Monday, August 10, 2020

గొల్ల పెద్దయ్య మనవడు గోపాల్ ‘దండకడియం’ కు దండాలు

ఇవ్వాళ తెలుగు సాహిత్య సమాజం దాదాపు మొత్తంగా ఇజాల వారిగా విడిపోయి వుంది. ఇది ఒక్క తెలుగు సాహిత్యానికి మాత్రమే పరిమితమయిందని కూడా నిర్ధారించలేము. ఇట్లా విడిపోవడం తప్పా, ఒప్పా అనే తీర్పుని కూడా నేనేమివ్వడం లేదు. అది వేరే చర్చ. అయితే ఇందుకు భిన్నంగా యిజాలకి సంబంధం లేకుండా తాను చూసిన జీవితాలను, తన అనుభవంలోని అంశాలను ఆధునిక తత్వ్తకవిగా, ధైర్యం నూరిపోసే సూఫీగా తగుళ్ళ గోపాల్‌ ‘దండకడియం’లో కైగట్టిండు. పోస్టుమాడర్నిజం ఐడియాలజీలో ఏ యిజం లేకపోవడం కూడా ఒక ఇజమే. జీవితానుభవాలు ప్రపంచ పోకడలపై అవగాహన రెండింటి మేళవింపుతో మా‘నవ’ సంస్కృతి మెరుగవుతూ ఉంటుంది. వీటిని ప్రకృతి, ప్రకృతి నుంచి తయారు చేసిన చోదక శక్తులకు హేతుబద్ధంగా, తార్కికంగా జోడించడంతోనే ఏ ఫిలాసఫీ అయినా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా జరిగే జ్ఞానంలోని ఘర్షణే చైతన్యం, ఉద్యమాలు. వెరసి జీవితాలు. ఇట్లా అన్ని ఫిలాసఫీలకు మాతృక లాంటి బతుకుల్ని గోపాల్‌ ‘దండకడియం’మీద చెక్కిండు. తనదైన ముద్రను ఏసిండు. మూడు పదులు నిండకుండానే నిండు జీవితానికి సరిపడ అనుభవాన్ని గొంగట్లో నింపుకున్నడు.

కథ చెప్పుకుంటూ వచ్చినట్లు కవిత రాయడం కష్టం. కథ వింటూ ఊ కొడుతున్న ఫీలింగ్‌ గోపాల్‌ కవిత్వం చదువుతూ ఉంటే తెలుస్తది. ఈ కవిత్వం ఊకొట్టించింది గాని జో కొట్టించలేదని గుర్తించాలి. మనం మనుషులం అని మరోసారి గుర్తు చేసింది. గ్రామీణ జీవిత సుఖదుఃఖాలను కమ్మ, కమ్మకు ఆగి రియాల్టీ చెక్‌ చేసుకునే విధంగా, ఎవరికి వారు ఎనుకటి జీవితాలకు అన్వయించునే తీరుగా కవితలల్లిండు. కేంద్రం నుంచి (సెంట్రల్‌ పాయింట్‌)నుంచి అసుంట అసుంట అంటూ కొసాకు నెట్టేయబడ్డ మనుషుల ఎతలను, తల్లడమల్లడమవుతున్న బతుకులకు అక్షరాలతో పాణంపోసిండు. గోపాల్‌ తన తాత గొల్ల పెద్దయ్య ఎట్లా అయితే
‘‘ముక్కుకు బట్టగట్టుకోకుండ
మేక కడుపులో చేయిపెట్టి
సచ్చేపిల్లల్ని బతికిం’చెటోడో అట్లనే ఈ 164 పేజిల పుస్తకంతో నవుస్తున్న తెలుగు సమాజానికి జీవిగంజి పోసిండు.
ప్రతి కవితలోని ముగింపు పాదాలు చదువుతున్నప్పుడు పాణాలు ఉగ్గబట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కవితంతా బతుకుని, ఎతలను పరుస్తూ చివర్లో నువ్వు మనిషివి, మానవత్వమున్న పాఠకుడివి అని ఈపుల సరుపు సరిశి తెలివిలోకి తెచ్చిండు. సోయి తెచ్చుకొని తోటోడికి తోచిన సాయం జెయ్యమని ఆర్తిగ చెప్పిండు. ఈ కవితలతో గోపాల్‌ నేను గొప్పోణ్ణి, నాకు ఎదురులేదు అని విర్రవీగే ప్రతి ఒక్కడిని ఆత్మపరిశీలనకు పురిగొల్పిండు. నిజాయితీగా, నిస్వార్థంగా ఉన్నవాణ్ణి నిటారుగా నిలబెట్టిండు. అలయి బలయి తీసుకుండు.
ఈ కవితల్లో గ్రామీణ జీవితాల్లోని సౌందర్యాన్ని, అక్కడి మట్టిమనుషుల ముఖ్యంగా కొసాఖరుకు నెట్టేయబడ్డ బహుజన బిడ్డల బతుకును పావురంగా అలుముకున్నడు. అట్లనే ఈ కవిత్వంతో రోగమొచ్చిన గొర్రెను మంద నుంచి నైపుణ్యంగా తప్పించి హెర్డ్‌ ఇమ్యునిటీ పెంచినట్లుగా మంచీ/చెడూ ఎంచి చూపిండు. బతుకు మీద అపేక్షను పెంచిండు. ‘నిండుగ పూసిన/ తంగేడు లాంటి స్వచ్ఛమైన/ ప్రేమను వాగు’గా పారిచ్చిండు. మొత్తం మీద సమాజం మేలు కోసం అక్షరాల ఇత్తులు ఏసిండు. దానికి నీళ్ళుపోసి పెంచే బాధ్యతను సాహిత్య ప్రపంచానికి/పాఠకులకు ఒదిలిపెట్టిండు.
తన జీవితమే గాకుండా చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా రాసిండు. ‘ముల్లు పాఠం’ పేరిట తన బాల్యాన్ని ఇట్లా పంచుకున్నడు.
‘‘కంప మీదంగ, ఒరికొయ్య మీదంగ
ఎగిరి దుంకి ఆవుల్ని మర్లేసినంక
తూట్లు పడిన జల్లెడలాగ అరికాళ్ళు
ఎక్కడ కూర్చుంటే అక్కడ
కాళ్ళను ముందలేసుకొని
ముండ్లను తీయడంతోనే
గడిచిపోయింది బాల్యం’’ అని తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నడు.

‘‘తెంగాణమంటే
రాలిన పూలతో గట్టిన
మందారపూల దండ
వీరు రక్తంతో గీసిన చిత్రపటం’’ అంటూ అమరుల త్యాగాన్ని చిత్రికగట్టిండు.

అట్లాగే యుద్ధం చేయకుంటే సచ్చుడే! యుద్దం షురువ్‌ జేసినవాడు కాదు, ముగింపు తెలిసిన వాడు యోద్ధ అంటడు.
‘‘ఏకాంతంగా దుఃఖిస్తున్నప్పుడు
కన్నీళ్ళతో పాటు
కొన్ని అక్షరాలూ రాలుతుంటాయి
దోసిట్లో పట్టి కాగితంపై చల్లితే
పచ్చని కావ్యాలు మొలవచ్చు
భరించలేనంత దుఃఖమని
చెట్టునో, చెరువునో వెతుక్కుంటే ఎట్లా?...!?’’ అంటూ చావు పరిష్కారం కాదంటాడు. ధైర్యంగా కొట్లాడాల్సిందే అని తెగేసి చెబుతాడు. సాటి మనుషుల మీద అలవిమాలిన ప్రేమను వ్యక్తం జేస్తాడు. తనకు సుట్టం గాకపోయినా.. ఆఖరికి అనాథ అయినా ఒక సూఫీలాగా ప్రేమను పంచుతాడు. బంధుత్వం లేకపోయినా, నాగరికత బంధనాలు వేస్తున్నా వాటిని అధిగమిస్తూ వారిని అక్కున చేర్చుకున్నడు.

‘‘మా మధ్య ఏ బంధుత్వమూ లేకపోయినా
ఆమె నన్ను నాయనా... అంటది
నేను ఆమెను అమ్మా... అంట
ఒకే ఆకాశాన్ని కప్పుకున్నం
ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళం
ఇది చాలదా
మేము బంధువులం కావడానికి’’ అంటూ వృద్ధ అనాథను ఆదరించిండు. అక్షరీకరించిండు. ఆనాథను ఆదరించినట్లే ఊరి చెరువును ఆడబిడ్డగా చెప్పిండు.

‘‘ఊరి మైలనంతా కడిగి
గుండె గూట్లో దీపం వెలిగించే
చెరువు కూడ మనింటి ఆడబిడ్డే’’.
సొంత అక్క హంసక్కను, దేవక్కను యాద్జేసుకున్నడు. అట్లనే అంతే ప్రేమతో ఎరుకళ్లోల్ల లింగక్కనూ కైగట్టిండు. నాయినమ్మా, నాయిన గురించీ, తాత గురించీ రాసిండు. తల్లిని గూర్చి గోపాల్‌ కవిత సదివిన అందరూ తల్లడమల్లడ మైతరు. గుడ్లల్ల నీళ్లు దీసుకుంటరు. అమ్మని దేవులాడుకుంటరు. తల్లి మీద ప్రేమనే కాదు గొల్ల సంస్కృతి, సంప్రదాయాన్ని కూడా చిత్రించిండు. అమ్మను ఇట్లా యాదిజేసుకున్నడు.

‘‘దారి తెల్వకున్నా
ఎన్నో దూరాలు దాటి
నూనె కారిపోతున్న చట్నీ డబ్బాలతో
మా హాస్టలు ముందు నిలబడ్డ
దేవగన్నేరు..
...
పొద్దుటి నుంచి పొద్దుందాక
మెదమోసి, వడ్లు దులిపి
కుండెడు వడ్లను నెత్తినబెట్టుకొని
పచ్చినొప్పులతో ఇంటికి జేరే మా అమ్మనే
ఒక జానపద పాట
...
పుట్టింటి నుండి
దమ్మురోగాన్ని ఎంట దెచ్చుకున్నా
ఎముకల్ని కొరికే సలిలో లేసి
సన్నీళ్లలో చేయిపెట్టి పనిజేసి
పొయ్యిమీద బువ్వై ఉడికి
తెల్లారేసరికి
మడికట్లలో మొలిచిన వరికర్ర అమ్మ
...
వరికోతప్పుడు
వంపు తిరిగిన కొడవలి లిక్కిలాగే ఒంగి
వెంటాడుతున్న దుఃఖాన్ని కోసి
పక్కన పెడితివి
పారబట్టినప్పుడు, తట్ట మోసినపుడు
ఉయ్యాలో బిడ్డ గుర్తొచ్చి
పాలసేపుల్ని ఎట్లా ఆపుకుంటివో
అంటూ ఆర్తిగా అమ్మను గురించి వేర్వేరు కవితల్లో రాసిండు.

అట్లనే నాయిన గురించి రాస్తూ..
‘‘కడుపు నిండా నువ్‌ మేపుకొచ్చిన మేక
ఇంటిముందు
నీ జ్ఞాపకాలను నెమరేస్తుంటుంది
నీ తలకు కిరీటమై మెరిసిన ఎర్ర రుమాలు
కొన్ని చెమట చుక్కలను తాగి
ఒడవని ముచ్చట్లు చెబుతుంది. అంటూ నాయిన జ్ఞాపకాలను తాజా చేసుకున్నడు.

గోపాల్‌ కవిత్వంలో నేటివిటీ రికార్డయింది. తెలంగాణ పల్లె భాష, సంస్కృతి, ప్రకృతి, సహజ సిద్ధంగా రికార్డయ్యాయి. సిరసనగండ్ల జాతర, రుణం తీరకుండా చేసిన కల్వకుర్తి మన్ను, బోనాల పండుగ, అల్లం ఎల్లిపాయ పొట్టు, బోనం, డప్పుసప్పుళ్ళు, వేపరిల్లలు, ఈదయ్య తాత డప్పు, బొడ్రాయి పండుగ ఇట్లా గ్రామాల్లోని సబ్బండ కులాలు వాళ్ళ సంస్కృతి. తినే తిండి, పాడే పాట, ఆడే ఆట అన్నీ కవిత్వీకరించిండు. డిజిటల్‌ కాలంలో విలేజ్‌ జీవితాలను ఉన్నదున్నట్లుగా కండ్లముందుంచిండు.

గోరటి ఎంకన్న, కె.శివారెడ్డిలను కవితలుగా మలిచిండు. అట్లనే ఈతసాప, గల్లగురిగి, గుంతగిన్నె, ఆల్బమ్, కర్రీ పాయింట్లో జీతం, బాల్యం, నాన్న గొడ్డలి, కశ్మీరి అసిఫా, ఆత్మహత్య విషాదాలు, కేరళ తుపాను, యూపీలో ఆక్సిజన్‌ అందక చనిపోయిన పిల్లలు ఎన్నికలు, ఆత్మహత్యలు, విగతుడైన మిత్రుడు శ్రీనివాస్‌, చనిపోయిన ట్యూషన్‌మేట్‌ విజయలక్ష్మి, దేవక్క, మామిడి పండు కోసిండని చంపేయబడ్డ బక్కి శ్రీను గురించీ కవిత్వమల్లిండు. వాళ్ళ దుఃఖాన్ని ప్రపంచానికి తాన అనుభవిస్తున్న దుఃఖంగా చెప్పిండు.

ఎసరు, సర్వ, తొట్టె, కొప్పుబిళ్ళ, రేకలు, అరివారం, సుట్టబట్ట, సందెవాకిలి, సుట్ట, కొప్పెర, తండ్లాట, కమ్మకత్తి, గెగ్గె ఇట్లా ఇందులోని 56 కవితల్లో (ఒక ఇంగ్లీష్‌ పోయెమ్‌తో సహా) తెలంగాణ నెనరుని ఒంపిండు. మాలిన్యం లేని మనుషులను చిత్రికగట్టిండు. గోపాల్ బక్కపలుచటి మనిషైనా గుండెధైర్యంతో తోటోళ్ళ గుబులును దూరం చేసిండు. ధైర్యం నూరి పోసిండు. అందరికీ అవసరమైన కల్వకుర్తి, కలకొండ మట్టి పరిమళాన్ని, అక్షరాల్లో చిత్రించి (మంత్రించి కాదు) అందించినందుకు తగుళ్ళ గోపాల్‌కు అభినందనలు.

పదేండ్ల కిందటే ‘సింగిడి’ నిర్వహించే నెలా నెలా మీటింగ్‌లకు హాజరయిన గోపాల్‌ ఇవ్వాళ అందరికీ దండకడియం తొడుగుతూ, అక్షరాలతో ముద్దాడుతున్నడు. బండారుతో పట్నమేస్తుండు. బతకడానికి
‘‘గుండె సిలిమెలో
ఎప్పుడూ ఇన్ని కన్నీటిబొట్లు ఉంటే చాలు’’ అని చెప్పే గోపాల్‌ కవిత్వం తడి గుండె వాళ్ళందరికీ నచ్చుతుంది.
ఇంత మంచి కవిత్వాన్ని అన్ని తానే అయి అచ్ఛు రూపములోకి అదీ సూడంగనే గుండెల్లో దాసుకునేటట్టు తీసుకొచ్చిన యాకుబ్ భాయికి షుక్రియా…

- సంగిశెట్టి శ్రీనివాస్

No comments:

Post a Comment

Vattikota natikalu