Friday, June 19, 2020

జిల్లా చరిత్రలకు ఆద్యుడు శేషభట్టర్

జిల్లా చరిత్రలకు ఆద్యుడు శేషభట్టర్
తెలంగాణలో బహుశా మొత్తం తెలుగు లోనే వెలువడ్డ మొట్ట మొదటి జిల్లా చరిత్ర గ్రంథం ‘శ్రీ నల్లగొండ చరిత్రము’. దీని రచయిత శేషభట్టర్‌ వెంకట రామానుజాచార్యులు. ఈ గ్రంథం మొట్టమొదటి సారిగా 1919లో నల్లగొండలో తాను స్థాపించిన ‘శ్రీ వీరేశలింగ కవి కంఠాభరణ గ్రంథమాల’ తరపున మొదటి గ్రంథంగా (1921) వెలువరించాడు. అంతకు రెండేండ్ల ముందు చనిపోయిన కందుకూరి వీరేశలింగం పేరిట ఈ గ్రంథమాల స్థాపితమయింది. ‘‘దేశోపకారమే పరమావధిగానెంచి క్రీ.శ. 1919.లో నీ గ్రంథమాల స్థాపింపబడినది. ఇందు దేశాభివృద్ధికిని భాషాభివృద్ధికిని మిక్కిలి యావశ్యకములైన యుద్గ్రంథములు మూడు నెలలకొకటి చొప్పున బ్రచురించెదము’’ అని పుస్తకం వెనక అట్టపై పేర్కొన్నారు. ఈ గ్రంథమాల నిర్వహణలో నీలగిరి పత్రిక సంపాదకులు షబ్నవీస్‌ వెంకటరామనరసింహారావు, కొండగడప (నల్లగొండ జిల్లా) జాగీర్దారు అక్కినేపల్లి జానకిరామారావు (1885-1975)లు సహాయ పడ్డారు. ఈ గ్రంథమాల తరపున రాబోవు పుస్తకాలుగా చిల్లరిగె శ్రీనివాసరావు నవల శ్రీధర విజయము, బ్రాహ్మణ సాహసము (రెండవ భాగము- బహుశా ఒద్దిరాజు సోదరుల గ్రంథం) పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ ‘శ్రీ నల్లగొండ చరిత్రము’ పుస్తకంలో నమోదయ్యాయి. ఈ పుస్తకం కేవలం 30 పేజీల్లోనే వెలువడ్డప్పటికీ ఇందులో ఇప్పటి వరకు నల్లగొండ గురించి చరిత్రకెక్కని చాలా అంశాలు రికార్డయ్యాయి.
శేషభట్టర్‌ లభ్యరచనలన్నింటిని (భావ ప్రపంచము మినహా) విమర్శకులు, సాహితి చరిత్ర కారులు శ్రీరంగాచార్య గారు తమ సంపాదకత్వంలో 2018లో పుస్తకంగా తీసుకొచ్చారు. గ్రంథ రచయిత సంతానం తోడ్పాటుతో ‘శేషభట్టర్‌ వెంకట రామానాజాచార్యుల (లోకజ్ఞుడు) రచనలు’ పేరిట ఈ పుస్తకం అచ్చయ్యింది. ఇందులో రుక్మిణి (1916-నవల), ప్రాకృత దాంపత్యము (1918-నవల), అఖిల భారత తస్కర మహాసభ (1940 ప్రాంతం- పానుగంటి సాక్షి వ్యాసాల మాదిరి రచన), నల్లగొండ చరిత్రము (1921-చరిత్ర) ప్రేమ బలము (లఘు నాటిక), మౌఢ్య మహిమ (1910- నాటకం) రచనలు ఈ సంకలనంలో ఉన్నాయి. ఇవి గాకుండా శేషభట్టర్‌ ‘కర్మస్థలము’, ‘ఆంధ్రవీర ప్రబోధము’, ‘హాస్య నాటికలు’, ‘హిందూ దేశ చరిత్ర’ (నాటకం), ‘బహెరెనూర్‌’ (నవల), ‘ప్రకృతి కన్య’ (నవల) గ్రంథాలు ఆయన రచనలుగా రికార్డయ్యాయి. అలాగే ఈయన ‘అఖిల భారత తస్కర మహాసభ’ అనే వ్యంగ్య రచన కూడా చేసిండు. వీటితో పాటు ఆయన 1920-40 మధ్య కాలంలో నీలగిరి, తెనుగు పత్రిక, సుజాత, గోలకొండ పత్రికల్లో అనేక పద్యాలు రాసిండు. అందులో అస్పృశ్యత నివారణపై రాసినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వెలుగులోకి రావాల్సి ఉన్నవి.
తన సంపాదకత్వంలో వెలువడ్డ ‘శేషభట్టర్‌ వెంకట రామానుజాచార్యుల రచనలు’ కాపీనొకదాన్ని శ్రీరంగాచార్య సారు నాకిస్తూ చదివి దాని మీద రాయమన్నారు. ఇన్నాళ్ళు కుదురలేదు. ఈ కరోనా సమయంలో దాన్ని చూడడమయింది. అయితే ‘నల్లగొండ చరిత్రము’ పుస్తకములో కొన్ని పేజీలు అచ్చులో మిస్సయినాయి. అవి ఆ గ్రంథానికి విలువని జోడించేవి.
ఈ నల్లగొండ చరిత్రములో ఆ పట్టణానికి, జిల్లాకు సంబంధించిన అనేక వివరాలున్నాయి. 1800 ఆ ప్రాంతంలో నుంచి నల్లగొండలో జనావాసం పెరుగుతూ వచ్చిందని, అంతకుముందు ‘పానగల్లు ’ ప్రధాన పట్టణమని పేర్కొన్నాడు. 17వ శతాబ్ది ఆరంభంలో ఇక్కడ ప్రతి గురువారం జరిగే సంతలో దాదాపు 70, 80 వే రూపాయల వ్యాపారం జరిగేదని పేర్కొన్నాడు. ఇంతవరకు ఆధునిక చరిత్రలో సరిగ్గా రికార్డు కాని చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. అందులో ప్రధానమయింది. కుతుబ్‌షాహి రాజుకు నల్లగొండ దుర్గాధీశుడు హరిశ్చంద్రుడుకు సంబంధించిన యుద్ధం. దీని గురించి ఈ గ్రంథంలో శేషభట్టర్ ఇట్లా రాసిండు.
‘‘1516లో (నిజానికి అది 1519- అసలు పుస్తకములో అసీసు తప్పుగా 516 అని ఉంది) ‘బహమన్‌ షాహీ’ రాజ్య మంతరించి ‘కుతుబ్‌షాహీ’ రాజ్యకాల మారంభమాయెను. ఈ రాజ్య స్థాపకుడైన ‘మొహమ్మదు కులీకుతుబ్‌షా’ తన రాజ్యమును ధృడపరచు కొనుటకై బయలు వెడలి గోల్కోండ నుండి తూర్పు సముద్రము వఱకు పానగల్లు, మచిలీబందరు, రాజమండ్రి, రాజుకొండ, కొండపల్లి, వేలూరు, మొదలైన 70 జిల్లాలను జయించెనట. అందు నల్లగొండ దుర్గమును గురించి యీ ప్రకారముగా చెప్పబడినది:
కుతుబుషా బహు సైన్య యుక్తుడై నల్లగొండ దుర్గము నావరించి యుండెను. ఆ కాలమున నీ దుర్గమును హరిశ్చంద్రుడను రాజు (దుర్గము పునర్నిర్మాణము చేసిన వాడు) పాలించు చుండెను. హరిశ్చంద్రుని ధైర్య సాహసము వలనను దుర్గము యొక్క బలిష్టత వలనను కుతుబుషా యెంత ప్రయత్నించినను విజయము సమకూడునట్లు కాన్పించదాయెను. అనేక దినము ముట్టడి వలన యిరుదెగ వారును విసువు జెంది యుద్ధమంత మొందిన బాగుండునని దలంచు చుండిరి. కుతుబుషా సంధి చేయనెంచి యీ వార్త రాజునకు జెప్పబంపెను. అతడును దాని కొఱకే నిరీక్షించు చున్నవాడు గావున తాను పాషాకు సామంతుడుగ నుండుట తన కిస్టమే యనియు షా తనయెడల క్రోధ భావము మాని స్నేహ భావము బూన వలయునని యుంజెప్పి యనేకమగు విలువ గల కానుకతో గూడ తన రాయబారిని కుతుబుషాహ వద్దకి బంపెను. షాహ సైతమా రాయబారిని తగురీతిని సన్మానించి తన మనసున నిట్లని వితర్కించెను. ‘‘నేనిన్ని దినముల నుండి ఈ చిన్న దుర్గమును ముట్టడి వేసియు దీనిని జయింపలేక సంధిచేసుకొని పోవుట నా రాజ గౌరవము కర్హమయిన పనిగాదు. ఏట్లయినను దీనిని వశపరుచుకో వలయును’’ ఇట్లు వితర్కించి రాయబారిని తిరిగి పంపివేయు నప్పుడతనితో ఓయీ! మీ రాజుతో నా మాటలుగా నిట్లుల చెప్పుము. ‘‘ఇప్పుడు మన కిద్దఱకును సంధి కుదిరినది కావున మన మన్యోన్య స్నేహితులము. నల్లగొండ దుర్గము అత్యున్నతమై శత్రువుకగమ్యమై కాన్పించు చున్నది. ఇట్టి యద్భుత విషయమును నీ మిత్రుడునగు నేను చూచిపో నిచ్చగించితి’’ నని చెప్పెను. హరిశ్చంద్రుడా మాటల వలన కుతుబుషా దురుద్దేశ్యమును తక్షణము గ్రహించి యాతని కిట్లు చెప్పి యంపెను.
‘‘మీరు మీయిష్ట ప్రకారమే దుర్గము జూచి వెళ్ళవచ్చును.’’ కాని మీ వెంట మాత్రము కొందరు ముఖ్యానుచరులు తప్ప సైన్య మేదియు నుండరాదు.’’ ఇట్లు చెప్పి పంపి తన దుర్గ రక్షకులకు యాతనిని కైదు చేయవలయునని గట్టి తాకీదు చేసెను. వారునుతమ కార్యము నందు ప్రమత్తులయి యేయుండిరి. అయినను దైవ బలము లేనప్పుడు మనుష్య ప్రయత్నము నిరర్ధకమగును గదా కుతుబుషా కొందరు మెఱియలవంటి యనుచరులను వెంట నిడుకొని దుర్గద్వారము గుండ లోనికి బోయి యచ్చటి ద్వార రక్షకులను జెండివైచెను. అప్పుడు ద్వారమును బంధించువారెవరునూ లేక పోగా నది వఱకే కుతుబుషా ఆజ్ఞవలన సన్నద్ధులై వచ్చుచున్న యాతని భటులు లోనికి జొరబడిరి. అప్పుడిరు తెగ వారికి పోరు ఘోరమయ్యెను. తెలుగు భటులు స్వల్పముగా నుండుటచే కుతుబుషా సైన్యము వారందరిని నాడు నిశ్శేషముగా సంహరించెనట! హరిశ్చంద్రుడు కైదు చేయబడి అటు పిమ్మట వేంకటగిరి సంస్థానాధిపతిగా జేయబడెననియు నిప్పటికిని, ఆ సంతతివారే దానికి రాజుగా నున్నారనియు నొకరు వ్రాయు చున్నారు’’ అని ఉర్దూ పుస్తకాల ఆధారంగా శేషభట్టర్‌ గారు రాసిండ్రు. ముందుమాటలో ‘మౌల్వీ మొహమ్మద్‌ సుల్తాన్‌ రాసిన ‘జొగరాఫియా దక్కన్‌, సయ్యదు అహమదలీ రాసిన ‘తారీఖె నల్‌గొండ’ పుస్తకాలు ఉపయోగ పడ్డాయని ఇందులో పేర్కొన్నాడు. ఇదంతా నల్లగొండ చరిత్రకు కొత్తగా ఉపయుక్తమయ్యే అంశం. నల్లగొండ చారిత్రాభిమానులు పూనుకొని వీటిని పరిశోధించాల్సిన అవసరమున్నది. ముఖ్యంగా ఉర్దూ ఆధారాలను పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు అంతగా వెలుగు లోకి రాని చరిత్రపై వెలుగులు ప్రసరించే అవకాశమున్నది.
అంతా బాగానే ఉన్నది కానీ రంగాచార్య గారు సంపాదకత్వం వహించిన పుస్తకములోని నల్లగొండ చరిత్రలో మూడున్నర పేజీలకు మించి మ్యాటర్ మిస్సయ్యింది. పుస్తకం మొత్తం కలిపి 30 పేజీలు కూడా లేదు. అందులో మూడు పేజీలు మిస్‌ కావడంతో ‘సయ్యద్‌ లతీఫుల్లా ఖాదరీ’ గోరీ, దుర్గ నిర్మాణానికి సంబంధించిన చాలా విషయాలు అచ్చు కాకుండా పోయాయి. సమగ్ర రచనల్లోని పేజి 296, 15 వలైను నుంచి సమాచారం జోడించాల్సి ఉంటుంది. ఒరిజినల్‌ పుస్తకంలోని 15వ పేజీలో రాను రాను భాషా పరిణామ మహత్వ మున ‘నల్లగండి’ ని ‘నల్లగొండ’ యని పిలువజొచ్చిరి. ఈ యూరికీ పేరు వచ్చుటకీ కారణమే విశ్వసనీయముగా గన్పట్టు చున్నది. అని నల దమయంతుల్లోని నలుని పేరిట నల్‌గొండ వచ్చిందనే ఒక ప్రచారాన్ని కూడా పేర్కొన్నారు. కాకపొతే అది అంట విశ్వసనీయం కాదన్నారు. అయితే రంగాచార్య సారు సంపాదకత్వం వహించిన ఈ పుస్తకంలో రాను రాను భాషా పరిణామ..... తర్వాత మ్యాటర్‌ మిస్సయి మళ్ళీ 18వ పేజీలోని ..... మాతయునైన అనే దగ్గరి నుంచి ప్రారంభమయింది. దీన్ని సవరించాల్సిన అవసరమున్నది.
ఇప్పటి యాదాద్రి-నల్లగొండ జిల్లా దత్తప్పగూడెం గ్రామానికి చెందిన శేషభట్టర్‌ ఏప్రిల్‌ 16, 1900వ సంవత్సరంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు రామానుజమ్మ కృష్ణమాచార్యులు. ఈయన వకీలుగా మహబూబాబాద్‌, భువనగరి, నల్లగొండ, దేవరకొండ తదితర ప్రాంతాల్లో పనిచేస్తూ చిన్న వయసులోనే అంటే 44 ఏండ్లకే హైదరాబాద్‌లో మే 19, 1944 నాడు మరణించారు.
1927 నాటికే అస్పృశ్య నివారణపై పద్యాలు రాసిన శేషభట్టర్‌ వెంకటరామానుజాచార్య రచనలు ఒక్క దగ్గరి తీసుకు వచ్చినందుకు శ్రీరంగాచార్య గారు ఎంతైనా అభినందనీయులు. ఈ పనికి శేషభట్టర్‌ కుటుంబ సభ్యులు పూనుకోవడం ముదావహం. మిగిలిన రచనలు కూడా వెలుగు వచ్చినట్లయితే ఆయన ప్రతిభ, పాండిత్యం ప్రపంచానికి తెలిసే అవకాశముంటుంది.
శేషభట్టర్‌ గురించి రాసిన ‘తెలంగాణ నవలా చరిత్ర’ (2017) గ్రంథంలో ఇట్లా రాసిన ‘‘లోకజ్ఞుడు కలం పేరుతో అనేక రచనలు వెలువరించిన ఈయన నల్లగొండ జిల్లా వాడు. సంస్కృతం, ఉర్దూ, అరబ్బీ, ఫార్సీ, మహారాష్ట్ర, కన్నడ, ఇంగ్లీష్‌ భాషలు స్వయంగా నేర్చుకోవడమే గాకుండా అందులో కవిత్వం చెప్పిన దిట్ట శేషభట్టరు’’. అదీ ఆయన ప్రతిభ. ఈ ప్రతిభావంతుడిని తెలుగు సాహితీ ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- సంగిశెట్టి శ్రీనివాస్



fsar Mohammed, Nawian Samala and 7 others
4 comments
Like
Comment
Share

Comments

View 1 more comment

No comments:

Post a Comment

Vattikota natikalu