Friday, June 19, 2020

వందేండ్ల కిందటి మన సంస్కర్తలు


మన గొప్ప మనం చెప్పుకుంటే అది హెచ్చులు/ఏతులుగా అనిపిస్తయి. అదే విషయాన్ని వేరేవాళ్ళు జెబితే దానికి ఆమోదనీయత, గౌరవం రెండూ ఉంటాయి. హైదరాబాద్‌ రాజ్య సంస్కర్తల గురించి ఆంధ్రాకు చెందిన కుసుమ ధర్మన్నరికార్డు చేసినంత గొప్పగా తెలంగాణ వాళ్ళు కూడా రికార్డు

Add caption

చేయలేదు. కుసుమ ధర్మన్న స్వయంగా హైదరాబాద్‌లో అప్పటి రాజకీయ నాయకుడు, హైదరాబాద్‌ అంబేడ్కర్‌గా ప్రసిద్ధి గాంచిన బి.ఎస్‌. వెంకటరావు అతిథిగా చాలా ఏండ్లున్నాడు. ఆయన దగ్గర పౌర సంబంధాల అధికారిగా పనిచేసిండు. ఈయనకు 1921 కన్నా ముందు నుంచే హైదరాబాదీ నాయకుతో సంబంధాలన్నాయి. బి.ఎస్‌.వెంకటరావు 1946 ఆ ప్రాంతంలో హైదరాబాద్‌ రాజ్య ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అంబేడ్కర్‌ విద్యాసంస్థల స్థాపనకు చేస్తున్న కృషికి మంత్రిగా తోడ్పాటు నందించారు. అందుకోసం ప్రత్యేకమైన ఫండ్‌ని ఏర్పాటు చేసిండు. ఈ వెంకటరావు సాన్నిహిత్యంతోనే 1921 నాటికే కుసుమ ధర్మన్న ఉద్యమకారుడిగా మారిండు. తర్వాతి కాలంలో ఆయన ప్రభావంతోనే దళితులు ఇస్లాం మతంలోకి మారి తమ ఆత్మగౌరవాన్ని రక్షించుకోవాలని పిలపునిచ్చిండు. 1937లో రాజమండ్రిలో జయభేరి అనే పత్రికను ఏర్పాటు చేసి దళితుల అభ్యున్నతికి కృషి చేసిండు. వృత్తిరీత్యా వైద్యుడైన ధర్మన్న అనేక ఊర్లు తిరుగుతూ ఒక వైపు వైద్యం మరోవైపు ఉద్యమ ప్రచారం చేసిండు. ఈయనకు స్ఫూర్తి ఆంధ్రా ప్రాంతం, మదరాసు ప్రావిన్స్‌ నుంచి గాకుండా హైదరాబాద్‌ రాజ్యం నుంచి అందింది.

Add caption
ఆంధ్రా ప్రాంతంలోని సాహితీవేత్తలు సంస్కరణ భావాలతో రచనలు చేసిండ్రు. అక్కడ ఉద్యమకారులుగా పూర్తి స్థాయిలో కార్యరంగంలో ఉన్నది చాలా తక్కువ మంది. అదే తెలంగాణలో సాహిత్య రంగంలో ఉన్నది చాలా తక్కువ. అయితే సంస్కరణను ఉద్యమంగా ప్రచారం చేసినవారు ఎక్కువ. ఇదే విషయం కుసుమ ధర్మన్న రాసిన ‘మాకొద్ది నల్లదొరతనము’ కవిత్వ పుస్తకం ద్వారా విదిత మవుతుంది. ఈ పుస్తకం మొదట ‘ఆదిహిందూ ధార్మిక ప్రచారము’ కోసం ‘అంటు దోషము మానరెలా?’ పేరిట 1921లో మొదటి సారిగా ప్రచురితమయింది. దీనిని బోయి విజయభారతి గారి ముందుమాటతో 2003 జూన్‌లో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు పునర్ముద్రించారు. ఇందులో బ్రాహ్మణాధిపత్యాన్ని, దళితుల పట్ల రైతుల చిన్న చూపు, మద్యపాన నిరోధము, జంతువు కన్నా హీనమైన మాల, మాదిగల బతుకు, ప్రయాణ సాధనాల్లో, కోర్టు, కచ్చేరుల్లో చూపించే వివక్ష, కడుపు మాడుచుకొని గడిపే పాలేరు జీవితం ఇట్లా చాలా విషయాలను గురించి రాసిండు. విద్యవల్లనే దళిత జాతి బాగుపడుతుందని చెప్పిండు. ఈ కవిత్వ పుస్తకంలో మొత్తం 70 మందికి పైగా వ్యక్తులను దళితుల అభ్యున్నతి కోసం కొట్లాడుతున్న వారుగా, స్ఫూర్తిప్రదాతలుగా పేర్కొన్నారు.
ఈ కవితల్లో పేర్కొన్న వ్యక్తులందరూ 1921కి ముందు ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నవారే!
అంటే వీళ్లంతా వందేండ్ల కిందటి వ్యక్తులు. వీళ్ళ గురించి చరిత్రను లోతుగా చదివిన ఏ కొద్ది మందికో తప్ప అందరికీ తెలియదు. హైదరాబాద్‌ రాజ్యంలో ఒక శతాబ్దం క్రితం సంస్కర్తలుగా ఎవరున్నారో దీని వల్ల తెలుస్తుంది. అట్లాగే జాతీయ, ఆంధ్రా ప్రాంతంలో ఉన్న వారిని కూడా ఆయన ఇందులో పేర్కొన్నారు. నిజానికి ఈ సంస్కర్తల గురించి ఇప్పటి తరానికి కూడా బాగానే తెలుసు. ఎటు తిరిగీ హైదరాబాదీయుల గురించే తెలియదు. కుసుమ ధర్మన్న గురించి ఇటీవలి కాలములో చాలా సాహిత్యం వెలువడింది. దానికి ఈ వ్యాసం కొత్త జోడింపు. ఇప్పుడిక్కడ కుసుమ ధర్మన్న తన ‘అంటు దోషము మానరెలా?’ కవిత్వ సంపుటిలో వ్యక్తుల గురించి పేర్కొన్న గీతాలను రాస్తున్నాను. అట్లాగే అందులో ప్రస్తావితమైన వ్యక్తుల గురించి వివరణ ఇచ్చే ప్రయత్నము చేస్తున్నాను. ఆ కవితా పంక్తులు ఇలా ఉన్నాయి.
‘‘మా వంశమున బుట్టి! మహిమ గాంచిన యట్టి
మానవులను గానరేల
వేదవ్యాసుండు మా వాడు గాద
వాల్మీకి గోత్రము మాదిగాద
శుకుడు మా వంశమున బుట్టలేదా?
పరాశరుని కులము మాది గాద?
వారు మా వంటి మాలలు గార?
మా కులము తక్కువైతె గుణమే లేదంటార?
మా కొద్దీ నల్ల దొరతనము -
దేవ మా కొద్తీ నల్ల దొరతనము ॥బాబు మాకొ॥
మాకు పదిమందితో పాటు -
పరువు గలుగకయున్న ॥మాకొ॥
మాకు వైష్ణవ మిచ్చి మమ్ముద్ధరించే
ఘనుడు యా రామాను జుండు
ఆదరించె శ్రీ దయానందుండు
మన్నించె వివేకనందుండు
ధన్యులా జేసెగ చైతన్యుండు
గౌరవించె ఘనుడు శ్రీ నానక్కు
కరుణ జూపె గాంది మహాత్ముండు
వారి, బిడ్డలైన మీకీ గడ్డుతనమెందుకో ॥మాకొ॥
మా వంశమున బుట్టి
మహిని రాజ్యము జేసినట్టీ రాజుల గానరేల?
ప్రమగందూడు మా రాజుకాడ?
కీకట దేశము మాదిగాద?
కుయవుండు మా నాయకుడు గాడ?
వాలి సుగ్రీవుల్మా వారు గార?
కన్నమానీడు మా యన్న కాడ?
యెన్నొ సంబంధములున్న పరయ
మా, లోపాలు మీ వల్ల దాపరించెనయ్య ॥మాకొ॥
చోకామేళా తిరుప్పణ్యాళ్వారులు
నందనాది భక్తులు మావారండి
ఆరంజ్యోతి మా యాడ బడుచండి
వశిష్టుండు మా యల్లుడండి
శబరి సారంగి మా తల్లులండి
కన్యమాతంగి మా యక్కసుండి
సత్యవతి మాదు జననీ సుమ్మండి
వారి కీర్తి వెలిగింప మూర్తీభవించితి మండి ॥మాకొ॥
అభిమాన పుత్రికలని మా కుల స్త్రీల
విశ్వామిత్రుడు గారవించె
లోకమాతై ఆరంజ్యోతిమించె
గొంతిదేవి మాకిలవేల్పై నిల్చె
వాల్మీకి మహకీర్తి గాంచె
కాళిదాసూ మాలో నుద్భవించె
హరిశ్చంద్రూడు మా సేవజేసె
లోక మెందు జూచిన నందు లేక యుంటిమి దేవ ॥మాకొ॥
సీత కొరకై రామ భూపాలుడు
దిక్కు గానక తిరిగీన నాడు
అతనిదిక్కై నిలిచినవారెవ్వారు
సీత జాడ దెచ్చిన వాడెవ్వాడు
రావణుని జంప మూలమెవ్వారు
రాము దు:ఖము బాపినదీ మావారు
దీనుల కెల్ల దిక్కు మావారు
మా, యతిథులై వచ్చి
మమ్మణగ ద్రొక్కితిరి నేటికి మీరు ॥మాకొ॥
మా కష్టముల నెల్ల మనవి జేయగ
దివికి వేంచేసేనూ మా జనకుండు
ఘనుడు బాలముకుందు ధీరుండు
రావిచెట్టు రంగారావుగారు
లాల్జీ సతిగారు హీరాబాయమ్మ
వారి మొర లాలకించే దేవుండు
యేడుకోట్ల జనసంఖ్య మా దండు
మా కష్టకాండమునింక కడతేరగా లెండు ॥మాకొ॥
మాకు చదువు నేర్పి మన్నించె
శ్రీ చిలకమర్తీ వంశచందురుండు
లక్ష్మీ నరసింహాన్వయ కవిధీరుండు
విధిత వీరేశలింగా మాత్యుండు
మాదు కష్టాల వ్రాసేననఘుండు
మంగిపూడి వేంకటకవి వరుండు
ధర్మోపదేశక ధీవరుండు
ఆదిపూడి సోమనాథరావుండు
ఆచార్య వర్య సజ్జనుండు
బాజీ కృష్ణారావు పంతులుండు
దేశాసేవక పతిపత్నూలైన
ఆర్య గయా ప్రసాదుగారుండు దేవ
కనుపించరీలాంటి, ఘనులెవ్వరును నేడు ॥మాకొ॥
మమ్ముద్దరింపగ - మహిని
శ్రీపీఠిక పురనేత వెలసీ యుండేను
రాజ ప్రతాపగీరు గారుండెను
గోస్వామి ధనరాజగీ రుండె
లాల్‌గీర్‌ బీర్‌భాన్‌గీరు లుండిరి
వనపర్తీ నరేంద్రు డుండెను
మహారాణి గద్వాలు గారుండె
శ్రీ మునగాల నృపేంద్రు డుండె
రాజా వెంకట రామారెడ్డి యుండె - దేవ
ఉదయించినారు, మమ్ముద్దరింపగ వీరు ॥మాకొ॥
మా జాతిలో బుట్టి మాకు నాయకులైన
మా చెంత నీడై యుండె
యం.సి. రాజ చెన్నపురిలో నుండె
ఏలూరు పురమందు దేవేంద్రుడుండె
హైద్రాబాదూన భాగ్యరెడ్డుండె
వల్తాటి శేషయ్య గారుండె,
మాదరి ఆదయ్య గారు నుండెను
అరిగె రామస్వామి గారు నుండె
బత్తుల వెంకటరావు గారు నుండె
దువ్వల చెన్న కృష్ణయ్య గారుండె
గడ్డం సేవకదాసు గారు నుండె
మాదరి వెంకటస్వామి గారుండెను, దేవ,
వాల్మీకాశ్రమములో దర్మన్న కవి యుండె ॥మాకొ॥
మా దీన దశజూచి మదిలోన దు:ఖించి
మాతోడు నీడై యుండెవారు,
ఆర్య బ్రహ్మ సమాజమువా రుండె,
జీవరక్ష మండలి వా రుండెను,
పండిత కేవవరావు రాఘవేంద్రుడుండె,
ధర్మవీరుండు వామన నాయకుండు
దేశభక్తుండు శ్రీ కృష్ణుడుండె,
సాధుశీలుండు వెలెంకరుండె,
సింఘ్వి గణేశమల్‌ లాల్జిగారుండె,
జి.రఘునాథ్‌ మల్‌ మోతిలాుండె
మాడపాటి హనుమంతరావుండె
వడ్లకొండ నరసింహారావుండె
జానకి రామయ్య శ్యామరావుండె
మాకు తోడు నీడై సర్వదా నిలిచియున్నారు ॥మాకొ॥
ఇట్లా 42వ గీతము నుండి 52వ గీతము వరకు మొత్తము 11 గీతాల్లో సంస్కరణోద్యమాల్లో పాల్గొన్న, పాల్గొంటున్న వారి గురించి కుసుమ ధర్మన్న రాసిండు. అయితే వీటిలో ఎక్కడా కూడా అంబేడ్కర్‌ గురించి ఆయన రాయలేదు. అప్పటికి అంబేడ్కర్‌ జాతీయ స్థాయిలో ‘మూక్‌ నాయక్‌’ పత్రిక (1920) స్థాపించినాడు. అమెరికాలో చదువుకొని ఇండియాకొచ్చిండు. సౌత్ బరో కమిటీ ముందు తన వాదన వినిపించిండు కమిటీకి దళితు తరపున నివేదికను సమర్పించిండు. దీన్ని బట్టి తేలేదేమిటంటే గాంధి గురించి (ఈయన కూడా 1916 ఆ ప్రాంతం నుంచే దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిండు) ప్రచారం జరిగినంతగా అంబేడ్కర్‌ గురించి ఆనాడు ప్రచారం జరగలేదు. తర్వాతి కాలంలో బిఎస్‌ వెంకటరావుతో కలిసి మహారాష్ట్రకు వెళ్ళి వివిధ సభల్లో ధర్మన్న పాల్గొన్నాడు. స్వయంగా అంబేడ్కర్‌ చేత 1944లో రాజమండ్రిలో సన్మానాన్ని పొందిండు. అంబేడ్కర్‌ ‘హిందూ మతం వీడండి’ అన్న పిలుపు మేరకు వెంకటరావు సాన్నిహిత్యంతో దళితులు ‘ఇస్లాం’ మతం పుచ్చుకోవాలని చెప్పిండు. ఇప్పుడిక్కడ పురాణాలకు సంబంధించిన వ్యక్తుల గురించి కాకుండా ఇతరుల గురించి మాత్రమే వివరణ లిస్తున్నాను. అవి ఇట్లా ఉన్నాయి. వారి జీవితాలను పరిశీలించినట్లయితే ఆనాటి స్ఫూర్తి ప్రదాతలెవరో అర్థమయితది. అందుకే ఈ ప్రయత్నం.
1. రామానుజుడు (1017-1137) విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారంలో పెట్టినాడు. భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసిండు. తమిళనాడులోని పెరంబూదురులో పుట్టిన ఈయన దళితుల్లోకూడా వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిండు.
2. దయయానందుడు (1824-1883) వేద విజ్ఞాన ప్రచారం చేసిండు. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. “బ్యాక్‌ టు వేదాస్‌” అని పిలుపునిచ్చిండు. 1875లో ఆర్యసమాజ్‌ సంస్థను స్థాపించడమే గాకుండా అదే సంత్సరం ‘సత్యార్థ ప్రకాశిక’ పుస్తకాన్ని రాసిండు.
3. వివేకానందుడు (1863-1902) హిందూ మత ప్రచారకుడు. మత సంస్కరణకోసం కృషి చేసిండు. దేశ విదేశాల్లో పర్యటించి మత సంస్కరణ ప్రచారం చేసిండు. ఈయన గురువు రామకృష్ణ పరమహంస.
4. చైతన్య ప్రభువు (1486-1533) వైష్ణవ మత ప్రచారకులు. భక్తి యోగాన్ని ప్రచారం చేసిండు. బెంగాల్‌కు చెందిన ఈయన్ని శిష్యులు కృష్ణుడి అవతారంగా భావిస్తారు.
5. గురు నానక్‌ (1469-1539) దైవమొక్కడే అని ప్రచారం చేసిండు. సిక్కు మతాన్ని స్థాపించిండు. ఈయన రాసిన 974 కీర్తనలు ‘గురుగ్రంథ్‌ సాహెబ్‌’గా ప్రసిద్ధి.
6. మోహన్దాస్ కరంచంద్ గాంధీ (1869-1948) భారత స్వాతంత్య్రోద్యమంలో కీలకంగా పనిచేసిండు. దళితులను ‘హరిజన్‌’ అనే పదంతో పిలిచి వారిని మెయిన్‌ స్ట్రీమ్‌లో కలపడానికి ప్రయత్నించిండు.
7. చోకామేళా (14వ శతాబ్దం) భక్తి ఉద్యమకారుడు. నామ్‌దేవ్‌ బోధనలతో ప్రభావితుడైన ఈయన మహారాష్ట్రలో మహర్‌ కులంలో జన్మించిండు. పండర్‌పూర్‌లోని విఠోభాను కీర్తిస్తూ అనేక కీర్తనలు రాసిండు. ప్రచారం చేసిండు. ఈయన సమాధి గుడి ముందే ఉంటుంది.
8. తిరుప్పణాళ్వారు (ఎనిమిదో శతాబ్ది) హిందూ మతంలోని వైష్ణవ సంప్రదాయంలోని 12 ఆళ్వార్లలో ఈయన ఒకరు. దళితుడు. ఈ 12 మంది వైష్ణవాన్ని ప్రచారంలో పెట్టిన వారిలో ప్రముఖలు. 4000 పద్యాల్లో దివ్యప్రబంధాన్ని రాసిండు.
9. నందనార్‌ (ఏడో శతాబ్దం) హిందూమతంలోని శైవ సంప్రదాయంలోని 63 మంది నయనార్లలో ఈయన ఒకరు. భక్తి ఉద్యమకారుడు. తమిళనాడులోని చిదంబరంలో నివసించాడు. దళితుడు.
10. కాళిదాసు (4-5వ శతాబ్దం) ఈయన ఉత్తరాఖండ్‌, కశ్మీర్‌ ప్రాంతానికి చెందినవాడుగా చెబుతారు. ప్రఖ్యాత సంస్కృత కవి.
11. రాయ్‌ బాలముకుంద్‌ (1862-1926) 1926 ఫిబ్రవరి ఐదున హైదరాబాద్‌లో మరణించిన ఈయన దళితోద్యమకారుడు భాగ్యరెడ్డి వర్మకు కొండంత అండగా నిలిచిండు. ఆది హిందూ సోషల్‌ సర్వీస్‌ లీగ్‌ సంస్థకు జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన క్షత్రియుడైనప్పటికీ తన మరణానంతరం తన శవానికి ఆది-హిందువు మాత్రమే కర్మకాండలు జరపాలని వీలునామాలో రాసుకున్నాడు. ఉన్నత కులాల వారి కన్నా ఆది హిందువులు (దళితులు) దేనిలోనూ తక్కువ కాదు అని నిరూపించడానికి ఆయన ఆ పనిచేశాడు. తర్వాత ఆయన కుమారులు తండ్రి కోరికను నెరవేర్చిండ్రు.
12. రావిచెట్టు రంగారావు (1877-1910) విజ్ఞాన వర్ధినీ గ్రంథమాల స్థాపకులు. హైదరాబాద్‌, మదరాసు నగరాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహించాడు. హైదరాబాద్‌లో 1901లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపకుల్లో ఒకరు. భాగ్యరెడ్డి వర్మకు చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పించిండు. ఆయన చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చి ప్రోత్సహించిండు. కింది కులాల వారికి తాను స్థాపించిన విద్యాసంస్థల్లో ప్రవేశం కల్పించిండు.
13. హీరా బాయి (20వ శతాబ్దం ప్రథమార్ధం) ప్రఖ్యాత కలప వ్యాపారస్థుడు జీవ రక్షజ్ఞాన ప్రచారక మండలి స్థాపకులు, వితరణ శీలి లాల్జీ మేఫ్‌ుజీ సతీమణి. ఈమె జంతు హింస నివారణకు కృషి చేసింది.
14. చిలకమర్తి లక్ష్మీనరసింహము (1867-1946) దళిత భక్త కవి నందనార్‌ గురించి 1913లోనే పుస్తకం రాసిండు. ప్రఖ్యాత నవలాకారుడు, ఈయన రాసిన గయోపాఖ్యానం ప్రఖ్యాతి. సాహితీవేత్త.
15. కందుకూరి వీరేశలింగము (1848-1919) మహిళ విద్య కోసం, వితంతు వివాహం కోసం కృషి చేసిన సంస్కర్త. సాహితీవేత్త. తెలుగు కవుల చరిత్రమును రాసిండు. సాహిత్య రంగంలో కృషి చేసిండు.
16. మంగిపూడి వేంకటకవి (1882-1957) జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. 1915లోనే అంటరాని తనానికి వ్యతిరేకంగా ‘నిరుద్ధ భారతము’ అనే కావ్యాన్ని రాసిండు.
17. ఆదిపూడి సోమనాథరావు (1867-1941) హైదరాబాద్‌లో ఆర్యసమాజ్‌ కార్యకలాపాల విస్తృతికి రచనలు చేసిండు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంతో సన్నిహిత సంబంధా లుండేవి. కందుకూరి వీరేశలింగం పంతులు ప్రారంభించిన సంఘసంస్కరణోద్యమంతో ప్రభావితులై హరికథలు రాసిండు. దయానంద సరస్వతి రాసిన ‘సత్యార్థ ప్రకాశిక’ను తెలుగులోకి అనువదించిండు. ఆర్యసమాజ్‌ భావాలతో అనేక రచనలు చేసిండు. ఈయన కుమార్తె ఆదిపూడి వసుంధరాదేవిని హైదరాబాద్‌ ప్రభుత్వం 1928 ఆ ప్రాంతంలో పై చదువుల కోసం ఇంగ్లండ్‌కు పంపించింది. తెలుగు ప్రాంతాల నుంచి ఇంగ్లండ్‌కు వెళ్లిన మొట్టమొదటి మహిళ ఈమె.
18. బాజీ కృష్ణారావు (1880-1946) హైదరాబాద్‌లో ఆర్యసమాజ్‌ కార్యకలాపాలు నిర్వహించిన వారిలో ప్రధానమైన వ్యక్తి. మహరాష్ట్రియన్‌ అయినప్పటికీ తెలుగువారి అల్లుడు. అదీ వితంతు వివాహాన్ని చేసుకున్నాడు. దళితోద్యమానికి ఆది నుంచి అండగా నిలిచిండు. హైదరాబాద్‌ రాజ్యంలో దళిత జనోద్ధరణకు, సంఘసంస్కరణకు, ఆర్యసమాజ భావాల వ్యాప్తికి బాజీ కిషన్‌ రావు చేసిన కృషి చిరస్మరణీయమైంది. వితంతు వివాహాల జరిపించడం ద్వారా, దక్కన్‌ మానవసేవా సమితి స్థాపించి జంతుబలిని దాదాపు ఆపించిన వాడిగా, రైల్వే ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఉండి వారి సమస్యలు పరిష్కరించడంలో చూపిన శ్రద్ధ, సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి విద్యావకాశాలు కల్పించిన వాడిగా ఎన్నో పాత్రలు పోషించి శభాష్‌ అనిపించుకున్న ధీన బాంధవుడు బాజీ. సంస్కరణ గురించి కేవలం మాటలు చెప్పడం గాకుండా స్వయంగా తాను ఆచరించి చూపిండు. వితంతువును వివాహమాడి మార్గదర్శిగా నిలిచిండు. తాను మహరాష్ట్రీయుడైనప్పటికీ తెలుగు వితంతువుని వివాహమాడడంతో హైదరాబాదీ అళ్లుడయిండు. హైదరాబాద్‌ నగరంలో 1920-1940 దశకంలో దళితుల అభ్యున్నతికి నిర్విరామంగా కృషి చేసిన సంస్కర్త బాజీ. భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బి.ఎస్‌. వెంకట్రావు, శ్యామ్‌సుందర్‌, లక్ష్మ య్య, ఎస్‌. బాబయ్య మొదలైన దళిత నాయకుందరూ బాజీ కిషన్‌ రావు ప్రత్యక్ష శిష్యులే. బాజీ సహాయం లేకుండా వారు ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవు. ఎందరో అనాథ దళిత బాలలకు ఆయనిల్లు ఒక ఆశ్రమం, ఆశ్రయం. దళిత జనోద్ధరణ కేంద్రంగా, సంఘసంస్కరణ కూడలిగా సికింద్రాబాద్‌లోని ఆయన ఇల్లు బాసిల్లేది. దళితులకు దేవాలయ ప్రవేశాలు కల్పించడంలో హైదరాబాద్‌ రాజ్యంలో ఆయన చేసిన పోరాటం అద్వితీయమైంది. ఆదిహిందూ సేవా సమితి, జాంబవర్ణ సేవా సంఘం, అరుధంతీయ సంఘం, శబరి సంఘం మొదలైన దళిత సంఘాలతో 1930వ దశకంలో ఆయన కలిసి పనిచేశారు. పష్తక్వామ్‌ పేరిట దళితుల కోసం ప్రత్యేక పాఠశాలల స్థాపనలో తన వంతు పాత్ర పోషించాడు. సికింద్రాబాద్‌ పికెట్‌ గ్రామంలో ఎరుకల వారి కోసం ప్రత్యేక పాఠశాలను స్థాపింప జేశారు. అంతెందుకు 1950వ దశకంలో హైదరాబాద్‌ నుంచి దేశ రాజకీయాల్లోకి అడుగిడిన ప్రతి దళిత నాయకుడూ ఆయన శిష్యుడే.
19. ఆర్య గయా ప్రసాద్‌ హైదరాబాద్‌లో ఆర్యసమాజ్‌ కార్యకలాపాలు నిర్వహించేవారు?
20. పిఠాపురం రాజు: రావు సూర్యారావు బహద్దూర్‌ (1885-1964) కవి పండిత పోషకుడు. కాకినాడ, పిఠాపురం తదితర ప్రాంతాల్లో ఈయన వితరణతో ఎన్నో విద్యా సంస్థలు ప్రారంభ మయ్యాయి. దళితుల కోసం హాస్టల్స్‌ కూడా నడిపించారు.
21. రాజా ప్రతాపగీర్‌ జి (20వ శతాబ్దం ప్రారంభం) భాగ్యరెడ్డి వర్మ చేపట్టిన కార్యకలాపాలకు అండగా నిలిచిండు. ఆర్యులకు-అనార్యులకు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడినపుడు హైదరాబాద్‌లో ఒక గోష్టి జరిగింది. ఆ గోష్ఠికి ఈయన అధ్యక్షత వహించినాడు.
22. గోస్వామి ధనరాజ్‌గీర్‌ (1893-1988) హైదరాబాద్‌లో పేరెన్నిక గన్న వితరణ శీలుర్లలో ఈయన ముందువరుసలో ఉంటాడు. హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ప్రేమ్‌ థియేటర్‌ వీరిదే. ఈ థియేటర్‌లో ఆదిహిందువులు తయారు చేసిన హస్తకళా రూపాలను ప్రదర్శనకు పెట్టిండ్రు. 1925లో చాదర్ఘాట్‌లో ఆదిహిందూ భవన్‌కు ఈయనే శంఖుస్థాపన చేసిండు. అక్కడికక్కడే భవనానికి ఐదువేల రూపాయలను విరాళంగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని బీర్బన్‌బాగ్‌లో గల ఈయన భవంతిలోనే ముత్యాల ముగ్గు సినిమా షూటింగ్‌ జరిగింది. ఈయన కూతురు ఇందిరా ధన్‌రాజ్‌గిర్‌ తెలుగు కవి గుంటూరు శేషేంద్ర శర్మని వివాహమాడింది.
23. లాల్‌గీర్‌ బీర్‌బాన్‌గీర్‌ (20 వ శతాబం) ఈయన పేరిటనే హైదరాబాద్‌లో బీర్బన్‌బాగ్‌ అనే కాలనీ ఏర్పడిరది. వితరణశీలి.
24. వనపర్తి రాజు (?-1922) రాజా రామేశ్వరరాయలు-2. ఈయన పండిత పోషకుడు.
25. గద్వాల రాణి : ఆదిక్ష్మీదేవమ్మ (?-1953) గద్వాల సంస్థానాధీశురాలు. కవి, పండిత పోషకులు. ఈమె పేరిటనే గద్వాలలో కళాశాల ఏర్పాటు చేసిండ్రు.
26. మునగాల రాజు : రాజా నాయని వెంకట రంగారావు (1879-1958). హైదరాబాద్‌లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానియ స్థాపకులు. సాహితీవేత్త కొమర్రాజు లక్ష్మణరావు ఈయన దగ్గర దివాన్‌గా పనిచేసిండు. ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేసిండు.
27. రాజా బహద్దూర్‌ వెంకటరామారెడ్డి (1869-1953) హైదరాబాద్‌ నగర పోలీసు కమీషనర్‌గా పనిచేసిండు. రెడ్డి హాస్టల్‌ స్థాపకుడు. విద్యా సంస్థల నిర్మాత. కుల-మతాలకు అతీతంగా పేదల అభ్యున్నతికి కృషి చేసిండు.
28. ఎం.సి.రాజా (183`1943) దళిత నాయకుడు. మద్రాస్‌ ప్రొవిన్స్‌ శాసనసభ్యుడిగా పనిచేసిండు.
29. నరాలశెట్టి దేవేంద్రుడు: (?-1935) గుడివాడ ఆది ఆంధ్ర సదస్సులో పాల్గొన్నాడు. మద్రాసు శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆది ఆంధ్ర ఉద్యమంలో ముందున్నాడు. ఏలూరుకు చెందిన ఈయన మద్రాసు శాసనసభకు దళితుల కోటాలో దళితేతరుడైన వేమూరి రాంజీరావుని నామినేట్‌ చేసినందుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిండు.
30. భాగ్యరెడ్డి వర్మ (188-1939) హైదరాబాద్‌లో 1906లోనే జగన్మిత్ర మండలిని ఏర్పాటు చేసి దళితుల అభ్యున్నతికి కృషిచేసిండు. ఆదిహిందూ పాఠశాలను ఏర్పాటు చేసిండు. జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలిని ఏర్పాటు చేసి జంతుబలికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేసిండు.
31. వల్తాటి శేషయ్య 19-10-1913 నాడు హైదరాబాదులో సమావేశమైన మన్యసంఘం సాధారణ సమావేశంలో వల్తాటి శేషయ్యను ఆ సంఘ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. హైదరాబాద్‌ నగరంలో పేరుమోసిన కాంట్రాక్టరు. దళితుడు. ఈయన హైదరాబాద్‌లో బ్రహ్మసమాజ మతంలోకి మారిన మొదటి వ్యక్తి. వితరణశీలి.
32. మాదరి ఆదయ్య (1868-1938) సికింద్రాబాద్‌లో పెద్ద కాంట్రాక్టర్‌. దళితోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. విద్యారంగంలో చిరస్మరణీయమైన కృషిచేసిండు. ఈయన పేరిటనే సికింద్రాబాద్‌లో ఆదయ్య నగర్‌, ఆదయ్య మెమోరియల్‌ పాఠశాల ఉన్నది.
33. అరిగె రామస్వామి (1895-1973) జంటనగరాల్లో 1920వ దశకం ఆరంభం నుండి దళితుల అభ్యున్నతికి కృషిచేసిండు. కొన్ని రోజులు రైల్వేలో ఉద్యోగం చేసిండు. తర్వాతి కాలంలో దేవదాసీ ఆచారాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిండు. కవికూడా. ఈయన అచలబోధ తత్వ్తాన్ని ప్రచారం చేసిండు. హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మంత్రిగా పనిచేసిండు.
34. బత్తుల వెంకటరావు (1898-1953) హైదరాబాద్‌ అంబేడ్కర్‌గా ప్రసిద్ధి. సికింద్రాబాద్‌ కేంద్రంగా దళితోద్యమాలను నడిపించాడు. ఈయనకు సొంతంగా బస్సులుండేవి. ఈయన దగ్గరే కుసుమ ధర్మన్న పిఆర్‌వోగా పనిచేసిండు. నిజాం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిండు. దళితులు ఆత్మగౌరవం కోసం ఇస్లాంలోకి మారాలని పిలుపునిచ్చిండు. పొలిసు చర్య సమయములో అరెస్టయ్యిండు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయిండు.
35. దువ్వల చెన్న కృష్ణయ్య (20వ శతాబ్దం) భాగ్యరెడ్డి వర్మ అనుయాయి. ఆది హిందూ సంఘంలో చురుగ్గా పాల్గొన్నాడు. దళితుడు.
36. గడ్డం సేవకదాస్‌ (20వ శతాబ్ది) ఆదిహిందూ సోషల్‌ సర్వీస్‌ లీగ్‌ నడిపించిన పంచాయతి శాఖ కార్యదర్శిగా పనిచేశారు. భాగ్యరెడ్డి వర్మతో కలిసి పనిచేసిండు. 1929లో గాంధి హైదరాబాద్‌లో పర్యటించినపుడు ఆదిహిందూ భవన్‌ సందర్శనకు ఏర్పాట్లు చేసిండు.
37. మాదరి వెంకటస్వామి : ఎం.ఎల్‌.ఆదయ్య కుమారుడు జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడు.
38. కుసుమ ధర్మన్న (ప్రస్తుత పుస్తక రచయిత (1895-1947)
39. ఆర్యసమాజ్‌ 1875లో గుజరాత్‌కు చెందిన దయానంద సరస్వతి స్థాపించిండు. దీని కార్యకలాపాలు 1891నాటికే హైదరాబాద్‌ రాజ్యంలో ప్రవేశించాయి.
40. బ్రహ్మసమాజము: రాజారామ్మోహన రాయ్ 1828లో ఏకేశ్వరోపాసన పేరిట ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1878 నాటికి ఈ ఉద్యమం తెంగాణ/హైదరాబాద్‌లో కూడా సరోజిని నాయుడు, ఆమె తండ్రి అఘోరనాథ్‌ చటోపాధ్యాయ మూలంగా కార్యకలాపాలు నిర్వహించింది. 1914 ఆ ప్రాంతంలో హైదరాబాద్‌ నగర దళితులు కొందరు భాగ్యరెడ్డి వర్మ సలహా మేరకు ఈ మతాన్ని స్వీకరించినారు.
41. జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలి జంతు హింసకు వ్యతిరేకంగా 1915లో ఈ సంఘాన్ని మొదట దక్కన్‌ హ్యుమనిటేరియన్‌ లీగ్‌ పేరిట ఏర్పాటు చేసిండ్రు. దీనికి తొలి అధ్యక్షుడు జైనుడైన లాల్జీ మేఘ్జి.
42. పండిత కేశవరావు కోరట్కర్‌ (1867-1932) హైదరాబాద్‌లో ఆర్యసమాజ్‌ కార్యకలాపాలను ప్రభుత్వాధికారిగా అదీ హైకోర్టు జడ్జిగా ఉంటూ నిర్వహించారు. హిందూమత సంస్కరణ ఉద్యమాలను చేపట్టిండు.
43. రాఘవేంద్ర రావు : బహుశా కర్ణాటక ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన హైదరాబాద్ కేంద్రంగానే ఉద్యమాలు నడిపించాడు.
44. ధర్మవీర్‌ వామన నాయక్‌ (1878-1939) ధర్మవీర వామన నాయక్ పేరిట ప్రసిద్ధులైన ఈయన అస్పృశ్యతా నివారణకు కృషి చేసిండు. ఆంధ్రమహాసభలో భాగ్యరెడ్డి వర్మను ప్రసంగించేందుకు అనుమతిచ్చినందుకు నిరసనగా వ్యక్తులు లేచి వెళ్ళిపోబోతుండగా వారిని సముదాయించి వర్మ ఉపన్యాసం కొనసాగేలా చూశాడు. ఆదిహిందూ భవన నిర్మాణానికి విరాళాలివ్వడమే గాకుండా ఆ భవన ప్రారంభోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. గాంధీకి 1929లో గోల్డెన్‌ త్రెషోల్డ్‌లో ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఆదిహిందూ సోషల్‌ సర్వీస్‌ లీగ్‌, భాగ్యరెడ్డి వర్మతో సన్నిహిత సంబంధాలు నెరిపాడు. వివేక వర్ధని పాఠశాల ఏర్పాటు నిర్వహణలో కీలక భూమిక పోషించిండు.
45. శ్రీకృష్ణుడు (రాయె శ్రీకిషన్‌. ఈయన తర్వాతి కాలంలో హైదరాబాద్‌ హైకోర్టు జడ్జిగా పనిచేసిండు లండన్‌లో చదువుకున్నాడు.
46. ఎన్‌.జి.వెలింకర్‌ (1866-1940) నారాయణ గోవింద్‌ వెలింకర్‌ అనే ఈయన బొంబాయిలో వివిధ సామాజిక ఉద్యమాల్లో కీలకంగా పనిచేసిండు. అక్కడి విద్యాశాఖలో ఉన్నతోద్యోగం చేసిండు. సరోజిని నాయుడు కోరిక మేరకు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ బ్రహ్మసమాజ ప్రచారాన్ని చేపట్టిండు. 1914లో అనేక మంది దళితులకు బ్రహ్మసమాజంలోకి మార్చిండు. ఉస్మానియా విశ్వవిద్యాయం స్థాపించిన తర్వాత ఇంగ్లీషు డిపార్ట్‌మెంటులో మొదటి ఆచార్యుడిగా పనిచేశాడు. ప్రొఫెసర్‌గా, నిజాం ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శిగా అనేక పదవులను నిర్వహించిండు. దళితుల పట్ల ప్రత్యేక ప్రేమతో పనిచేసిండు. ఈయనకు దివ్యజ్ఞాన సమాజంతో కూడా సంబంధాలున్నాయి. దివ్యజ్ఞాన సమాజం ఉత్సవాలు 1926-27లో కిషన్‌ పర్షాద్‌ (అప్పటి ప్రధాని) ఆధ్వర్యంలో జరిపించాడు. లాహోర్‌లో దయానంద్‌ ఆంగ్లో-వేదిక్‌ కాలేజికి కొన్నాళ్ళు ప్రిన్సిపాల్‌గా పనిచేసిండు. బొంబాయి మున్సిపల్‌ స్కూల్స్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నాడు. నిజామ్‌ ప్రభుత్వంలో చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌గా పనిచేసిండు.
47. సింఘ్వి గణేశమల్‌: దక్కన్‌ హ్యుమనిటేరియన్‌ సంస్థ స్థాపకుల్లో ఒకరు. బాంకర్‌. కలప వ్యాపారస్థులు. వితరణ శీలి. జీవరక్షజ్ఞాన ప్రచారక మండలి ప్రచారం కోసం భాగ్యరెడ్డి వర్మకు ఉచితంగా వాహనాన్ని సమకూర్చిండు.
48. లాల్జీ మేఘ్జి జైన్ మార్వాడి. ఈయన దక్కన్ హుమానేటెరియన్ లీగ్ స్థాపనలో కీలక భూమిక పోషించింది. జీవహింసకు వ్యతిరేకంగా ప్రచారం చేసిండు. విరతరణ శీలి. కలప వ్యాపారి.
49. జి.రఘునాథ్‌ మల్‌ మోతిలాల్‌ (20వ శతాబ్ది) దక్కన్‌ హుమనియటేరియన్‌ లీగ్‌ స్థాపక అధ్యక్షుడు. ఈ సంస్థకు భాగ్యరెడ్డి వర్మ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉండేవాడు. ఆదిహిందూ పాఠశాలకు ఈయన ఉదారంగా విరాళాలిచ్చాడు. హైదరాబాద్‌లో తొలిసారిగా మాడర్న్‌ - ఇంగ్లీషు తరహాలో బ్యాంకింగ్‌ వ్యవస్థని ప్రవేశ పెట్టిండు. ఈయన నడిపించిన రఘునాథ్‌మల్‌ బ్యాంక్‌ లిమిటెడ్ తర్వాతి కాలంలో సిండికేట్‌ బాంక్‌లో వీలినమయింది.
50. మాడపాటి హనుమంతరావు (1885-1970) ఆంధ్ర పితామహుడిగా ప్రసిద్ధి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ కేంద్రంగా ప్రజాభ్యుదయ కార్యక్రమాలు చేపట్టిండు. భాగ్యరెడ్డి వర్మ చేపట్టిన పాఠశాలల స్థాఫన ఉద్యమానికి అండగా నిలిచిండు.
51. వడ్లకొండ నరసింహారావు (1893-1955) వరంగల్‌కు చెందిన ఈయన ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో సెటిలయ్యారు. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయ నిర్వహణలో పాల్గొన్నాడు. 1927 నాటికే భాగ్యరెడ్డి వర్మ జీవితాన్ని కొంత ఇంగ్లీషులో రాసిండు. దళితుల కోసం భాగ్యరెడ్డి వర్మతో కలిసి పాఠశాలలు స్థాఫించాడు.
52. నడింపల్లి జానకిరామయ్య: 1913 వైశాఖ పూర్ణిమ నాడు భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు చేసిన బుద్ధ జయంతికి ఈయన ముఖ్య ఉపన్యాసకుడిగా హాజరయ్యారు. భాగ్యరెడ్డి వర్మ అంటే ఈయనకు వ్లల్లమాలిన అభిమానం. హైదరాబాద్‌లో స్త్రీల విద్యకు పాటుపడినారు. ఈయన భార్య నడింపల్లి సుందరమ్మ మొదటి ఆంధ్రమహాసభ (జోగిపేట-1930)కు అధ్యక్షత వహించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈయన ఉద్యోగ సమాజాన్ని స్థాపించారు. మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాలలో ప్రారంభం నుండి ప్రతిఫలం పుచ్చుకోకుండా విద్యాబోధన చేశారు.
53. సిదాబత్తుని శ్యామరావు: 1915 ఆ ప్రాంతం నుంచి సికింద్రాబాద్‌ కేంద్రంగా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. కళావంతుల సంఘాన్ని ఏర్పాటు చేసి దేవదాసి దురాచారానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిండు. దక్కన్ మానవ సేవా సమితిని స్థాపించి సభలు నిర్వహించిండు. ఆంధ్రా ప్రాంతం నుంచి గుడిసెవా సుబ్బయ్య లాంటి సంస్కర్తలను పిలిపించి ఉపన్యాసాలిప్పించాడు. సామాజిక ఉద్యమాల్లో కీలకంగా పాల్గొన్నాడు.
- సంగిశెట్టి శ్రీనివాస్

No comments:

Post a Comment

Vattikota natikalu