Showing posts with label gundu achamamba telugu writer. Show all posts
Showing posts with label gundu achamamba telugu writer. Show all posts

Wednesday, July 1, 2020

ఆధునిక మహిళా సాహిత్యానికి ఆద్యులు గుండు అచ్చమాంబ!


సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశీలన, పరిశోధన మారుతూ ఉంటుంది. తెలుగు సాహిత్యం అందుకు మినహాయింపు కాదు ఇన్నాళ్ళు అంతగా పట్టింపులో లేని మహిళా, దళిత సాహిత్యాలను విశ్వవిద్యాయాల్లోని అధ్యాపకులు ఇప్పుడు కొత్తగా పట్టించుకుంటున్నారు. గతంలో మాదిరిగా పౌరాణిక, ఆధ్యాత్మిక సాహిత్యంపై గాకుండా ఆధునిక సాహిత్యంపై ఎక్కువ పరిశోధనకు అవకాశం కల్పిస్తున్నారు. శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ ఆచార్యుల దగ్గర విద్యార్థులు ఆయా అంశాలపై కొత్తగా పరిశోధనలు చేస్తున్నారు. విస్మరణకు గురైన లేదా చరిత్రకెక్కని విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. వారందరికీ అభినందనలు. కొంత మంది ఆచార్యులు సైతం అక్కడక్కడ కొత్త విషయాలను ఆవిష్కరిస్తున్నారు. అయితే వీరందరికీ భిన్నంగా రిటైరైన తర్వాత మరింత ఎక్కువగా పరిశోధన చేస్తున్న వారు ఆచార్య కాత్యాయని విద్మహే గారు.

నిరంతరం పరిశోధన చేస్తూ కొత్త ఆవిష్కరణలు చేస్తూ, విషయాలను కొత్త కోణంలో ఆవిష్కరించే వారిలో ముందువరుసలో ఉన్నవారు ప్రొఫెసర్‌ కాత్యాయని విద్మహే గారు. రిటైరైన తర్వాత అటు దళిత సాహిత్యాన్ని, ఇటు స్త్రీల సాహిత్యాన్ని నూతన అంశాలతో పున: ఆవిష్కరిస్తున్నారు. అందుకు ముందుగా మేడమ్‌కు ధన్యవాదాలు.
కాత్యాయని విద్మహే గారి గౌరవ సంపాదకత్వములో వెలుడుతున్న ‘దగోదావరి’ అంతర్జాల సాహిత్య మాసపత్రికలో ‘ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర’ పేరిట వ్యాసాల పరంపరను రాస్తున్నారు. ఇందులో ఇంతవరకు తెలుగు సాహిత్యం అంతగా పట్టించుకోని విషయాలను, విస్మరణకు గురైన అంశాలను, ప్రధానంగా మహిళా దృక్కోణంలో చరిత్రకెక్కిస్తున్నారు. అందులో భాగంగానే మేడమ్‌ ‘గుండు అచ్చమాంబ’ గురించి వివరంగా రాసిండ్రు. ఈ వ్యాసం బహుశా ఏప్రిల్ నెలలో అచ్చయి వుంటుంది. వ్యాసంలో అచ్చమాంబ రచనలను పేర్కొన్నారు. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో మొదటి మహిళగా ఆమెను గురించి పరిచయం చేసిండ్రు. అంతకుముందు ఒకరిద్దరు రచయిత్రులున్నా వారి రచనలు ఒకటి అరా తప్ప పెద్దగాలేవు. అచ్చమాంబ గురించి రాసిన వ్యాసం ముగింపులో కాత్యాయని విద్మహే గారు ‘‘ఇంతకూ అసలు అచ్చమాంబ అస్తిత్వం ఏమిటి? గుండు వాసుదేవశాస్త్రి మేనకోడలు కనుక ఆమె పుట్టింటి వారి ఇంటి పేరు మరేదో అయివుంటుంది. మేనరికం వల్లనో మేనమామ ఇంటి పేరింటి సంబంధం కావడం వల్లనో ఆమె గుండు అచ్చమాంబ అయివుంటుంది. ఆమె జననం, తల్లిదండ్రుల వివరాలు, పెంపకం, చదువు, పెళ్లి, సంతానం మొదలైన వ్యక్తిగత వివరాలేవీ ఇప్పటికీ తెలియవు. పుస్తక ప్రచురణను బట్టి గోదావరి జిల్లాలోనూ, గుంటూరు లోనూ ఆమె ఉన్నట్లు ఊహించవచ్చు’’ అని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇది ఏ నెల సంచికో వివరాలు తెలియడం లేదు. బహుశా ఏప్రిల్‌ 2020 నాటి సంచిక అయి వుంటుంది. ఈ వ్యాసాన్ని నేను ఇటీవలే చదివిన. ఆ వ్యాసం చదివిన తర్వాత నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకునేందుకు ఈ ప్రయత్నం.
ఇప్పుడిక్కడ గుండు అచ్చమాంబ తల్లిదండ్రుల వివరాలను సైతం జోడిస్తున్నాను. ఆమె తల్లి, పినతల్లి కూడా కవయిత్రులే అనే విషయాన్ని కూడా రికార్డు చేస్తున్నాను. అయితే ఆ వివరాల్లోకి వెళ్ళే కన్నా ముందు అచ్చమాంబ గురించి ఆమె రచనల గురించి కొంత తెలుసుకుందాం!
కాత్యాయని మేడమ్‌ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి నేను మొదలు పెడతాను. నేను గతంలో భండారు అచ్చమాంబ కథల కోసం పాత పత్రికలను తిరగేస్తున్న సమయంలోనే నామసామ్యం మూలంగా గుండు అచ్చమాంబ పేరును తరచూ చూసిన. పది పన్నెండేండ్ల జ్ఞాపకం ఇంకా తాజాగానే ఉంది. ఆమె చిత్రం కూడా చూసినట్టు గుర్తు. ఇప్పుడు మళ్ళీ అన్నీ తిరగతోడినట్లయితే ఆమె చిత్రం బయటపడే అవకాశముంది. అది అట్లా ఉండనిచ్చి ముందుగా ఆమె రచనలను చూద్దాం. ‘‘1907లో ప్రచురితమైన సత్కథామంజరి వెనక భాగాన ‘ఏ తద్గ్రంధ కర్తచే రచియింపబడిన గ్రంధము’ అనే శీర్షికన క్రింద పేర్కొనబడిన వాటిలో వసంతర్తు, వర్షర్తు వర్ణనము, మనీషా పంచకముతో పాటు సుఖము, ధూమశకటము, నక్షత్రశాల ఖండికలు కూడా ఉన్నాయి. వాటితో పాటు మోతిమహలు అనే ఖండిక కూడా ఉంది. అంటే ఇవన్నీ 1907లోగా ప్రచురింపబడ్డాయన్న మాట’ అంటూ విద్మహే గారు ఆమె రచనలను పేర్కొన్నారు. వీటికి తోడుగా ‘రామేశ్వర యాత్రా చరిత్ర’, ‘శ్రీకాళహస్తీశ్వర కళ్యాణోత్సవము’, ‘ శ్రీవిక్టోరియా మహారాజ్ఞి చరిత్ర’, ‘శ్యమంతకమణి’ నాటకం కూడా వ్రాసినట్లు సత్కథా మంజరి వెనుక పేజీ సమాచారం ఆధారంగా మేడమ్‌ పేర్కొన్నారు. ఈనాటకం గురించి తెలుగునాటక వికాసం లో పోణంగి శ్రీరామ అప్పారావు కూడా రాసిండ్రు. అట్లాగే సత్కథా మంజరి పుస్తకం వెనుక అట్టపై ‘కలగూరగంప’ పేరిట అచ్చమాంబ రచనను పేర్కొన్నారు. దీన్ని మేడం మిస్సయ్యారు. రెండవ కూర్పునకు రాసిన పీఠికలో అచ్చమాంబ తన రచనల గురించి ఇలా పేర్కొన్నది. ‘‘నాకును నన్నయభట్టునకును, తారతమ్యము హస్తికము మించునప్పటికిని, నా తమ్ముడు ప్రస్తుతము బాపట్ల రిజిష్ట్రారగు చి॥భువనగిరి కోదండపాణి నన్నయ భట్టునకు నారాయణభట్టుగా తోడు చూపుచున్నాడు. అతను వ్రాసిన ..స్థాప’ యందతని సామర్ధ్యము లోకులెఱుంగుదురు గాక’’ అని రాసింది. అంటే భువనగిరి కోదండపాణిని తమ్ముడులాంటి వాడిగా పేర్కొన్నది. ఈమెకు కోదండపాణి దగ్గరి బంధువయ్యుంటాడు. భువనగిరి అఖిలాండమ్మ మహిళను పెద్దమ్మగా పేర్కొన్నది. ఈ కోదండపాణి ‘జరాసంథవధ’ నాటకాన్ని రాసినట్లు సత్కథామంజరి పుస్తకం వెనుక అట్టపై సమాచారం వల్ల తెలుస్తుంది. అట్లాగే ‘గుండు అచ్చమాంబికా ప్రణీతముయిన ఋషభ మహాకావ్యము, ఘోషాయాత్రా నాటకము త్వరలోనే వెలువడును’ అని కూడా ఈ పుస్తకం వెనుక అట్టపై రాసిండ్రు. ఇవి గాక భారతీయ వీరులు (1920), శ్రావణ మంగళవారము కథ, పాటలు (1926) రచనల గురించి తెలుగు సాహిత్య కోశం (ఆధునిక విభాగం)లో పేర్కొన్నారు. ఇందులో శమంతకమణి నాటకం గురించి రాస్తూ ‘‘శ్రీకృష్ణుడు శమంతక మణిని జాంబవంతుని దగ్గర నుంచి తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చి, సత్యభామను వివాహమాడటం ఇతివృత్తం. ఈ రెండు గ్రంథాలకు గుండు వాసుదేవ శాస్త్రి గారే పీఠికలు రాశారు. వీరి రచనలు సంప్రదాయరీతిలో, సుబోధకమైన శైలిలో ఉన్నాయి. వీరు స్త్రీ విద్య, ఆంధ్ర సంగీతము వంటి విషయాలపై సమాకాలిక పత్రికలో వ్యాసాలు రాశారు.(1912-1923) తెలుగు నాటక వికాసం పుస్తకం ఆధారంగా ‘సాహిత్య కోశం’లో రాసిండ్రు. ఈ వివరాలన్నీ కాశీనాథుని నాగేశ్వరరావు సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్రవాఙ్మయ సూచికలో (పేజి 250) కూడా ఉన్నాయి. కాళహస్తీశ్వర కళ్యాణోత్సవం 1904లో అచ్చయ్యింది. (కాశీనాథుని నాగేశ్వర రావు, 1994: పేజీ 39). రామేశ్వర యాత్రా చరిత్ర (1900) సంవత్సరములో అచ్చయ్యింది. (కాశీనాథుని నాగేశ్వర రావు 1994: పేజీ 273)
‘శ్రీసత్కథామంజరి’ మొదటి భాగం రెండో ముద్రణ 1920లో గుంటూరులోని చంద్రికా ముద్రణాలయంలో జరిగింది. ప్రథమ ముద్రణకు కాకినాడ నుంచి 10 ఏప్రిల్‌ 1907 నాడు అచ్చమాంబ మేనమామ గుండు వాసుదేవశాస్త్రి పీఠిక రాస్తూ ఈ రచన ‘ఆరేండ్ల క్రిందటే విరచితమయింది’ అని రాసిండు. అంటే ఈ గ్రంథ రచన కాలం 1901. ఇందులో మొత్తం తొమ్మిది మందివి శ్రీ రామకృష్ణ, రుక్మాంగద, ధృవ, శ్రీరామ, అంబరీష, గజేంద్ర, మార్కండేయ, కుచేల, ప్రహ్లాద చరిత్రలున్నాయి. రచయిత్రి నివాసం అప్పుడు గుంటూరులోని అరుండల్‌ పేట.
‘శ్రీ సత్కథామంజరి’ రెండో సంపుటి ‘హిరోయిన్స్‌’ అనే ఇంగ్లీష్‌ టైటిల్‌తో (లోపల సత్కథామంజరి అని తెలుగులో ఉంది) 1920లో వెలువడింది. ఇందులో సీత (శ్రీరాముని భార్య), శకుంతల (దుష్యన్తునిభార్య), దమయంతి (నలచక్రవర్తి భార్య), సావిత్రి (సత్యవంతుని భార్య), చంద్రమతి (హరిశ్చంద్రుని భార్య), సుకన్య (చ్యవనఋషి భార్య), మంగళాంబ (మంగళగౌరీ వ్రత విఖ్యాత భార్య), సత్యవతి (ప్రేమానంద స్వామి భార్య), పద్మావతి (జయదేవ స్వామి భార్య) గురించి చరిత్రలను పద్యాల్లో రాసింది. ఇందులో పద్మావతి ‘అష్టపదులు’ వ్రాసిన భక్తాగ్రేసరుడు జయదేవుని ధర్మపత్ని. నవీన చరిత్రములో నాంగ్లేయుల మెదటి దినములలో నిక్కట్టుల పాలైన పతివ్రత సత్యవతి చరిత్ర కూడా నిందు జేర్పబడినది’’ అంటూ కేవలం పౌరాణిక పాత్రల గురించే గాకుండా ఆధునిక మహిళలు వారి సాహసాన్ని పద్యాల్లో చిత్రించింది. ఇట్లా ఆధునిక మహిళలను పద్యాల్లో చిత్రించిన మొదటి రచన ఇదే కావొచ్చు.
భండారు అచ్చమాంబ రచన ‘అబలా సచ్చరిత్ర రత్నమాల’ 1902లో పుస్తక రూపంలో అచ్చయితే ఆమె తర్వాతి రచనగా గుండు అచ్చమాంబ రచనలు (1901లో రాసినప్పటికీ) 1907లో పుస్తక రూపంలో వెలువడ్డాయి. (నిజానికి 1921కి ముందు మొత్తం వంద మంది మహిళల రచనలను కొమర్రాజు లక్ష్మణ రావు, కాశీనాథుని నాగేశ్వర రావులు కలిసి తీసుకు రావడానికి ప్రయతించించిన ఆంధ్ర వాఙ్మయ సూచిక లో పేర్కొన్నారు. 1923లో కొమర్రాజు చనిపోవడముతో కాశీనాథుని నాగేశ్వర రావు అనుబంధములో ఇచ్చిన రెండు భాగాల్లో 1927 వరకు అచ్చయిన పుస్తకాలను జోడించారు. ఇట్లా 1927 వరకు తెలుగులో 150కి మందికి పైగా రచయిత్రులున్నారు. వీరందిరిని ఆంధ్ర కవయిత్రుల చరిత్ర రాసిన ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కూడా పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి ఆంద్ర వాఙ్మయ సూచిక, బార్నెట్ బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీ తెలుగు కేటలాక్ పుస్తకం, గోల్కొండ కవుల సంచికల్లో అచ్చయిన రచయిత్రులందరు కలిపితే 200లకు (1934 వరకే) మించుతారు. ఎవరయినా పూనుకొంటే మంచి ప్రాజెక్టు అవుతుంది). మళ్ళీ విషయానికి వస్తే అచ్చమాంబ సత్కథా మంజరి పేరిట మూడు సంపుటాలను వెలువరించింది. ఇందులోని రెండవ సంపుటిలో పౌరాణిక మహిళ గురించే గాకుండా ఆధునిక కాలానికి (లాహోర్‌)కు చెందిన ప్రేమానంద స్వామి అనే అతని భార్య సత్యవతిని గూర్చి కూడా రాసింది. అందులోని పద్యాలిలా ఉన్నాయి. (మచ్ఛుకు)
శా॥ శ్రీమీఱన్‌ నిరతాన్న దాత యను వాసిం గాంచుచుంగౌడమ
గ్రామస్థుఉండు గుణోత్తరుండొకడు మిత్రఖ్యాతి దీవించు న
మ్మామ న్గొుచు భర్తjైుతనరు ప్రేమానంద గోస్వామి నెం
తే మన్నించును సాధ్వి సత్యవతి త న్నీక్షించు వారౌననన్‌
శా॥ లాహోర్ప్రాంతమునన్‌ జనాళి మది న్కుందొమ్మి గావించుచుం
బేహారు ల్వెఱగంది ఱిచ్చపడ దేవీ సింహుడుద్యోగి jైు
బాహాటం బగు కంపెనీ ప్రభుత్వ పర్వన్‌ హ్ల కల్లో మౌ
నాహారావ మెసంగబన్ను గొనుని`త్యంబున్‌ దయాశూన్యుడై
ఉ॥ లేదు సుభిక్ష మన్‌ పుకు లేజివురుం గనరాదు చెట్ల బై
రేదియు మ్వొ నే పదునెక్కదు గ్రీష్మము మెండు కాపుం
బేదఱికంబు నొంద విను వీధికి న్లని మబ్బొకప్పుడున్‌
రాదు పోటుక్కునన్‌ జినుకు రాుట లేదది యేమి చిత్రమో!
1920లోనే రెండో సారి ప్రచురితమైన ‘సత్కథామంజరి’ మూడో సంపుటములో సీత వృత్తాంతమున్నది. ఇందులో విల్లుగాంచిన సీత, వరనిశ్చయమైన సీత, పరశురామునింగాంచు సీత, అడవికి వెళ్ళు సీత, రావణుని రథముమీది సీత, అశోకవనమున నుండు సీత, రావణ సంహారము వినిన సీత, అగ్ని ప్రవేశ మొనర్చు సీత, పట్టాభిషేకమునకేగు సీత అనే పేరిట ఖండికలున్నవి. ఈ మూడు భాగాలకు ముందుమాటలు రాసిన మేన మామ 1920నాటికి చనిపోయిండు. ఆయన ఈ అన్ని భాగాల్లోనూ ఈ క్రింది పద్యం జోడించిండు. తప్పుంటే తెలియజేయమన్నడు.
‘‘చ॥ ఇగ సత్కవి ప్రకరి మెంతయు క్షణ వేత్తలై సభా
స్తలుల జెలంగు పండితవితానముం దమ కూర్మిపుత్రియుం
జెలియుగా దంచి నను జిత్తమున్గరుణించి తప్పుల
న్గలిగిన జూచి దిద్దుదురు గాత క్షమింతురు గాత నిచ్చున్‌..
అట్లాగే కవయిత్రి అచ్చమాంబ కూడా ఈ క్రింది పద్యాన్ని మూడు సంపుటాల్లోనూ పేర్కొన్నది.
శ్రీమెఱయగ ముమ్మూర్తులు
దామైమేల్గోరదగు సుధానిధి వాత్మా
రామబ్రహ్మమ సీతా
రామా! యవధారు లోకరక్షణకామా॥
ఈ కవయిత్రి ఆధునిక కవిత్వం కూడా రాసింది. 1922లో ‘సంపెంగ’ పేరిట వెలువరించిన ఖండ కావ్య సంపుటిలో వివిధ అంశాలపై పద్యాలున్నాయి. అందులో ఒంగోలు పశువుల సంత, రాజమండ్రి మిషనరీ హాస్పిటల్స్‌, ఆంధ్రభాష, స్కూల్స్‌ గురించి రాసింది. ఈమె రాజమండ్రిలోనే పుట్టింది రాజమండ్రిలోనే పెరిగింది. గుంటూరులో నివసించింది.
అందుకే గౌతమీ నది గురించి ఇలా రాసింది.
కం॥ శ్రీరాణ్మహేంద్ర పురమున
గౌరవపుష్కరపు(దిధుల ఘన గౌతమి శృం
గారాస్పదయ కను(గొను
వారి ముదము పెనిచెలోక వంద్య మహాత్మా!
సీ॥ గోదావరీనదిం గోటిలింగాల రే
విది మహాస్థమంచు నెన్నినారు
రాచబాటలు తీర్చి రమణీయముగ(బెద్ద
పాలక వసతు లేర్పఱచినారు
కూరగాయలు పండు కొను వస్తువుల నెల్ల
విరివిగ నంగళ్ళ( బెట్టినారు
కనువిందొసగు పండ్ల దినుసు లొక్కొక్క చోట
నేర్పాటుగా నమ్మ నెంచినారు
గీ॥ పాత్రసామగ్రి మెండుగా( బఱచినారు
వివిధ దేశపు సరకుల( బెట్టినారు
బొమ్మను లక్క పిడతల నమ్మినారు
జనము లుపయోగముగొను బుష్కరపు వేళ!
ఇప్పుడిక ఆమె పుట్టు పూర్వోతరాల విషయానికి వద్దాము. ఈమె సుప్రసిద్ధ పండితుడు రాజమండ్రి కళాశాలలో అధ్యాపకుడిగా ఉండిన వావిలాల వాసుదేవశాస్త్రి సోదరి. ఈ వాసుదేవ శాస్త్రి షేక్‌స్పియర్‌ రాసిన ‘జూలియస్‌ సీజర్‌’ నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేసిండు. ఇట్లా ఇంగ్లీషు నాటకాలను అనువాదం చేసిన వారిలో ఈయనే మొట్టమొదటివాడు. ఈయన 1851లో పుట్టి 1897లో చనిపోయిండు. ఈయన వీటితో పాటు ‘బ్రాహ్మణీయము’ అనే ప్రబంధాన్ని 1875లో రాసిండు. అట్లాగే 1874లో ముముక్షు తారకం పేరిట భజగోవింద శ్లోకాలను తెలుగులోకి అనువదించిండు. 1877లో ‘పిత్రారాధన’ అనే పద్యకావ్యాన్ని రాసిండు. 1879లో ‘మాతృరూప స్మృతి’ పేరిట విలియమ్‌ కౌపర్‌ రాసిన ఖండకావ్యాన్ని తెలుగులోకి తర్జుమా చేసిండు. అట్లాగే బ్రాహ్మణుల్లో శాఖా బేధాలను నిరసిస్తూ ‘నందక రాజ్యం’ పేరిట ఒక స్వతంత్ర నాటకాన్ని రాసిండు. ఈయన రాజయోగి, వివేకవర్ధని మాస పత్రికల్లో అనేక వ్యాసాలను ప్రకటించారు. (టేకుమళ్ళ కామేశ్వరరావు, నా వాఙ్మయ మిత్రులు: విశాలాంధ్ర ప్రచురణ. 1996) ఈయన గురించి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ‘ఆంద్ర రచయితలు’ పుస్తకములో వివరంగా రాసిండు.
గుండు అచ్చమాంబ తండ్రి పేరు అప్పయ్య శాస్త్రి (1828-1874), తల్లి పేరు మహాలక్ష్మమ్మ (1831-1879). ఈమె పఠ్యం అద్వైత బ్రహ్మశాస్త్రి కుమార్తె. అచ్చమాంబ తల్లివైపు వారు కూడా పండితులే. తాత పఠ్యం అద్వైత బ్రహ్మశాస్త్రి భాషోద్ధారకులు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌కు గురువు. ప్రపితామహుడైన వావిలాల వెంకట శివావధానులు- వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆస్థాన పండితుడు. అప్పయ్య శాస్త్రికి ఆరుగురు కొడుకులు. ఇద్దరు కుమార్తెలు(?).
ఈమె జీవిత వివరాలు 1898లో తన అన్నగారి స్మృత్యర్థం ‘భ్రాత్రారాధన’ పేరిట వావిలాల అద్వైత శాస్త్రి రాసిన పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం బందరులోని భైరవ ముద్రాక్షరశాలలో ప్రచురితమయింది. దత్తత పోయిన అద్వైత శాస్త్రి తన అన్న వావిలాల వాసుదేవశాస్త్రి జీవితాన్ని పద్యాలో రాసిండు. ఇందులో ఆనాటి రాజమండ్రి కాలేజి చదువు, ప్రయాణ సాధనాల గురించి కూడా రాసిండు. నెల్లూరు, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం, ఒంగోలు, హైదరాబాద్‌, బనారస్‌, మదరాసు, రామేశ్వరం మొదలైన ప్రాంతాల గురించి కూడా రాసిండు. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన వివరాలు, బంధువులు, వ్యక్తుల విషయాలను రికార్డు చేసిండు. ప్రధానంగా ఉద్యోగస్థుల జీతభత్యాల్లో పెరుగుదల గురించి రాసిండు. ఈ పుస్తకం పునర్ముద్రించినట్లయితే ఆనాటి చదువుకున్న పండితుల జీవితాలు, జీతాల గురించి తెలుస్తుంది అద్వైత శాస్త్రి ఒక పద్యంలో తన తల్లి మహాలక్ష్మమ్మ గురించి ఇట్లా రాసిండు.
నమ్మశ్రీ మహాలక్ష్మమ్మ హర్షమొంద
అత్త అక్కయ్య బాబయ్య యుత్తముండు
నాయన ద్వైత బ్రహ్మార్యుడాయ మాంబ
నన్ను బెంచిరి బ్రేమ చే నన్న వినమె
...
తల్లి మహాక్ష్మమ్మ గర్భవతిగా ఉన్న కాలంలో ఆమె భర్త అప్పయ్య శాస్త్రి గతించిండు. ఆయన తన 46వ యేట భావ సంవత్సరం అంటే 1874లో చనిపోయిండు. ఆ విషయం గురించి ఇట్లా రాసిండు.
కన్ను మూసెను నిర్వాణ కామబ్బ
భావ వర్షము రాగానె చావు వచ్చె
నలుబదారేండ్లు నిండని గలిన మీకు
అమ్మ గర్భిణి గానుండ వానువాయ
...
స్కూలు మేష్టరి శాస్త్రన్న జాలియుండ
ఇంతనెలన్ని బూర్తిగా జింతతోనె
అమ్మగనె వెర్రి చెల్లిని నాతురముగ
మాసికము దీర్చి జాతక మేసి యుంచి
చెల్లి అచ్చమాంబ పుట్టుకతో పాటు తల్లి చావు గురించి ఆయన ఇలా రాసిండు.
సంతసము బోయిమన అమ్మజింత జెందె
మాత బహుధాన్య వత్సర మాఖ బహుళ
ద్వాదశిని గడిపి శివరాత్రి పర్వవేళ
మించి పరలోక మేగ నమ్మెత్త తల్లి
అని చెప్పిండు.
దీన్ని బట్టి గుండు అచ్చమాంబ 1875లో జన్మించిందని నిర్ధారించవచ్చు. అంటే ఆమె కడుపులో ఉండగానే తండ్రి చని పోయిండు. ఈమె తల్లి కూడా బహుధాన్య సంవత్సరం శివరాత్రి నాడు అంటే 1878లో చనిపోయింది. అంటే నాలుగేండ్లు నిండకుండానే అచ్చమాంబ తల్లిని, తండ్రిని ఇద్దరినీ కోల్పోయింది. అందుకే ఈమెను అపయ్య సోదరుడు (బుచ్చయ్య) పెంచి పెద్ద చేసినాడు. పెంచిన తల్లి పేరు రాజ్యలక్ష్మమ్మ. ఈ రాజ్యలక్ష్మమ్మ పేరిటనే అచ్చమాంబ పద్యాలు రాసింది. అచ్చమాంబ మరణానికి చింతిస్తూ వావిలా వాసుదేవశాస్త్రి రాసిన రెండు పద్యాలను కూడా ఇందులో (భ్రాత్రారాధన)లో చేర్చిండ్రు. అవి..
తండ్రి చన్న పిదప, ధరణి
పుట్టెడువారు బ్రతికి విభవమెంతో
పడయుదరని పెద్దలన్న మాట వృధచేసి
విధినీకు విధవ జన్మ వ్రాసె వెఱ్ఱికూన॥
రాజమంద్రిని బుట్టి రాజమంద్రిన
బెరిగి రాజమంద్రిలో విరాజియై
సభా జనంబునకు సుభోజనమైన
ట్లు బెండ్లి యైతిగదవె వెఱ్ఱికూన॥
ఇట్లా రాజమండ్రిలోనే చదువును సాగించిన ఈమె వివాహం చిన్నతనంలోనే గుండు వంశానికి చెందిన అప్పరాజు అనే అతనితో జరిగింది. బహుశా ఆ మామగారే గుండు వాసుదేవశాస్త్రి. మేన మామ కూడా!
...
పురికి తమ్మన్న ప్లీడరయి విరివి నుండ
మళ్లి క్రిష్ణకుమారె పెత్తల్లి కొడుకు
అప్పరాజమనుతచి నచ్చమ్మ కవికి
వచ్చె వైధవ్య మందుకై వంతజెందు
చుండ వెర్రికి నదిప్రాప్తి యుండెనన్న
చిన్న తాతయ్య పెంపుడు గన్న బామ్మ
మన్ను జేసెన్న భార్య తనతోనుండ
జబ్బు జీర్ణించి శ్మయి యుబ్బుచూప
కారుమూరేగి జెందెన కాలమృతిని
మార్గశిరశుద్ధ యష్టమి మారకంబు
వెర్రితో నెవ్వరేగరు వీలుగనక
గొల్లపురి నుంచి హరిబంపె గుండు వారి
మామ్మలన్నలు జేరిరి మరుదినంబు
మనకు గారాబు చెల్లెలు చినకుమారి
తండ్రి గనలేదు యెరుగదు తల్లి బాగ
పిల్లలును లేరు పతిబాయె పిన్ననాడె
ఈ రచన వల్ల అచ్చమాంబ తల్లిదండ్రు చిన్ననాడే చనిపోయారని తెలుస్తుంది. అట్లాగే బాల్య వివాహం, ఆ తర్వాత భర్త కూడా చిన్నతనంలోనే చనిపోయిండు. పిల్లలులేరు. ఈ దశలో ఆమె రాజమండ్రిలో చదువుకున్నది. ఆ తర్వాత గుంటూరులో నివసించింది. తనకు కలిగిన కష్టాలను కవిత్వ రచన ద్వారా అధిగమించింది. ఈమె రచనలు 1926 వరకు వెలువడ్డాయి. ఆ తర్వాత కూడా ఆమె బతికి ఉండే అవకాశమున్నది. అయితే 1875 నుంచి 1926 వరకు ఈమె కచ్చితంగా జీవించి యున్నదని నిర్ధారించవచ్చు.
ఈమె రచనలు ముందే పేర్కొన్నట్లుగా 1900లో మొదటి సారిగా ప్రచురితమయ్యాయి. (రామేశ్వర యాత్రా చరిత్ర) 1907లో మొదటి సారిగా అచ్చయిన సత్కథామంజరి మూడు భాగాలు 1920లో పునర్ముద్రణ పొందాయి. 1922లో తాను రాసిన కవితా ఖండికన్నింటిని ‘సంపెంగ’ పేరిట ప్రచురించింది.
మేనమామ గుండు వాసుదేవ శాస్త్రి 1917(8)లో చనిపోయిండు. (ఆంధ్ర పత్రిక ఉగాది సంచిక-1918) ఈయన ఒంగోలు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో రెవిన్యూకు శాఖలో పనిజేసిండు. గుండు వాసుదేవ శాస్త్రి ఆరవ తోబుట్టువు రాజ్యలక్ష్మమ్మ చనిపోయినప్పుడు ఈ కింద పేర్కొన్న పద్యాను రాసింది. (బహుశా ఈ రాజ్యలక్ష్మి యే ఆమె తల్లి).
క॥ శ్రీ రాజ్యలక్ష్మీ యప్పా!
ఈ రాజ్యము లెల్ల వదలి యేగితి వమ్మా
రారమ్ము పోయె ననుచును
నారాయణ స్మరణ తోడ నాలుక కదన్‌
గీ॥ రమ్ము రమ్మిక( దలుపు (దీయమ్మటంచు
పోయె మామ్మయ్య తాజచ్చిపోయె ననుచు.....
అట్లే తల్లి గురించి ఇలా కవిత్వ మల్లింది.
ఉ॥ ప్రొద్దున నేడుగంటలకు బోసిన గిన్నెడు జావ(ద్రావి యు
కెద్దియు వద్దు నాకు(జలి యింకొక దుప్పటి గప్పి మీరు
యొద్ద నె(గూరుచుండుడనెనొక్కెడ గాలును రాయుమంచువే
నిద్దుర బోయి లేచి శివునిన్‌ మదిలో స్మరియించె భక్తితో
వీటితో బాటుగా తన తల్లి వావిలాల రాజ్యక్ష్మమ్మ రాసిన ఒక కీర్తనను తన రచనల్లో పేర్కొంది. ఆ కీర్తన ఇలా ఉంది.
కాంభోజి రాగము - చావు తాళము
జననీ, నీ పదసేవ సల్పెద ననుగు బాలుని
సమయమీయవదే మమ్మా ఓ జననీ ॥జ॥
1. కారుమూరు పురీ కాపురమున్నట్టి కామాక్షి నన్గావవే
2. బ్రహ్మపట్టణమునందు బహ్మేశ్వరమ్మ పాదమ్ములే నమ్మితిని ॥జ॥
3. వసుధలో వావిలాల రాజ్యలక్ష్మీకి వరములీయరాగదే జననీ॥
జగదీశ్వరమ్మ పిన్నిగారు చెప్పినదిగా మరో కీర్తనను పేర్కొంది.
(శహాన రాగము తాళము)
గురువును జూడగనే గుఱినిలిచినదమ్మ
1. పరమపదంబైన బయలు గనుగొంటినమ్మ
అరిషడ్వర్గము నన్నంటక యున్ననమ్మ
అరసి పంచభూతములణచి వైచితినమ్మ ॥గు॥
2. ప్రాబల్యమైన హరి నీ ప్రేమతో గలడు కాని
ప్రణవనాదంబైన పలుకు వినగంటినమ్మ
3. బ్రహ్మానందముతోడ బ్రహ్మేశ్వరమ్మపాడ
నిమ్ముగా నాదు హృదయమ్మున నిలిచెనమ్మ!
ఇట్లా తెలుగు సాహిత్యానికి ఇద్దరు కొత్త కవులను కూడా ఆమె పరిచయం చేసింది. ఇంత చరిత్ర ఉన్న ఈమె రచనలు (దాదాపు అన్నీ) ఇప్పుడు లభ్యమవుతున్నందున వాటిని పునర్ముద్రించినట్లయితే తెలుగు సాహిత్యానికి ముఖ్యంగా ఆధునిక మహిళా సాహిత్యానికి మేలైన చేర్పు అవుతుంది. ఆ పనికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ గాని, విశ్వవిద్యాయాలు, అకాడెమీలు, సాహితీ ప్రేమికులు పూనుకుంటారని ఆశిస్తున్నాను.
గుండు అచ్చమాంబను ఆమె లాంటి మరెందరో మహిళా సాహితీవేత్తలకు కొత్తగా పాణం పోస్తున్న కాత్యాయని విద్మహే గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు.
- సంగిశెట్టి శ్రీనివాస్

Vattikota natikalu