్లోని వెతలను తన పాటల ద్వారా కైగట్టిండు. 

‘‘ముస్లీంలం ముస్లీంలం

పల్లెటూర్ల ఉండేటి ముస్లీలంము 

ముస్లీములము మేము ముస్లీంలము

పల్లె నేలతల్లి మట్టి బిడ్డలము

అరబ్బీ ఉర్దు రానోల్లము

తెలుగు  భాషలోనె చదువుకున్నోల్లము’’ అంటూ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలల్లో నివసిస్తున్న ముస్లిం జీవితాలను పక్కా తెలంగాణ భాషలో చిత్రించిండు. 

ఎన్నో  సార్లు ఉద్యమ సమయంలో అన్నా తెలంగాణను వ్యతిరేకించే కమ్యూనిస్టులతో మనకు దోస్తానీ ఏందే నువు బయటికి రా.. అంటే.. లేదన్నా వాళ్లు కూడా మారుతున్నరు. వాళ్ళని మార్శెటోడు ఆడొకడు మనోడు ఉండాలె.. ఆ పని నేను జేత్తున్న అనుకోరాదు.. అనెటోడు. అట్లాగే రజాకార్ల సందర్భంలో ముస్లింల జీవితాలను గురించి ఎన్నో ముచ్చటు చెప్పెటోడు. అట్లాంటి ముచ్చట్ల నుంచే తెలంగాణ నియ్యత్‌, మిగతా కులాలతో కలిసి మెలిసి, అక్కా, బావా అని పిలుచుకునే వరుసలు రికార్డు చేస్తూ ‘ముల్కి’ అనే కథ రాసిండు. కథలు తక్కువే రాసిన తెలంగాణ జీవితాలను రికార్డు చేసిండు.

తెలుగు ప్రజల జీవితాలను పాటల్లో రికార్డు చేసిండు. గద్దర్‌పై దాడి జరిగినప్పుడు స్పందించి పాట రాసిండు. చంద్రబాబుని నిలదీసిండు. అదీ ఆర్టీసీ ఉద్యోగిగా ఉంటూనే! వృత్తులు చేసుకునే వారి జీవితాలను, పెరుగుతున్న స్కూు లుఫీజు, ధరల పెరుగుదల, రైతులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్లర్లు, కార్మికులపై పాటల్లిండు.  

అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంతో మమేకమయిండు. ఎన్నో అద్భుతమైన పాటలు రాసిండు. ‘దగాపడ్డ తెలంగాణ దండు కదిలిందిరో’, ‘ఇత్తర ఇయ్యరా ఇప్పుడన్న తెలంగాణ’, ‘ఇంత జరుగుతున్న ఇంక ఆపుడేందిరి ఓ నాన్చుడేందిరో’, ‘రండిరో తెలంగాణ’, ‘తెలంగాణ తెలంగాణ బతుకుదెరువై తెర్లయిపోయిన బందీఖాన’, ‘కొత్తిమిర కళ్యమాకు  కారం ఎచ్చాలు మనయి... బియ్యం చింతపండు, పప్పు గిప్పు మనయే, అంతా మనయేసి వంట జేసినంక వాడు ఆంధ్రా భోజనమంటూ బోర్డు పెట్టుడేందిరా...’’ అంటూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని విస్తృతి చేసిండు. ఈయన రాసిన ‘పండు వెన్నెల్లలో పాట చాలా పాపులర్‌. అందులో నుంచి రెండు చరణాలు.

‘‘నన్నారె- నన్నారె- నన్నారె- నన్నారె

నన్నారె నన్నారె నారె

నారె నన్న నార- నారె నన్నారె నాన నారే...!

పండు వెన్నెల్లలోన - వెన్నే న్నెల్లలోన

పాడేటి పాటలేమాయె?

మన పల్లెటూరిలోన ఆడేటి ఆటలేమాయె..?

బాల నాగమ్మ భక్త శిరియాల హరిశ్చంద్ర

అల్లిరాణి ఆటలేమాయె?

మన పల్లెటూరి లాడె బాగోతాల జోరేది?

....

స్టేజి కరెంటు మైకు ఏదీ లేకున్నగాని

తెల్లార్లు ఆడిపాడేది

మన పల్లె గుండెలోన మోగేటి కంచుగొంతులేవి?

భీముండర వొరె ద్వారకా!

భీముండరిపుజర కారుండ

కౌరవ నామంబు గలనే శూరుండరా- చల్‌

చిందేస్తూ చిత్రంగి  వూరంత తిరిగేటి

చిందోల్ల వేషాలేవి?

మన పల్లెల్లో ముద్దుబిడ్డు పిట్ట దొరలు ఎటుపోయిరి?

ఇట్లా తెలంగాణ జానపదుల జీవితాలను, గ్రామీణ జీవన సౌందర్యాన్ని తన పాటల్లో చిత్రికగట్టిండు. 

ఇప్పటి జనగామ జిల్లా సుద్దాల గ్రామంలో మహ్మద్‌ అబ్బాస్‌, హలీమా దంపతులకు డిసెంబర్‌ 16, 1962లో జన్మించిన మొహ్మద్ నిస్సార్‌లోని ప్రతిభను మొదట గుర్తించి ప్రోత్సహించింది సుద్దాల అశోక్‌ తేజ. ఆ తర్వాతి కాలంలో గద్దర్‌ స్ఫూర్తితో కళను, గళాన్ని సామాజిక చైతన్యానికి వినియోగించిండు. 

నిస్సార్‌ లేని లోటు ఆయన భార్య, ఇద్దరు కొడుకుల బిడ్డకే గాదు మాలాంటి చాలా మంది దోస్తుకు కూడా పూడ్చలేనిది. నిస్సార్‌ లేడు... కానీ ఆయన పాట ద్వారా ఏసిన తొవ్వ ఉన్నది. ఆ బాట నడువడమే నిస్సార్‌కు నిజమైన నివాళి. 

- సంగిశెట్టి శ్రీనివాస్‌ 


గొల్ల పెద్దయ్య మనవడు గోపాల్ ‘దండకడియం’ కు దండాలు

ఇవ్వాళ తెలుగు సాహిత్య సమాజం దాదాపు మొత్తంగా ఇజాల వారిగా విడిపోయి వుంది. ఇది ఒక్క తెలుగు సాహిత్యానికి మాత్రమే పరిమితమయిందని కూడా నిర్ధారించలేము. ఇట్లా విడిపోవడం తప్పా, ఒప్పా అనే తీర్పుని కూడా నేనేమివ్వడం లేదు. అది వేరే చర్చ. అయితే ఇందుకు భిన్నంగా యిజాలకి సంబంధం లేకుండా తాను చూసిన జీవితాలను, తన అనుభవంలోని అంశాలను ఆధునిక తత్వ్తకవిగా, ధైర్యం నూరిపోసే సూఫీగా తగుళ్ళ గోపాల్‌ ‘దండకడియం’లో కైగట్టిండు. పోస్టుమాడర్నిజం ఐడియాలజీలో ఏ యిజం లేకపోవడం కూడా ఒక ఇజమే. జీవితానుభవాలు ప్రపంచ పోకడలపై అవగాహన రెండింటి మేళవింపుతో మా‘నవ’ సంస్కృతి మెరుగవుతూ ఉంటుంది. వీటిని ప్రకృతి, ప్రకృతి నుంచి తయారు చేసిన చోదక శక్తులకు హేతుబద్ధంగా, తార్కికంగా జోడించడంతోనే ఏ ఫిలాసఫీ అయినా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా జరిగే జ్ఞానంలోని ఘర్షణే చైతన్యం, ఉద్యమాలు. వెరసి జీవితాలు. ఇట్లా అన్ని ఫిలాసఫీలకు మాతృక లాంటి బతుకుల్ని గోపాల్‌ ‘దండకడియం’మీద చెక్కిండు. తనదైన ముద్రను ఏసిండు. మూడు పదులు నిండకుండానే నిండు జీవితానికి సరిపడ అనుభవాన్ని గొంగట్లో నింపుకున్నడు.

కథ చెప్పుకుంటూ వచ్చినట్లు కవిత రాయడం కష్టం. కథ వింటూ ఊ కొడుతున్న ఫీలింగ్‌ గోపాల్‌ కవిత్వం చదువుతూ ఉంటే తెలుస్తది. ఈ కవిత్వం ఊకొట్టించింది గాని జో కొట్టించలేదని గుర్తించాలి. మనం మనుషులం అని మరోసారి గుర్తు చేసింది. గ్రామీణ జీవిత సుఖదుఃఖాలను కమ్మ, కమ్మకు ఆగి రియాల్టీ చెక్‌ చేసుకునే విధంగా, ఎవరికి వారు ఎనుకటి జీవితాలకు అన్వయించునే తీరుగా కవితలల్లిండు. కేంద్రం నుంచి (సెంట్రల్‌ పాయింట్‌)నుంచి అసుంట అసుంట అంటూ కొసాకు నెట్టేయబడ్డ మనుషుల ఎతలను, తల్లడమల్లడమవుతున్న బతుకులకు అక్షరాలతో పాణంపోసిండు. గోపాల్‌ తన తాత గొల్ల పెద్దయ్య ఎట్లా అయితే
‘‘ముక్కుకు బట్టగట్టుకోకుండ
మేక కడుపులో చేయిపెట్టి
సచ్చేపిల్లల్ని బతికిం’చెటోడో అట్లనే ఈ 164 పేజిల పుస్తకంతో నవుస్తున్న తెలుగు సమాజానికి జీవిగంజి పోసిండు.
ప్రతి కవితలోని ముగింపు పాదాలు చదువుతున్నప్పుడు పాణాలు ఉగ్గబట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కవితంతా బతుకుని, ఎతలను పరుస్తూ చివర్లో నువ్వు మనిషివి, మానవత్వమున్న పాఠకుడివి అని ఈపుల సరుపు సరిశి తెలివిలోకి తెచ్చిండు. సోయి తెచ్చుకొని తోటోడికి తోచిన సాయం జెయ్యమని ఆర్తిగ చెప్పిండు. ఈ కవితలతో గోపాల్‌ నేను గొప్పోణ్ణి, నాకు ఎదురులేదు అని విర్రవీగే ప్రతి ఒక్కడిని ఆత్మపరిశీలనకు పురిగొల్పిండు. నిజాయితీగా, నిస్వార్థంగా ఉన్నవాణ్ణి నిటారుగా నిలబెట్టిండు. అలయి బలయి తీసుకుండు.
ఈ కవితల్లో గ్రామీణ జీవితాల్లోని సౌందర్యాన్ని, అక్కడి మట్టిమనుషుల ముఖ్యంగా కొసాఖరుకు నెట్టేయబడ్డ బహుజన బిడ్డల బతుకును పావురంగా అలుముకున్నడు. అట్లనే ఈ కవిత్వంతో రోగమొచ్చిన గొర్రెను మంద నుంచి నైపుణ్యంగా తప్పించి హెర్డ్‌ ఇమ్యునిటీ పెంచినట్లుగా మంచీ/చెడూ ఎంచి చూపిండు. బతుకు మీద అపేక్షను పెంచిండు. ‘నిండుగ పూసిన/ తంగేడు లాంటి స్వచ్ఛమైన/ ప్రేమను వాగు’గా పారిచ్చిండు. మొత్తం మీద సమాజం మేలు కోసం అక్షరాల ఇత్తులు ఏసిండు. దానికి నీళ్ళుపోసి పెంచే బాధ్యతను సాహిత్య ప్రపంచానికి/పాఠకులకు ఒదిలిపెట్టిండు.
తన జీవితమే గాకుండా చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా రాసిండు. ‘ముల్లు పాఠం’ పేరిట తన బాల్యాన్ని ఇట్లా పంచుకున్నడు.
‘‘కంప మీదంగ, ఒరికొయ్య మీదంగ
ఎగిరి దుంకి ఆవుల్ని మర్లేసినంక
తూట్లు పడిన జల్లెడలాగ అరికాళ్ళు
ఎక్కడ కూర్చుంటే అక్కడ
కాళ్ళను ముందలేసుకొని
ముండ్లను తీయడంతోనే
గడిచిపోయింది బాల్యం’’ అని తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నడు.

‘‘తెంగాణమంటే
రాలిన పూలతో గట్టిన
మందారపూల దండ
వీరు రక్తంతో గీసిన చిత్రపటం’’ అంటూ అమరుల త్యాగాన్ని చిత్రికగట్టిండు.

అట్లాగే యుద్ధం చేయకుంటే సచ్చుడే! యుద్దం షురువ్‌ జేసినవాడు కాదు, ముగింపు తెలిసిన వాడు యోద్ధ అంటడు.
‘‘ఏకాంతంగా దుఃఖిస్తున్నప్పుడు
కన్నీళ్ళతో పాటు
కొన్ని అక్షరాలూ రాలుతుంటాయి
దోసిట్లో పట్టి కాగితంపై చల్లితే
పచ్చని కావ్యాలు మొలవచ్చు
భరించలేనంత దుఃఖమని
చెట్టునో, చెరువునో వెతుక్కుంటే ఎట్లా?...!?’’ అంటూ చావు పరిష్కారం కాదంటాడు. ధైర్యంగా కొట్లాడాల్సిందే అని తెగేసి చెబుతాడు. సాటి మనుషుల మీద అలవిమాలిన ప్రేమను వ్యక్తం జేస్తాడు. తనకు సుట్టం గాకపోయినా.. ఆఖరికి అనాథ అయినా ఒక సూఫీలాగా ప్రేమను పంచుతాడు. బంధుత్వం లేకపోయినా, నాగరికత బంధనాలు వేస్తున్నా వాటిని అధిగమిస్తూ వారిని అక్కున చేర్చుకున్నడు.

‘‘మా మధ్య ఏ బంధుత్వమూ లేకపోయినా
ఆమె నన్ను నాయనా... అంటది
నేను ఆమెను అమ్మా... అంట
ఒకే ఆకాశాన్ని కప్పుకున్నం
ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళం
ఇది చాలదా
మేము బంధువులం కావడానికి’’ అంటూ వృద్ధ అనాథను ఆదరించిండు. అక్షరీకరించిండు. ఆనాథను ఆదరించినట్లే ఊరి చెరువును ఆడబిడ్డగా చెప్పిండు.

‘‘ఊరి మైలనంతా కడిగి
గుండె గూట్లో దీపం వెలిగించే
చెరువు కూడ మనింటి ఆడబిడ్డే’’.
సొంత అక్క హంసక్కను, దేవక్కను యాద్జేసుకున్నడు. అట్లనే అంతే ప్రేమతో ఎరుకళ్లోల్ల లింగక్కనూ కైగట్టిండు. నాయినమ్మా, నాయిన గురించీ, తాత గురించీ రాసిండు. తల్లిని గూర్చి గోపాల్‌ కవిత సదివిన అందరూ తల్లడమల్లడ మైతరు. గుడ్లల్ల నీళ్లు దీసుకుంటరు. అమ్మని దేవులాడుకుంటరు. తల్లి మీద ప్రేమనే కాదు గొల్ల సంస్కృతి, సంప్రదాయాన్ని కూడా చిత్రించిండు. అమ్మను ఇట్లా యాదిజేసుకున్నడు.

‘‘దారి తెల్వకున్నా
ఎన్నో దూరాలు దాటి
నూనె కారిపోతున్న చట్నీ డబ్బాలతో
మా హాస్టలు ముందు నిలబడ్డ
దేవగన్నేరు..
...
పొద్దుటి నుంచి పొద్దుందాక
మెదమోసి, వడ్లు దులిపి
కుండెడు వడ్లను నెత్తినబెట్టుకొని
పచ్చినొప్పులతో ఇంటికి జేరే మా అమ్మనే
ఒక జానపద పాట
...
పుట్టింటి నుండి
దమ్మురోగాన్ని ఎంట దెచ్చుకున్నా
ఎముకల్ని కొరికే సలిలో లేసి
సన్నీళ్లలో చేయిపెట్టి పనిజేసి
పొయ్యిమీద బువ్వై ఉడికి
తెల్లారేసరికి
మడికట్లలో మొలిచిన వరికర్ర అమ్మ
...
వరికోతప్పుడు
వంపు తిరిగిన కొడవలి లిక్కిలాగే ఒంగి
వెంటాడుతున్న దుఃఖాన్ని కోసి
పక్కన పెడితివి
పారబట్టినప్పుడు, తట్ట మోసినపుడు
ఉయ్యాలో బిడ్డ గుర్తొచ్చి
పాలసేపుల్ని ఎట్లా ఆపుకుంటివో
అంటూ ఆర్తిగా అమ్మను గురించి వేర్వేరు కవితల్లో రాసిండు.

అట్లనే నాయిన గురించి రాస్తూ..
‘‘కడుపు నిండా నువ్‌ మేపుకొచ్చిన మేక
ఇంటిముందు
నీ జ్ఞాపకాలను నెమరేస్తుంటుంది
నీ తలకు కిరీటమై మెరిసిన ఎర్ర రుమాలు
కొన్ని చెమట చుక్కలను తాగి
ఒడవని ముచ్చట్లు చెబుతుంది. అంటూ నాయిన జ్ఞాపకాలను తాజా చేసుకున్నడు.

గోపాల్‌ కవిత్వంలో నేటివిటీ రికార్డయింది. తెలంగాణ పల్లె భాష, సంస్కృతి, ప్రకృతి, సహజ సిద్ధంగా రికార్డయ్యాయి. సిరసనగండ్ల జాతర, రుణం తీరకుండా చేసిన కల్వకుర్తి మన్ను, బోనాల పండుగ, అల్లం ఎల్లిపాయ పొట్టు, బోనం, డప్పుసప్పుళ్ళు, వేపరిల్లలు, ఈదయ్య తాత డప్పు, బొడ్రాయి పండుగ ఇట్లా గ్రామాల్లోని సబ్బండ కులాలు వాళ్ళ సంస్కృతి. తినే తిండి, పాడే పాట, ఆడే ఆట అన్నీ కవిత్వీకరించిండు. డిజిటల్‌ కాలంలో విలేజ్‌ జీవితాలను ఉన్నదున్నట్లుగా కండ్లముందుంచిండు.

గోరటి ఎంకన్న, కె.శివారెడ్డిలను కవితలుగా మలిచిండు. అట్లనే ఈతసాప, గల్లగురిగి, గుంతగిన్నె, ఆల్బమ్, కర్రీ పాయింట్లో జీతం, బాల్యం, నాన్న గొడ్డలి, కశ్మీరి అసిఫా, ఆత్మహత్య విషాదాలు, కేరళ తుపాను, యూపీలో ఆక్సిజన్‌ అందక చనిపోయిన పిల్లలు ఎన్నికలు, ఆత్మహత్యలు, విగతుడైన మిత్రుడు శ్రీనివాస్‌, చనిపోయిన ట్యూషన్‌మేట్‌ విజయలక్ష్మి, దేవక్క, మామిడి పండు కోసిండని చంపేయబడ్డ బక్కి శ్రీను గురించీ కవిత్వమల్లిండు. వాళ్ళ దుఃఖాన్ని ప్రపంచానికి తాన అనుభవిస్తున్న దుఃఖంగా చెప్పిండు.

ఎసరు, సర్వ, తొట్టె, కొప్పుబిళ్ళ, రేకలు, అరివారం, సుట్టబట్ట, సందెవాకిలి, సుట్ట, కొప్పెర, తండ్లాట, కమ్మకత్తి, గెగ్గె ఇట్లా ఇందులోని 56 కవితల్లో (ఒక ఇంగ్లీష్‌ పోయెమ్‌తో సహా) తెలంగాణ నెనరుని ఒంపిండు. మాలిన్యం లేని మనుషులను చిత్రికగట్టిండు. గోపాల్ బక్కపలుచటి మనిషైనా గుండెధైర్యంతో తోటోళ్ళ గుబులును దూరం చేసిండు. ధైర్యం నూరి పోసిండు. అందరికీ అవసరమైన కల్వకుర్తి, కలకొండ మట్టి పరిమళాన్ని, అక్షరాల్లో చిత్రించి (మంత్రించి కాదు) అందించినందుకు తగుళ్ళ గోపాల్‌కు అభినందనలు.

పదేండ్ల కిందటే ‘సింగిడి’ నిర్వహించే నెలా నెలా మీటింగ్‌లకు హాజరయిన గోపాల్‌ ఇవ్వాళ అందరికీ దండకడియం తొడుగుతూ, అక్షరాలతో ముద్దాడుతున్నడు. బండారుతో పట్నమేస్తుండు. బతకడానికి
‘‘గుండె సిలిమెలో
ఎప్పుడూ ఇన్ని కన్నీటిబొట్లు ఉంటే చాలు’’ అని చెప్పే గోపాల్‌ కవిత్వం తడి గుండె వాళ్ళందరికీ నచ్చుతుంది.
ఇంత మంచి కవిత్వాన్ని అన్ని తానే అయి అచ్ఛు రూపములోకి అదీ సూడంగనే గుండెల్లో దాసుకునేటట్టు తీసుకొచ్చిన యాకుబ్ భాయికి షుక్రియా…

- సంగిశెట్టి శ్రీనివాస్

Telangana Painter Kumarila swamy

 

విజ్ఞతతో వ్యవహరిద్దాం వివి విడుదల కోరుదాం


రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండడం దానికదే నేరం కాదు. చట్టానికి లోబడి ఆ విశ్వాసాలను ఆచరించడం, ప్రచారం చేసుకోవడము న్యాయసమ్మతం. ప్రజలు, సంస్థలు, వ్యక్తుల అభిప్రాయాలతో పాలకులు విబేధించవచ్చు. అంత మాత్రానా వారి నోరునొక్కడం, వేధించడం, నిర్బంధించడం తప్పు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఎ) ప్రజల వాక్‌ స్వాతంత్య్రానికి గ్యారంటీని ఇస్తున్నది. అయితే కాంగ్రెస్‌ మొదలు ఇవ్వాళటి బిజెపి వరకూ అన్ని ప్రభుత్వాలు మీసా, టాడా, యూఎపిఎ పేరిట కరడుగట్టిన నల్ల చట్టాలను తీసుకొచ్చి భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించాయి. ఈ దుర్మార్గం ఇంకా కొనసాగుతుంది. సంస్థలు, వ్యక్తుల హక్కులను హరిస్తూ, ప్రజస్వామిక భావనలను, విలువలను ఛిద్రం చేస్తూ ప్రభుత్వాలు అమానుషంగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలకు తావులేకుండా పోయింది. ఉంటే మాతోటి ఉండాలె. లేదంటే ‘దేశద్రోహి’వే అనే విధంగా అధికార మత్తులో పాలక పార్టీలు తమకు గిట్టని వారిపై ముద్రలు వేస్తున్నాయి.
సమాజం చైతన్యం అవుతున్న కొద్దీ నేర విచారణలోనూ, నిర్ధారణలోనూ మేలైన మార్పు రావాలి. కాని అందుకు విరుద్ధంగా విచారణ లేకుండానే నిందితులను- నేరస్థులుగా పరిగణించడం, వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా నిర్ధారించడం జరుగుతోంది. ఇవ్వాళ రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండడమే నేరంగా మారింది.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర చేసిండ్రంటూ ‘భీమా కోరెగావ్‌’ (ఎల్గర్‌ పరిషత్‌) ‘కుట్ర’ కేసులో దేశ వ్యాప్తంగా పదిమంది బుద్ధిజీవులను అరెస్టు చేసిండ్రు. వారిపై సవరణలు చేసి, మరింతగా పదును పెట్టిన అమానుష ‘యూఎపిఎ’ (అన్ లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్) చట్టాన్ని ప్రయోగించి బెయిల్‌కు వీలు లేకుండా కేసులు నమోదు చేసిండ్రు. ఇలాంటి కేసులే విప్లవ కవి, తెలంగాణ వాది వరవరరావు మీద కూడా పెట్టిండ్రు. అట్లాగే మరో కేసులో అంతర్జాతీయ న్యాయసూత్రాలకు పూర్తి విరుద్ధంగా 90శాతం వికలాంగుడైన సాయిబాబను ‘అండాసెల్‌’లో పెట్టిండ్రు.
న్యాయంకోసం- చట్టపరిధిలో కొట్లాడేందుకు ప్రభుత్వాలు ‘యూఎపిఎ’ పేరిట పెట్టిన కేసులు అడ్డొస్తున్నాయి. న్యాయదేవత కళ్ళకు గంతలు బదులు ఏకంగా ముసుగేసిండ్రు. ఇట్లాంటి కేసుల్లో సాధారణంగా విచారణాధికారం రాష్ట్రాలకు ఉంటుంది. అయితే అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారాలను సైతం హరించింది. మహారాష్ట్ర పరిధిలోని కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ తమ ఆధీనంలోకి తీసుకున్నది. కేంద్రం కక్ష సాధింపుకు, హై హాండెడ్నెస్ ధోరణికి ఇది మచ్ఛు తునక. ఈ పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా హక్కుల కార్యకర్తలు కరోనా సమయంలో సైతం ఈ బుద్ధిజీవుల విడుదలను డిమాండ్‌ చేస్తూ ఉద్యమిస్తున్నారు. సభలు సమావేశాలను నిర్వహిస్తున్నారు. చట్టం పేరిట తమ పాలకులు తమ ఇంటరెస్టులను అమల్లో బెడుతున్నారు. కాసేపు చట్టం ఏమి చెబుతుందనేది కొంచెంసేపు పక్కనబెడితే.. ముందుగా మనం మనుషులం. మనుషులుగా... మానవత్వమున్న మనుషులుగా ఆలోచిద్దాం.
ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ మే 1, 1861 నుంచి అమల్లోకి వచ్చింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌) సెక్షన్‌ 82 ప్రకారం ఏడేండ్ల లోపు బాలుడు ఏమి చేసిన నేరం కాదు. 2012 -నిర్భయ కేసు తర్వాతనే 16-18 ఏండ్లలోపు పిల్లలను తీవ్రాతి తీవ్రమైన కేసుల్లో మాత్రమే శిక్షార్హులుగా నిర్ణయించాలని తీర్పునిచ్చారు. నిజానికి 18 ఏండ్లలోపు పిల్లలు నేరాలు చేసినట్లయితే దానికి సమాజమే బాధ్యత వహించాలి. బాల నేరస్థులను ‘కరెక్షన్‌’ సెంటర్‌లో ఉంచి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని రాజ్యాంగం చెప్పింది. ఇందులో వయసు రీత్యా, నేర స్వభావం రీత్యా కొంత శిక్షల్లో తేడా ఉన్నది.
బాలలకు వర్తిస్తున్న చట్టాలే ‘వయోవృద్ధు’లకు కూడా అమలు చేయాలి. ఇందుకు ప్రభుత్వాలు మానవీయ దృష్టికోణాన్ని అలవరచుకోవాలి. ‘భీమా కోరెగావ్‌’ కేసులో అందరు నిందితులు ‘వయోవృద్ధులు.’ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ‘సీనియర్‌ సిటి జన్‌ చట్టం-2007’కు సవరణలు తీసుకొచ్చింది. దీని ప్రకారం పెద్దలను వేధిస్తే ఆరు నెలలు జైలు, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ సవరణలు తీసుకొచ్చింది. ఈ సవరణలను ప్రస్తుత బిజెపి ప్రభుత్వం తరపున సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థాపర్‌చంద్‌ గహలోత్‌ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిండు. వేధింపులంటే శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపూరితంగా, ఆర్థికంగా, దూషణ ద్వారా హింసించింనా వేధింపులే అని చట్టం చెబుతుంది. అట్లాగే సంరక్షణలో నిర్లక్ష్యం వహించినా వేధింపుగానే గుర్తించింది. కన్నపిల్లలు, దత్తత సంతానం, సవతి పిల్లలు, మనమలు, మనవరాండ్రు, అల్లుళ్ళు ఈ సంరక్షణ బాధ్యత తీసుకోవాలని చెబుతుంది. అంతేగాకుండా ఇట్లాంటి కేసుల్లో ప్రత్యేక ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేసి సత్వర న్యాయాన్ని చేకూర్చాలని కూడా చెప్పింది. 80 ఏళ్ళకు పైబడిన వారు దాఖలు చేసే పిటిషన్లను రోజుల్లోనే పరిష్కరించాలని కూడా ఈ చట్టం చెబుతుంది. అయితే బిజెపి ప్రభుత్వం తాను చేసిన చట్టాలను తానే అతిక్రమిస్తోంది. కనీసం తాము చెప్పే ‘పెద్దలను గౌరవించడం’ అనే సంప్రదాయానికి కూడా కట్టుబడి లేదు. పెద్దలు, వృద్ధులు, వికలాంగుల పట్ల ఎలాంటి ప్రత్యేకమైన శ్రద్ధ లేకుండానే కరడుగట్టిన నేరస్థులతో వ్యవహరించినట్లుగానే వారితోనూ వ్యవహరిస్తోంది.
వరవర రావు ఎనిమిది పదులు దాటిన వయసులో ఎక్కడికి పారిపోతాడని నిర్బంధంలో ఉంచి విచారిస్తున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో ‘కరోనా’ వైరస్‌ రాపిడ్‌గా స్ప్రెడ్‌ అవుతున్నది. ఈ పాండమిక్‌ పరిస్థితుల్లో జైలులో నిందితులకు, మరీ ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉండే ‘వయోవృద్ధుల’కు వైరస్‌ వేగంగా సోకే ప్రమాదమున్నది. అల్రెడీ వరవరరావుకు కోవిడ్‌ -19 పాజిటివ్‌ వచ్చింది. హక్కుల సంఘాల ప్రతినిధులు కోర్టుని ఆశ్రయిస్తే గాని మెరుగైన వైద్య సహాయం అందని స్థితి. వరవరరావు బాడీలో ఉండాల్సిన సోడియం, పోటాషియం లెవెల్స్‌ గణనీయంగా పడిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు హక్కుల సంఘాల వాండ్లు, ప్రజాస్వామిక వాదులు ఆందోళనలో ఉన్నారు. అట్లాగే 90శాతం వైకల్యంతో తన పనులు తాను చేసుకోవడమే కష్టంగా గడుపుతున్న సాయిబాబపై ‘దేశద్రోహం’ లాంటి తీవ్రమైన నేరాలు మోపిండ్రు. వికలాంగుల పట్ల కనీస గౌరవం, మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నారు.
గత ఐదు దశాబ్దాలుగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న ఉద్యమకారుడు, విప్లవ రచయిత సంఘం స్థాపకుల్లో ఒకరైన వరవరరావు రాజకీయ కార్యాచరణతో అందరికీ ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు అభిప్రాయం కలిగి ఉండడమే నేరం అనే విధంగా అరెస్టులకు తెరలేపింది. ఈ పరిస్థితుల్లో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం మెరుగైన, మేధోవంతమైన సమాజానికి సూచికగా గుర్తించాలి. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విఘాతం కలిగిస్తూ అమానవీయమైన చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. చట్టాలు అమానవీయంగా ఉన్నప్పుడు మాట్లాడాల్సింది ప్రజా ప్రతినిధులు. అయితే ఈ ప్రజా ప్రతినిధులు ప్రజలకు పూచిదారులుగా కాకుండా, కాళోజి అన్నట్టు ‘పార్టీవ్రత్యం’తో పార్టీలకు బద్ధులు కావడంతో సమస్యలు మరింత జఠిలంగా తయారయ్యాయి. ఎక్కడ సమస్యుందో పరిష్కారం కోసం కూడా అక్కడే వెతకాల్సిన అవసరమున్నది. అందులో భాగంగానే చట్ట పరిధిలోనే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. ప్రజాస్వామిక వాదులందరూ ప్రభుత్వంపై వత్తిడి పెంచి నల్ల చట్టాలు చెల్లబోవని తేల్చి చెప్పాలి.
ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని, దేశ చట్టాలను గౌరవిస్తామని ప్రమాణం చేసి పదవులు చేపట్టిన వ్యక్తులు ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు రోజుకు 50వేలు దాటి విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో జైళ్లల్లో ఖైదీలకు ముఖ్యంగా ‘వయోవృద్ధులై’న ఖైదీలకు రక్షణ లేదు కాబట్టి వారిని వెంటనే విడుదల చేయాలి. ఆరు పదులు దాటిన వారందరినీ ప్రభుత్వం ‘రిటైర్‌’ చేసి వృద్ధులుగా గుర్తిస్తుంది. అంతర్జాతీయ కోర్టు ప్రమాణాలను లెక్కలోకి తీసుకున్నా 65 ఏండ్లు నిండిన వారిని ‘వయోవృద్ధులు’గా గురించాలి. అంతర్జాతీయ మానవ హక్కుల చార్టర్‌- వృద్ధుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెబుతుంది. అందువల్ల ఈ విషయంలోనూ అరవైఐదేండ్లు దాటిన వారిని, విచారణలో ఉన్న నిందితులను వెంటనే విడుద చేయాలి. ‘కరోనా’ సమయంలో ఇది ప్రభుత్వాల బాధ్యత కూడా!
నిజానికి ‘జువెనైల్‌’ చట్టం లాగానే ‘సీనియర్ సిటిజెన్’ చట్టంలో మెరుగైన మార్పులు తీసుకొచ్చి నేర తీవ్రత/శిక్షార్హతను బట్టి వారికి మినహాయింపును ఇవ్వాలి. బెయిలు సదుపాయం కల్పించాలి. ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు అంతర్జాతీయ న్యాయసూత్రాలను, మానవ హక్కుల కమిటీ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలి. వాటిని ఆదర్శంగా పాటించాలి.
వచ్చే పంద్రాగస్టు (2020) నాటికి తెలంగాణలోని జీవిత ఖైదీలను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది ఆహ్వానించదగ్గ నిర్ణయం. అట్లాగే తెలంగాణ ముద్దుబిడ్డ వరవరరావు విడుదలకు కూడా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాల్సిన బాధ్యత ఉన్నది. 2005లో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కేంద్రమంత్రి హోదాలో చంచల్‌గూడా జైలులో ఖైదీగా ఉన్న (నిషేధిత విరసం సంస్థ బాధ్యుడుగా) వరవరరావుని నిబంధనలను అధిగమిస్తూ కలిసిండు. ఆయన విడుదలను డిమాండ్‌ చేసిండు. ప్రజల హక్కుల కోసం పోరాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు గౌరవం, మర్యాద, గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తి వరవరరావు. అంతే కాదు నిఖార్సైన తెలంగాణ వాది. తెలంగాణ ప్రేమికుడు. 1968 నుంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఆనాడు తెలంగాణ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ తరపున జయశంకర్‌ సార్‌తో కలిసి ఉద్యమాలు చేసిండు. రచయితగా తన కర్తవ్యాన్ని నిర్వర్వించిండు. అట్లాంటి వ్యక్తిని ‘యూఎపిఎ’ చట్టం కింద అరెస్టు చేసి బెయిలు నిరాకరించడం అమానుషం. వరవరరావు అరెస్టు తెలంగాణ గౌరవం, ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి ఆయన విడుదలకు చట్ట పరిధిలో ఉన్న అవకాశాలన్నింటిని తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోవాలి. తమకు కేంద్ర నాయకులతో ఉన్న సత్సంబంధాలను వివి విడుదల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వినియోగిస్తే తప్పేమి లేదు. ఎందుకంటే 2018-19 ఎన్నికల సమయములో ఈ విషయాలను కేసీఆర్ సభల్లో మాట్లాడిండు కూడా. వివి విడుదలను డిమాండ్ చేయడం వల్ల కేసీఆర్ గౌరవం ఇనుమడిస్తది కూడా. కాళన్న, జయశంకర్‌ సారు బతికుంటే ఇదే కోరుకునేవారు. జయశంకర్‌ సారు సిద్ధాంతాలతో నడుస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా వివి విడుదలకు కృషి చేయాలి.
వరవరరావు రాజకీయ విశ్వాసాలతో విభేధాలున్నప్పటికీ చట్టపరిధిలో తెలంగాణ ప్రభుత్వం ఆయన విడుదలకు ఏ విధంగా తోడ్పడగలదో ఆలోచించాలి. మాట సాయం, న్యాయ సాయం, నైతిక మద్ధతు ఇట్లా అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం మద్ధతు తెలిపేందుకు అవకాశమున్నది. నల్ల చట్టాలను సమర్ధిస్తూ పోయినట్లయితే ఎపుడో అపుడు ఎంతటి వారైనా దాని కోరల్లో చిక్కుకు పోయే ప్రమాదమున్నదనే సోయితో ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు మెలగాలి.
వీటన్నింటి కన్నా ముందుగా జాతీయ మానవహక్కుల సంఘం జోక్యంతో ముంబయి సెయింట్‌ జార్జ్‌ హాస్పిటల్‌లో కోవిడ్‌-19కు చికిత్స పొందుతున్న వరవరరావుకి మెరుగైన వైద్య సహాయం అందేలా మహారాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్రం తరపున అధికారికంగా వత్తిడి తీసుకురావాలి. ఆయన ప్రాణాలు కాపాడడం తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా గుర్తించి అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.

శ్రీ శ్రీ అలభ్య రచన ప్రయాణం

 

tributes to Jayashankar sir

 

Forgotten pioneer Madipaga Balaramacharya


Add caption

Tributes to Samala Sadashiva

 Tributes to Samala Sadashiva


It is hard to digest that the multi-talented son of the soil Samala Sadashiva has not got his due recognition even in our own state Telangana. He is the last Telangana person to receive(till now) Kendra sahitya academy award in Telugu. He got this award in 2011 for his book titled ‘swaralayalu’.Poet, story writer, essayist, novelist and learned musicologist who hailed from Adilabad strived hard to serve the language, literature and culture of Telangana. Apart from this he is a wonderful painter. On the advice of luminary Suravaram Prathapa Reddy he took to poetry and excelled in it. Over six decades he constantly wrote in different genres. He dedicated his life to study and expose the Telangana talent. He was gulf between the younger and old generation of literary saga. Sadashiva was a hard core Telangaanite. When the Telangana writers meet was held at Adilabad on the initiation of Sridhar Deshpande and other friends as a father figure he inaugurated it and spoke at length. I was one of the many curious participants of the meet.After the formation of Telangana state, school textbooks changed. In the changed scenario Sadashiva’s writings included it. It is a welcome step. But the government of Telangana should recognize his yeoman service and name any one of the music college after Sadashiva, and his birth anniversary may be celebrated as native music day.Friends are celebrating this august month as “social justice month” hence I request the friends to pay floral tributes to this Padmashali pioneer on his Vardhanthi.. 

Vattikota natikalu