Wednesday, July 1, 2020

ఆధునిక మహిళా సాహిత్యానికి ఆద్యులు గుండు అచ్చమాంబ!


సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశీలన, పరిశోధన మారుతూ ఉంటుంది. తెలుగు సాహిత్యం అందుకు మినహాయింపు కాదు ఇన్నాళ్ళు అంతగా పట్టింపులో లేని మహిళా, దళిత సాహిత్యాలను విశ్వవిద్యాయాల్లోని అధ్యాపకులు ఇప్పుడు కొత్తగా పట్టించుకుంటున్నారు. గతంలో మాదిరిగా పౌరాణిక, ఆధ్యాత్మిక సాహిత్యంపై గాకుండా ఆధునిక సాహిత్యంపై ఎక్కువ పరిశోధనకు అవకాశం కల్పిస్తున్నారు. శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ ఆచార్యుల దగ్గర విద్యార్థులు ఆయా అంశాలపై కొత్తగా పరిశోధనలు చేస్తున్నారు. విస్మరణకు గురైన లేదా చరిత్రకెక్కని విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. వారందరికీ అభినందనలు. కొంత మంది ఆచార్యులు సైతం అక్కడక్కడ కొత్త విషయాలను ఆవిష్కరిస్తున్నారు. అయితే వీరందరికీ భిన్నంగా రిటైరైన తర్వాత మరింత ఎక్కువగా పరిశోధన చేస్తున్న వారు ఆచార్య కాత్యాయని విద్మహే గారు.

నిరంతరం పరిశోధన చేస్తూ కొత్త ఆవిష్కరణలు చేస్తూ, విషయాలను కొత్త కోణంలో ఆవిష్కరించే వారిలో ముందువరుసలో ఉన్నవారు ప్రొఫెసర్‌ కాత్యాయని విద్మహే గారు. రిటైరైన తర్వాత అటు దళిత సాహిత్యాన్ని, ఇటు స్త్రీల సాహిత్యాన్ని నూతన అంశాలతో పున: ఆవిష్కరిస్తున్నారు. అందుకు ముందుగా మేడమ్‌కు ధన్యవాదాలు.
కాత్యాయని విద్మహే గారి గౌరవ సంపాదకత్వములో వెలుడుతున్న ‘దగోదావరి’ అంతర్జాల సాహిత్య మాసపత్రికలో ‘ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర’ పేరిట వ్యాసాల పరంపరను రాస్తున్నారు. ఇందులో ఇంతవరకు తెలుగు సాహిత్యం అంతగా పట్టించుకోని విషయాలను, విస్మరణకు గురైన అంశాలను, ప్రధానంగా మహిళా దృక్కోణంలో చరిత్రకెక్కిస్తున్నారు. అందులో భాగంగానే మేడమ్‌ ‘గుండు అచ్చమాంబ’ గురించి వివరంగా రాసిండ్రు. ఈ వ్యాసం బహుశా ఏప్రిల్ నెలలో అచ్చయి వుంటుంది. వ్యాసంలో అచ్చమాంబ రచనలను పేర్కొన్నారు. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో మొదటి మహిళగా ఆమెను గురించి పరిచయం చేసిండ్రు. అంతకుముందు ఒకరిద్దరు రచయిత్రులున్నా వారి రచనలు ఒకటి అరా తప్ప పెద్దగాలేవు. అచ్చమాంబ గురించి రాసిన వ్యాసం ముగింపులో కాత్యాయని విద్మహే గారు ‘‘ఇంతకూ అసలు అచ్చమాంబ అస్తిత్వం ఏమిటి? గుండు వాసుదేవశాస్త్రి మేనకోడలు కనుక ఆమె పుట్టింటి వారి ఇంటి పేరు మరేదో అయివుంటుంది. మేనరికం వల్లనో మేనమామ ఇంటి పేరింటి సంబంధం కావడం వల్లనో ఆమె గుండు అచ్చమాంబ అయివుంటుంది. ఆమె జననం, తల్లిదండ్రుల వివరాలు, పెంపకం, చదువు, పెళ్లి, సంతానం మొదలైన వ్యక్తిగత వివరాలేవీ ఇప్పటికీ తెలియవు. పుస్తక ప్రచురణను బట్టి గోదావరి జిల్లాలోనూ, గుంటూరు లోనూ ఆమె ఉన్నట్లు ఊహించవచ్చు’’ అని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇది ఏ నెల సంచికో వివరాలు తెలియడం లేదు. బహుశా ఏప్రిల్‌ 2020 నాటి సంచిక అయి వుంటుంది. ఈ వ్యాసాన్ని నేను ఇటీవలే చదివిన. ఆ వ్యాసం చదివిన తర్వాత నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకునేందుకు ఈ ప్రయత్నం.
ఇప్పుడిక్కడ గుండు అచ్చమాంబ తల్లిదండ్రుల వివరాలను సైతం జోడిస్తున్నాను. ఆమె తల్లి, పినతల్లి కూడా కవయిత్రులే అనే విషయాన్ని కూడా రికార్డు చేస్తున్నాను. అయితే ఆ వివరాల్లోకి వెళ్ళే కన్నా ముందు అచ్చమాంబ గురించి ఆమె రచనల గురించి కొంత తెలుసుకుందాం!
కాత్యాయని మేడమ్‌ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి నేను మొదలు పెడతాను. నేను గతంలో భండారు అచ్చమాంబ కథల కోసం పాత పత్రికలను తిరగేస్తున్న సమయంలోనే నామసామ్యం మూలంగా గుండు అచ్చమాంబ పేరును తరచూ చూసిన. పది పన్నెండేండ్ల జ్ఞాపకం ఇంకా తాజాగానే ఉంది. ఆమె చిత్రం కూడా చూసినట్టు గుర్తు. ఇప్పుడు మళ్ళీ అన్నీ తిరగతోడినట్లయితే ఆమె చిత్రం బయటపడే అవకాశముంది. అది అట్లా ఉండనిచ్చి ముందుగా ఆమె రచనలను చూద్దాం. ‘‘1907లో ప్రచురితమైన సత్కథామంజరి వెనక భాగాన ‘ఏ తద్గ్రంధ కర్తచే రచియింపబడిన గ్రంధము’ అనే శీర్షికన క్రింద పేర్కొనబడిన వాటిలో వసంతర్తు, వర్షర్తు వర్ణనము, మనీషా పంచకముతో పాటు సుఖము, ధూమశకటము, నక్షత్రశాల ఖండికలు కూడా ఉన్నాయి. వాటితో పాటు మోతిమహలు అనే ఖండిక కూడా ఉంది. అంటే ఇవన్నీ 1907లోగా ప్రచురింపబడ్డాయన్న మాట’ అంటూ విద్మహే గారు ఆమె రచనలను పేర్కొన్నారు. వీటికి తోడుగా ‘రామేశ్వర యాత్రా చరిత్ర’, ‘శ్రీకాళహస్తీశ్వర కళ్యాణోత్సవము’, ‘ శ్రీవిక్టోరియా మహారాజ్ఞి చరిత్ర’, ‘శ్యమంతకమణి’ నాటకం కూడా వ్రాసినట్లు సత్కథా మంజరి వెనుక పేజీ సమాచారం ఆధారంగా మేడమ్‌ పేర్కొన్నారు. ఈనాటకం గురించి తెలుగునాటక వికాసం లో పోణంగి శ్రీరామ అప్పారావు కూడా రాసిండ్రు. అట్లాగే సత్కథా మంజరి పుస్తకం వెనుక అట్టపై ‘కలగూరగంప’ పేరిట అచ్చమాంబ రచనను పేర్కొన్నారు. దీన్ని మేడం మిస్సయ్యారు. రెండవ కూర్పునకు రాసిన పీఠికలో అచ్చమాంబ తన రచనల గురించి ఇలా పేర్కొన్నది. ‘‘నాకును నన్నయభట్టునకును, తారతమ్యము హస్తికము మించునప్పటికిని, నా తమ్ముడు ప్రస్తుతము బాపట్ల రిజిష్ట్రారగు చి॥భువనగిరి కోదండపాణి నన్నయ భట్టునకు నారాయణభట్టుగా తోడు చూపుచున్నాడు. అతను వ్రాసిన ..స్థాప’ యందతని సామర్ధ్యము లోకులెఱుంగుదురు గాక’’ అని రాసింది. అంటే భువనగిరి కోదండపాణిని తమ్ముడులాంటి వాడిగా పేర్కొన్నది. ఈమెకు కోదండపాణి దగ్గరి బంధువయ్యుంటాడు. భువనగిరి అఖిలాండమ్మ మహిళను పెద్దమ్మగా పేర్కొన్నది. ఈ కోదండపాణి ‘జరాసంథవధ’ నాటకాన్ని రాసినట్లు సత్కథామంజరి పుస్తకం వెనుక అట్టపై సమాచారం వల్ల తెలుస్తుంది. అట్లాగే ‘గుండు అచ్చమాంబికా ప్రణీతముయిన ఋషభ మహాకావ్యము, ఘోషాయాత్రా నాటకము త్వరలోనే వెలువడును’ అని కూడా ఈ పుస్తకం వెనుక అట్టపై రాసిండ్రు. ఇవి గాక భారతీయ వీరులు (1920), శ్రావణ మంగళవారము కథ, పాటలు (1926) రచనల గురించి తెలుగు సాహిత్య కోశం (ఆధునిక విభాగం)లో పేర్కొన్నారు. ఇందులో శమంతకమణి నాటకం గురించి రాస్తూ ‘‘శ్రీకృష్ణుడు శమంతక మణిని జాంబవంతుని దగ్గర నుంచి తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చి, సత్యభామను వివాహమాడటం ఇతివృత్తం. ఈ రెండు గ్రంథాలకు గుండు వాసుదేవ శాస్త్రి గారే పీఠికలు రాశారు. వీరి రచనలు సంప్రదాయరీతిలో, సుబోధకమైన శైలిలో ఉన్నాయి. వీరు స్త్రీ విద్య, ఆంధ్ర సంగీతము వంటి విషయాలపై సమాకాలిక పత్రికలో వ్యాసాలు రాశారు.(1912-1923) తెలుగు నాటక వికాసం పుస్తకం ఆధారంగా ‘సాహిత్య కోశం’లో రాసిండ్రు. ఈ వివరాలన్నీ కాశీనాథుని నాగేశ్వరరావు సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్రవాఙ్మయ సూచికలో (పేజి 250) కూడా ఉన్నాయి. కాళహస్తీశ్వర కళ్యాణోత్సవం 1904లో అచ్చయ్యింది. (కాశీనాథుని నాగేశ్వర రావు, 1994: పేజీ 39). రామేశ్వర యాత్రా చరిత్ర (1900) సంవత్సరములో అచ్చయ్యింది. (కాశీనాథుని నాగేశ్వర రావు 1994: పేజీ 273)
‘శ్రీసత్కథామంజరి’ మొదటి భాగం రెండో ముద్రణ 1920లో గుంటూరులోని చంద్రికా ముద్రణాలయంలో జరిగింది. ప్రథమ ముద్రణకు కాకినాడ నుంచి 10 ఏప్రిల్‌ 1907 నాడు అచ్చమాంబ మేనమామ గుండు వాసుదేవశాస్త్రి పీఠిక రాస్తూ ఈ రచన ‘ఆరేండ్ల క్రిందటే విరచితమయింది’ అని రాసిండు. అంటే ఈ గ్రంథ రచన కాలం 1901. ఇందులో మొత్తం తొమ్మిది మందివి శ్రీ రామకృష్ణ, రుక్మాంగద, ధృవ, శ్రీరామ, అంబరీష, గజేంద్ర, మార్కండేయ, కుచేల, ప్రహ్లాద చరిత్రలున్నాయి. రచయిత్రి నివాసం అప్పుడు గుంటూరులోని అరుండల్‌ పేట.
‘శ్రీ సత్కథామంజరి’ రెండో సంపుటి ‘హిరోయిన్స్‌’ అనే ఇంగ్లీష్‌ టైటిల్‌తో (లోపల సత్కథామంజరి అని తెలుగులో ఉంది) 1920లో వెలువడింది. ఇందులో సీత (శ్రీరాముని భార్య), శకుంతల (దుష్యన్తునిభార్య), దమయంతి (నలచక్రవర్తి భార్య), సావిత్రి (సత్యవంతుని భార్య), చంద్రమతి (హరిశ్చంద్రుని భార్య), సుకన్య (చ్యవనఋషి భార్య), మంగళాంబ (మంగళగౌరీ వ్రత విఖ్యాత భార్య), సత్యవతి (ప్రేమానంద స్వామి భార్య), పద్మావతి (జయదేవ స్వామి భార్య) గురించి చరిత్రలను పద్యాల్లో రాసింది. ఇందులో పద్మావతి ‘అష్టపదులు’ వ్రాసిన భక్తాగ్రేసరుడు జయదేవుని ధర్మపత్ని. నవీన చరిత్రములో నాంగ్లేయుల మెదటి దినములలో నిక్కట్టుల పాలైన పతివ్రత సత్యవతి చరిత్ర కూడా నిందు జేర్పబడినది’’ అంటూ కేవలం పౌరాణిక పాత్రల గురించే గాకుండా ఆధునిక మహిళలు వారి సాహసాన్ని పద్యాల్లో చిత్రించింది. ఇట్లా ఆధునిక మహిళలను పద్యాల్లో చిత్రించిన మొదటి రచన ఇదే కావొచ్చు.
భండారు అచ్చమాంబ రచన ‘అబలా సచ్చరిత్ర రత్నమాల’ 1902లో పుస్తక రూపంలో అచ్చయితే ఆమె తర్వాతి రచనగా గుండు అచ్చమాంబ రచనలు (1901లో రాసినప్పటికీ) 1907లో పుస్తక రూపంలో వెలువడ్డాయి. (నిజానికి 1921కి ముందు మొత్తం వంద మంది మహిళల రచనలను కొమర్రాజు లక్ష్మణ రావు, కాశీనాథుని నాగేశ్వర రావులు కలిసి తీసుకు రావడానికి ప్రయతించించిన ఆంధ్ర వాఙ్మయ సూచిక లో పేర్కొన్నారు. 1923లో కొమర్రాజు చనిపోవడముతో కాశీనాథుని నాగేశ్వర రావు అనుబంధములో ఇచ్చిన రెండు భాగాల్లో 1927 వరకు అచ్చయిన పుస్తకాలను జోడించారు. ఇట్లా 1927 వరకు తెలుగులో 150కి మందికి పైగా రచయిత్రులున్నారు. వీరందిరిని ఆంధ్ర కవయిత్రుల చరిత్ర రాసిన ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కూడా పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి ఆంద్ర వాఙ్మయ సూచిక, బార్నెట్ బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీ తెలుగు కేటలాక్ పుస్తకం, గోల్కొండ కవుల సంచికల్లో అచ్చయిన రచయిత్రులందరు కలిపితే 200లకు (1934 వరకే) మించుతారు. ఎవరయినా పూనుకొంటే మంచి ప్రాజెక్టు అవుతుంది). మళ్ళీ విషయానికి వస్తే అచ్చమాంబ సత్కథా మంజరి పేరిట మూడు సంపుటాలను వెలువరించింది. ఇందులోని రెండవ సంపుటిలో పౌరాణిక మహిళ గురించే గాకుండా ఆధునిక కాలానికి (లాహోర్‌)కు చెందిన ప్రేమానంద స్వామి అనే అతని భార్య సత్యవతిని గూర్చి కూడా రాసింది. అందులోని పద్యాలిలా ఉన్నాయి. (మచ్ఛుకు)
శా॥ శ్రీమీఱన్‌ నిరతాన్న దాత యను వాసిం గాంచుచుంగౌడమ
గ్రామస్థుఉండు గుణోత్తరుండొకడు మిత్రఖ్యాతి దీవించు న
మ్మామ న్గొుచు భర్తjైుతనరు ప్రేమానంద గోస్వామి నెం
తే మన్నించును సాధ్వి సత్యవతి త న్నీక్షించు వారౌననన్‌
శా॥ లాహోర్ప్రాంతమునన్‌ జనాళి మది న్కుందొమ్మి గావించుచుం
బేహారు ల్వెఱగంది ఱిచ్చపడ దేవీ సింహుడుద్యోగి jైు
బాహాటం బగు కంపెనీ ప్రభుత్వ పర్వన్‌ హ్ల కల్లో మౌ
నాహారావ మెసంగబన్ను గొనుని`త్యంబున్‌ దయాశూన్యుడై
ఉ॥ లేదు సుభిక్ష మన్‌ పుకు లేజివురుం గనరాదు చెట్ల బై
రేదియు మ్వొ నే పదునెక్కదు గ్రీష్మము మెండు కాపుం
బేదఱికంబు నొంద విను వీధికి న్లని మబ్బొకప్పుడున్‌
రాదు పోటుక్కునన్‌ జినుకు రాుట లేదది యేమి చిత్రమో!
1920లోనే రెండో సారి ప్రచురితమైన ‘సత్కథామంజరి’ మూడో సంపుటములో సీత వృత్తాంతమున్నది. ఇందులో విల్లుగాంచిన సీత, వరనిశ్చయమైన సీత, పరశురామునింగాంచు సీత, అడవికి వెళ్ళు సీత, రావణుని రథముమీది సీత, అశోకవనమున నుండు సీత, రావణ సంహారము వినిన సీత, అగ్ని ప్రవేశ మొనర్చు సీత, పట్టాభిషేకమునకేగు సీత అనే పేరిట ఖండికలున్నవి. ఈ మూడు భాగాలకు ముందుమాటలు రాసిన మేన మామ 1920నాటికి చనిపోయిండు. ఆయన ఈ అన్ని భాగాల్లోనూ ఈ క్రింది పద్యం జోడించిండు. తప్పుంటే తెలియజేయమన్నడు.
‘‘చ॥ ఇగ సత్కవి ప్రకరి మెంతయు క్షణ వేత్తలై సభా
స్తలుల జెలంగు పండితవితానముం దమ కూర్మిపుత్రియుం
జెలియుగా దంచి నను జిత్తమున్గరుణించి తప్పుల
న్గలిగిన జూచి దిద్దుదురు గాత క్షమింతురు గాత నిచ్చున్‌..
అట్లాగే కవయిత్రి అచ్చమాంబ కూడా ఈ క్రింది పద్యాన్ని మూడు సంపుటాల్లోనూ పేర్కొన్నది.
శ్రీమెఱయగ ముమ్మూర్తులు
దామైమేల్గోరదగు సుధానిధి వాత్మా
రామబ్రహ్మమ సీతా
రామా! యవధారు లోకరక్షణకామా॥
ఈ కవయిత్రి ఆధునిక కవిత్వం కూడా రాసింది. 1922లో ‘సంపెంగ’ పేరిట వెలువరించిన ఖండ కావ్య సంపుటిలో వివిధ అంశాలపై పద్యాలున్నాయి. అందులో ఒంగోలు పశువుల సంత, రాజమండ్రి మిషనరీ హాస్పిటల్స్‌, ఆంధ్రభాష, స్కూల్స్‌ గురించి రాసింది. ఈమె రాజమండ్రిలోనే పుట్టింది రాజమండ్రిలోనే పెరిగింది. గుంటూరులో నివసించింది.
అందుకే గౌతమీ నది గురించి ఇలా రాసింది.
కం॥ శ్రీరాణ్మహేంద్ర పురమున
గౌరవపుష్కరపు(దిధుల ఘన గౌతమి శృం
గారాస్పదయ కను(గొను
వారి ముదము పెనిచెలోక వంద్య మహాత్మా!
సీ॥ గోదావరీనదిం గోటిలింగాల రే
విది మహాస్థమంచు నెన్నినారు
రాచబాటలు తీర్చి రమణీయముగ(బెద్ద
పాలక వసతు లేర్పఱచినారు
కూరగాయలు పండు కొను వస్తువుల నెల్ల
విరివిగ నంగళ్ళ( బెట్టినారు
కనువిందొసగు పండ్ల దినుసు లొక్కొక్క చోట
నేర్పాటుగా నమ్మ నెంచినారు
గీ॥ పాత్రసామగ్రి మెండుగా( బఱచినారు
వివిధ దేశపు సరకుల( బెట్టినారు
బొమ్మను లక్క పిడతల నమ్మినారు
జనము లుపయోగముగొను బుష్కరపు వేళ!
ఇప్పుడిక ఆమె పుట్టు పూర్వోతరాల విషయానికి వద్దాము. ఈమె సుప్రసిద్ధ పండితుడు రాజమండ్రి కళాశాలలో అధ్యాపకుడిగా ఉండిన వావిలాల వాసుదేవశాస్త్రి సోదరి. ఈ వాసుదేవ శాస్త్రి షేక్‌స్పియర్‌ రాసిన ‘జూలియస్‌ సీజర్‌’ నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేసిండు. ఇట్లా ఇంగ్లీషు నాటకాలను అనువాదం చేసిన వారిలో ఈయనే మొట్టమొదటివాడు. ఈయన 1851లో పుట్టి 1897లో చనిపోయిండు. ఈయన వీటితో పాటు ‘బ్రాహ్మణీయము’ అనే ప్రబంధాన్ని 1875లో రాసిండు. అట్లాగే 1874లో ముముక్షు తారకం పేరిట భజగోవింద శ్లోకాలను తెలుగులోకి అనువదించిండు. 1877లో ‘పిత్రారాధన’ అనే పద్యకావ్యాన్ని రాసిండు. 1879లో ‘మాతృరూప స్మృతి’ పేరిట విలియమ్‌ కౌపర్‌ రాసిన ఖండకావ్యాన్ని తెలుగులోకి తర్జుమా చేసిండు. అట్లాగే బ్రాహ్మణుల్లో శాఖా బేధాలను నిరసిస్తూ ‘నందక రాజ్యం’ పేరిట ఒక స్వతంత్ర నాటకాన్ని రాసిండు. ఈయన రాజయోగి, వివేకవర్ధని మాస పత్రికల్లో అనేక వ్యాసాలను ప్రకటించారు. (టేకుమళ్ళ కామేశ్వరరావు, నా వాఙ్మయ మిత్రులు: విశాలాంధ్ర ప్రచురణ. 1996) ఈయన గురించి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ‘ఆంద్ర రచయితలు’ పుస్తకములో వివరంగా రాసిండు.
గుండు అచ్చమాంబ తండ్రి పేరు అప్పయ్య శాస్త్రి (1828-1874), తల్లి పేరు మహాలక్ష్మమ్మ (1831-1879). ఈమె పఠ్యం అద్వైత బ్రహ్మశాస్త్రి కుమార్తె. అచ్చమాంబ తల్లివైపు వారు కూడా పండితులే. తాత పఠ్యం అద్వైత బ్రహ్మశాస్త్రి భాషోద్ధారకులు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌కు గురువు. ప్రపితామహుడైన వావిలాల వెంకట శివావధానులు- వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆస్థాన పండితుడు. అప్పయ్య శాస్త్రికి ఆరుగురు కొడుకులు. ఇద్దరు కుమార్తెలు(?).
ఈమె జీవిత వివరాలు 1898లో తన అన్నగారి స్మృత్యర్థం ‘భ్రాత్రారాధన’ పేరిట వావిలాల అద్వైత శాస్త్రి రాసిన పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం బందరులోని భైరవ ముద్రాక్షరశాలలో ప్రచురితమయింది. దత్తత పోయిన అద్వైత శాస్త్రి తన అన్న వావిలాల వాసుదేవశాస్త్రి జీవితాన్ని పద్యాలో రాసిండు. ఇందులో ఆనాటి రాజమండ్రి కాలేజి చదువు, ప్రయాణ సాధనాల గురించి కూడా రాసిండు. నెల్లూరు, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం, ఒంగోలు, హైదరాబాద్‌, బనారస్‌, మదరాసు, రామేశ్వరం మొదలైన ప్రాంతాల గురించి కూడా రాసిండు. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన వివరాలు, బంధువులు, వ్యక్తుల విషయాలను రికార్డు చేసిండు. ప్రధానంగా ఉద్యోగస్థుల జీతభత్యాల్లో పెరుగుదల గురించి రాసిండు. ఈ పుస్తకం పునర్ముద్రించినట్లయితే ఆనాటి చదువుకున్న పండితుల జీవితాలు, జీతాల గురించి తెలుస్తుంది అద్వైత శాస్త్రి ఒక పద్యంలో తన తల్లి మహాలక్ష్మమ్మ గురించి ఇట్లా రాసిండు.
నమ్మశ్రీ మహాలక్ష్మమ్మ హర్షమొంద
అత్త అక్కయ్య బాబయ్య యుత్తముండు
నాయన ద్వైత బ్రహ్మార్యుడాయ మాంబ
నన్ను బెంచిరి బ్రేమ చే నన్న వినమె
...
తల్లి మహాక్ష్మమ్మ గర్భవతిగా ఉన్న కాలంలో ఆమె భర్త అప్పయ్య శాస్త్రి గతించిండు. ఆయన తన 46వ యేట భావ సంవత్సరం అంటే 1874లో చనిపోయిండు. ఆ విషయం గురించి ఇట్లా రాసిండు.
కన్ను మూసెను నిర్వాణ కామబ్బ
భావ వర్షము రాగానె చావు వచ్చె
నలుబదారేండ్లు నిండని గలిన మీకు
అమ్మ గర్భిణి గానుండ వానువాయ
...
స్కూలు మేష్టరి శాస్త్రన్న జాలియుండ
ఇంతనెలన్ని బూర్తిగా జింతతోనె
అమ్మగనె వెర్రి చెల్లిని నాతురముగ
మాసికము దీర్చి జాతక మేసి యుంచి
చెల్లి అచ్చమాంబ పుట్టుకతో పాటు తల్లి చావు గురించి ఆయన ఇలా రాసిండు.
సంతసము బోయిమన అమ్మజింత జెందె
మాత బహుధాన్య వత్సర మాఖ బహుళ
ద్వాదశిని గడిపి శివరాత్రి పర్వవేళ
మించి పరలోక మేగ నమ్మెత్త తల్లి
అని చెప్పిండు.
దీన్ని బట్టి గుండు అచ్చమాంబ 1875లో జన్మించిందని నిర్ధారించవచ్చు. అంటే ఆమె కడుపులో ఉండగానే తండ్రి చని పోయిండు. ఈమె తల్లి కూడా బహుధాన్య సంవత్సరం శివరాత్రి నాడు అంటే 1878లో చనిపోయింది. అంటే నాలుగేండ్లు నిండకుండానే అచ్చమాంబ తల్లిని, తండ్రిని ఇద్దరినీ కోల్పోయింది. అందుకే ఈమెను అపయ్య సోదరుడు (బుచ్చయ్య) పెంచి పెద్ద చేసినాడు. పెంచిన తల్లి పేరు రాజ్యలక్ష్మమ్మ. ఈ రాజ్యలక్ష్మమ్మ పేరిటనే అచ్చమాంబ పద్యాలు రాసింది. అచ్చమాంబ మరణానికి చింతిస్తూ వావిలా వాసుదేవశాస్త్రి రాసిన రెండు పద్యాలను కూడా ఇందులో (భ్రాత్రారాధన)లో చేర్చిండ్రు. అవి..
తండ్రి చన్న పిదప, ధరణి
పుట్టెడువారు బ్రతికి విభవమెంతో
పడయుదరని పెద్దలన్న మాట వృధచేసి
విధినీకు విధవ జన్మ వ్రాసె వెఱ్ఱికూన॥
రాజమంద్రిని బుట్టి రాజమంద్రిన
బెరిగి రాజమంద్రిలో విరాజియై
సభా జనంబునకు సుభోజనమైన
ట్లు బెండ్లి యైతిగదవె వెఱ్ఱికూన॥
ఇట్లా రాజమండ్రిలోనే చదువును సాగించిన ఈమె వివాహం చిన్నతనంలోనే గుండు వంశానికి చెందిన అప్పరాజు అనే అతనితో జరిగింది. బహుశా ఆ మామగారే గుండు వాసుదేవశాస్త్రి. మేన మామ కూడా!
...
పురికి తమ్మన్న ప్లీడరయి విరివి నుండ
మళ్లి క్రిష్ణకుమారె పెత్తల్లి కొడుకు
అప్పరాజమనుతచి నచ్చమ్మ కవికి
వచ్చె వైధవ్య మందుకై వంతజెందు
చుండ వెర్రికి నదిప్రాప్తి యుండెనన్న
చిన్న తాతయ్య పెంపుడు గన్న బామ్మ
మన్ను జేసెన్న భార్య తనతోనుండ
జబ్బు జీర్ణించి శ్మయి యుబ్బుచూప
కారుమూరేగి జెందెన కాలమృతిని
మార్గశిరశుద్ధ యష్టమి మారకంబు
వెర్రితో నెవ్వరేగరు వీలుగనక
గొల్లపురి నుంచి హరిబంపె గుండు వారి
మామ్మలన్నలు జేరిరి మరుదినంబు
మనకు గారాబు చెల్లెలు చినకుమారి
తండ్రి గనలేదు యెరుగదు తల్లి బాగ
పిల్లలును లేరు పతిబాయె పిన్ననాడె
ఈ రచన వల్ల అచ్చమాంబ తల్లిదండ్రు చిన్ననాడే చనిపోయారని తెలుస్తుంది. అట్లాగే బాల్య వివాహం, ఆ తర్వాత భర్త కూడా చిన్నతనంలోనే చనిపోయిండు. పిల్లలులేరు. ఈ దశలో ఆమె రాజమండ్రిలో చదువుకున్నది. ఆ తర్వాత గుంటూరులో నివసించింది. తనకు కలిగిన కష్టాలను కవిత్వ రచన ద్వారా అధిగమించింది. ఈమె రచనలు 1926 వరకు వెలువడ్డాయి. ఆ తర్వాత కూడా ఆమె బతికి ఉండే అవకాశమున్నది. అయితే 1875 నుంచి 1926 వరకు ఈమె కచ్చితంగా జీవించి యున్నదని నిర్ధారించవచ్చు.
ఈమె రచనలు ముందే పేర్కొన్నట్లుగా 1900లో మొదటి సారిగా ప్రచురితమయ్యాయి. (రామేశ్వర యాత్రా చరిత్ర) 1907లో మొదటి సారిగా అచ్చయిన సత్కథామంజరి మూడు భాగాలు 1920లో పునర్ముద్రణ పొందాయి. 1922లో తాను రాసిన కవితా ఖండికన్నింటిని ‘సంపెంగ’ పేరిట ప్రచురించింది.
మేనమామ గుండు వాసుదేవ శాస్త్రి 1917(8)లో చనిపోయిండు. (ఆంధ్ర పత్రిక ఉగాది సంచిక-1918) ఈయన ఒంగోలు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో రెవిన్యూకు శాఖలో పనిజేసిండు. గుండు వాసుదేవ శాస్త్రి ఆరవ తోబుట్టువు రాజ్యలక్ష్మమ్మ చనిపోయినప్పుడు ఈ కింద పేర్కొన్న పద్యాను రాసింది. (బహుశా ఈ రాజ్యలక్ష్మి యే ఆమె తల్లి).
క॥ శ్రీ రాజ్యలక్ష్మీ యప్పా!
ఈ రాజ్యము లెల్ల వదలి యేగితి వమ్మా
రారమ్ము పోయె ననుచును
నారాయణ స్మరణ తోడ నాలుక కదన్‌
గీ॥ రమ్ము రమ్మిక( దలుపు (దీయమ్మటంచు
పోయె మామ్మయ్య తాజచ్చిపోయె ననుచు.....
అట్లే తల్లి గురించి ఇలా కవిత్వ మల్లింది.
ఉ॥ ప్రొద్దున నేడుగంటలకు బోసిన గిన్నెడు జావ(ద్రావి యు
కెద్దియు వద్దు నాకు(జలి యింకొక దుప్పటి గప్పి మీరు
యొద్ద నె(గూరుచుండుడనెనొక్కెడ గాలును రాయుమంచువే
నిద్దుర బోయి లేచి శివునిన్‌ మదిలో స్మరియించె భక్తితో
వీటితో బాటుగా తన తల్లి వావిలాల రాజ్యక్ష్మమ్మ రాసిన ఒక కీర్తనను తన రచనల్లో పేర్కొంది. ఆ కీర్తన ఇలా ఉంది.
కాంభోజి రాగము - చావు తాళము
జననీ, నీ పదసేవ సల్పెద ననుగు బాలుని
సమయమీయవదే మమ్మా ఓ జననీ ॥జ॥
1. కారుమూరు పురీ కాపురమున్నట్టి కామాక్షి నన్గావవే
2. బ్రహ్మపట్టణమునందు బహ్మేశ్వరమ్మ పాదమ్ములే నమ్మితిని ॥జ॥
3. వసుధలో వావిలాల రాజ్యలక్ష్మీకి వరములీయరాగదే జననీ॥
జగదీశ్వరమ్మ పిన్నిగారు చెప్పినదిగా మరో కీర్తనను పేర్కొంది.
(శహాన రాగము తాళము)
గురువును జూడగనే గుఱినిలిచినదమ్మ
1. పరమపదంబైన బయలు గనుగొంటినమ్మ
అరిషడ్వర్గము నన్నంటక యున్ననమ్మ
అరసి పంచభూతములణచి వైచితినమ్మ ॥గు॥
2. ప్రాబల్యమైన హరి నీ ప్రేమతో గలడు కాని
ప్రణవనాదంబైన పలుకు వినగంటినమ్మ
3. బ్రహ్మానందముతోడ బ్రహ్మేశ్వరమ్మపాడ
నిమ్ముగా నాదు హృదయమ్మున నిలిచెనమ్మ!
ఇట్లా తెలుగు సాహిత్యానికి ఇద్దరు కొత్త కవులను కూడా ఆమె పరిచయం చేసింది. ఇంత చరిత్ర ఉన్న ఈమె రచనలు (దాదాపు అన్నీ) ఇప్పుడు లభ్యమవుతున్నందున వాటిని పునర్ముద్రించినట్లయితే తెలుగు సాహిత్యానికి ముఖ్యంగా ఆధునిక మహిళా సాహిత్యానికి మేలైన చేర్పు అవుతుంది. ఆ పనికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ గాని, విశ్వవిద్యాయాలు, అకాడెమీలు, సాహితీ ప్రేమికులు పూనుకుంటారని ఆశిస్తున్నాను.
గుండు అచ్చమాంబను ఆమె లాంటి మరెందరో మహిళా సాహితీవేత్తలకు కొత్తగా పాణం పోస్తున్న కాత్యాయని విద్మహే గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు.
- సంగిశెట్టి శ్రీనివాస్

Friday, June 19, 2020

వందేండ్ల కిందటి మన సంస్కర్తలు


మన గొప్ప మనం చెప్పుకుంటే అది హెచ్చులు/ఏతులుగా అనిపిస్తయి. అదే విషయాన్ని వేరేవాళ్ళు జెబితే దానికి ఆమోదనీయత, గౌరవం రెండూ ఉంటాయి. హైదరాబాద్‌ రాజ్య సంస్కర్తల గురించి ఆంధ్రాకు చెందిన కుసుమ ధర్మన్నరికార్డు చేసినంత గొప్పగా తెలంగాణ వాళ్ళు కూడా రికార్డు

Add caption

చేయలేదు. కుసుమ ధర్మన్న స్వయంగా హైదరాబాద్‌లో అప్పటి రాజకీయ నాయకుడు, హైదరాబాద్‌ అంబేడ్కర్‌గా ప్రసిద్ధి గాంచిన బి.ఎస్‌. వెంకటరావు అతిథిగా చాలా ఏండ్లున్నాడు. ఆయన దగ్గర పౌర సంబంధాల అధికారిగా పనిచేసిండు. ఈయనకు 1921 కన్నా ముందు నుంచే హైదరాబాదీ నాయకుతో సంబంధాలన్నాయి. బి.ఎస్‌.వెంకటరావు 1946 ఆ ప్రాంతంలో హైదరాబాద్‌ రాజ్య ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అంబేడ్కర్‌ విద్యాసంస్థల స్థాపనకు చేస్తున్న కృషికి మంత్రిగా తోడ్పాటు నందించారు. అందుకోసం ప్రత్యేకమైన ఫండ్‌ని ఏర్పాటు చేసిండు. ఈ వెంకటరావు సాన్నిహిత్యంతోనే 1921 నాటికే కుసుమ ధర్మన్న ఉద్యమకారుడిగా మారిండు. తర్వాతి కాలంలో ఆయన ప్రభావంతోనే దళితులు ఇస్లాం మతంలోకి మారి తమ ఆత్మగౌరవాన్ని రక్షించుకోవాలని పిలపునిచ్చిండు. 1937లో రాజమండ్రిలో జయభేరి అనే పత్రికను ఏర్పాటు చేసి దళితుల అభ్యున్నతికి కృషి చేసిండు. వృత్తిరీత్యా వైద్యుడైన ధర్మన్న అనేక ఊర్లు తిరుగుతూ ఒక వైపు వైద్యం మరోవైపు ఉద్యమ ప్రచారం చేసిండు. ఈయనకు స్ఫూర్తి ఆంధ్రా ప్రాంతం, మదరాసు ప్రావిన్స్‌ నుంచి గాకుండా హైదరాబాద్‌ రాజ్యం నుంచి అందింది.

జిల్లా చరిత్రలకు ఆద్యుడు శేషభట్టర్

జిల్లా చరిత్రలకు ఆద్యుడు శేషభట్టర్
తెలంగాణలో బహుశా మొత్తం తెలుగు లోనే వెలువడ్డ మొట్ట మొదటి జిల్లా చరిత్ర గ్రంథం ‘శ్రీ నల్లగొండ చరిత్రము’. దీని రచయిత శేషభట్టర్‌ వెంకట రామానుజాచార్యులు. ఈ గ్రంథం మొట్టమొదటి సారిగా 1919లో నల్లగొండలో తాను స్థాపించిన ‘శ్రీ వీరేశలింగ కవి కంఠాభరణ గ్రంథమాల’ తరపున మొదటి గ్రంథంగా (1921) వెలువరించాడు. అంతకు రెండేండ్ల ముందు చనిపోయిన కందుకూరి వీరేశలింగం పేరిట ఈ గ్రంథమాల స్థాపితమయింది. ‘‘దేశోపకారమే పరమావధిగానెంచి క్రీ.శ. 1919.లో నీ గ్రంథమాల స్థాపింపబడినది. ఇందు దేశాభివృద్ధికిని భాషాభివృద్ధికిని మిక్కిలి యావశ్యకములైన యుద్గ్రంథములు మూడు నెలలకొకటి చొప్పున బ్రచురించెదము’’ అని పుస్తకం వెనక అట్టపై పేర్కొన్నారు. ఈ గ్రంథమాల నిర్వహణలో నీలగిరి పత్రిక సంపాదకులు షబ్నవీస్‌ వెంకటరామనరసింహారావు, కొండగడప (నల్లగొండ జిల్లా) జాగీర్దారు అక్కినేపల్లి జానకిరామారావు (1885-1975)లు సహాయ పడ్డారు. ఈ గ్రంథమాల తరపున రాబోవు పుస్తకాలుగా చిల్లరిగె శ్రీనివాసరావు నవల శ్రీధర విజయము, బ్రాహ్మణ సాహసము (రెండవ భాగము- బహుశా ఒద్దిరాజు సోదరుల గ్రంథం) పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ ‘శ్రీ నల్లగొండ చరిత్రము’ పుస్తకంలో నమోదయ్యాయి. ఈ పుస్తకం కేవలం 30 పేజీల్లోనే వెలువడ్డప్పటికీ ఇందులో ఇప్పటి వరకు నల్లగొండ గురించి చరిత్రకెక్కని చాలా అంశాలు రికార్డయ్యాయి.
శేషభట్టర్‌ లభ్యరచనలన్నింటిని (భావ ప్రపంచము మినహా) విమర్శకులు, సాహితి చరిత్ర కారులు శ్రీరంగాచార్య గారు తమ సంపాదకత్వంలో 2018లో పుస్తకంగా తీసుకొచ్చారు. గ్రంథ రచయిత సంతానం తోడ్పాటుతో ‘శేషభట్టర్‌ వెంకట రామానాజాచార్యుల (లోకజ్ఞుడు) రచనలు’ పేరిట ఈ పుస్తకం అచ్చయ్యింది. ఇందులో రుక్మిణి (1916-నవల), ప్రాకృత దాంపత్యము (1918-నవల), అఖిల భారత తస్కర మహాసభ (1940 ప్రాంతం- పానుగంటి సాక్షి వ్యాసాల మాదిరి రచన), నల్లగొండ చరిత్రము (1921-చరిత్ర) ప్రేమ బలము (లఘు నాటిక), మౌఢ్య మహిమ (1910- నాటకం) రచనలు ఈ సంకలనంలో ఉన్నాయి. ఇవి గాకుండా శేషభట్టర్‌ ‘కర్మస్థలము’, ‘ఆంధ్రవీర ప్రబోధము’, ‘హాస్య నాటికలు’, ‘హిందూ దేశ చరిత్ర’ (నాటకం), ‘బహెరెనూర్‌’ (నవల), ‘ప్రకృతి కన్య’ (నవల) గ్రంథాలు ఆయన రచనలుగా రికార్డయ్యాయి. అలాగే ఈయన ‘అఖిల భారత తస్కర మహాసభ’ అనే వ్యంగ్య రచన కూడా చేసిండు. వీటితో పాటు ఆయన 1920-40 మధ్య కాలంలో నీలగిరి, తెనుగు పత్రిక, సుజాత, గోలకొండ పత్రికల్లో అనేక పద్యాలు రాసిండు. అందులో అస్పృశ్యత నివారణపై రాసినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వెలుగులోకి రావాల్సి ఉన్నవి.
తన సంపాదకత్వంలో వెలువడ్డ ‘శేషభట్టర్‌ వెంకట రామానుజాచార్యుల రచనలు’ కాపీనొకదాన్ని శ్రీరంగాచార్య సారు నాకిస్తూ చదివి దాని మీద రాయమన్నారు. ఇన్నాళ్ళు కుదురలేదు. ఈ కరోనా సమయంలో దాన్ని చూడడమయింది. అయితే ‘నల్లగొండ చరిత్రము’ పుస్తకములో కొన్ని పేజీలు అచ్చులో మిస్సయినాయి. అవి ఆ గ్రంథానికి విలువని జోడించేవి.
ఈ నల్లగొండ చరిత్రములో ఆ పట్టణానికి, జిల్లాకు సంబంధించిన అనేక వివరాలున్నాయి. 1800 ఆ ప్రాంతంలో నుంచి నల్లగొండలో జనావాసం పెరుగుతూ వచ్చిందని, అంతకుముందు ‘పానగల్లు ’ ప్రధాన పట్టణమని పేర్కొన్నాడు. 17వ శతాబ్ది ఆరంభంలో ఇక్కడ ప్రతి గురువారం జరిగే సంతలో దాదాపు 70, 80 వే రూపాయల వ్యాపారం జరిగేదని పేర్కొన్నాడు. ఇంతవరకు ఆధునిక చరిత్రలో సరిగ్గా రికార్డు కాని చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. అందులో ప్రధానమయింది. కుతుబ్‌షాహి రాజుకు నల్లగొండ దుర్గాధీశుడు హరిశ్చంద్రుడుకు సంబంధించిన యుద్ధం. దీని గురించి ఈ గ్రంథంలో శేషభట్టర్ ఇట్లా రాసిండు.
‘‘1516లో (నిజానికి అది 1519- అసలు పుస్తకములో అసీసు తప్పుగా 516 అని ఉంది) ‘బహమన్‌ షాహీ’ రాజ్య మంతరించి ‘కుతుబ్‌షాహీ’ రాజ్యకాల మారంభమాయెను. ఈ రాజ్య స్థాపకుడైన ‘మొహమ్మదు కులీకుతుబ్‌షా’ తన రాజ్యమును ధృడపరచు కొనుటకై బయలు వెడలి గోల్కోండ నుండి తూర్పు సముద్రము వఱకు పానగల్లు, మచిలీబందరు, రాజమండ్రి, రాజుకొండ, కొండపల్లి, వేలూరు, మొదలైన 70 జిల్లాలను జయించెనట. అందు నల్లగొండ దుర్గమును గురించి యీ ప్రకారముగా చెప్పబడినది:
కుతుబుషా బహు సైన్య యుక్తుడై నల్లగొండ దుర్గము నావరించి యుండెను. ఆ కాలమున నీ దుర్గమును హరిశ్చంద్రుడను రాజు (దుర్గము పునర్నిర్మాణము చేసిన వాడు) పాలించు చుండెను. హరిశ్చంద్రుని ధైర్య సాహసము వలనను దుర్గము యొక్క బలిష్టత వలనను కుతుబుషా యెంత ప్రయత్నించినను విజయము సమకూడునట్లు కాన్పించదాయెను. అనేక దినము ముట్టడి వలన యిరుదెగ వారును విసువు జెంది యుద్ధమంత మొందిన బాగుండునని దలంచు చుండిరి. కుతుబుషా సంధి చేయనెంచి యీ వార్త రాజునకు జెప్పబంపెను. అతడును దాని కొఱకే నిరీక్షించు చున్నవాడు గావున తాను పాషాకు సామంతుడుగ నుండుట తన కిస్టమే యనియు షా తనయెడల క్రోధ భావము మాని స్నేహ భావము బూన వలయునని యుంజెప్పి యనేకమగు విలువ గల కానుకతో గూడ తన రాయబారిని కుతుబుషాహ వద్దకి బంపెను. షాహ సైతమా రాయబారిని తగురీతిని సన్మానించి తన మనసున నిట్లని వితర్కించెను. ‘‘నేనిన్ని దినముల నుండి ఈ చిన్న దుర్గమును ముట్టడి వేసియు దీనిని జయింపలేక సంధిచేసుకొని పోవుట నా రాజ గౌరవము కర్హమయిన పనిగాదు. ఏట్లయినను దీనిని వశపరుచుకో వలయును’’ ఇట్లు వితర్కించి రాయబారిని తిరిగి పంపివేయు నప్పుడతనితో ఓయీ! మీ రాజుతో నా మాటలుగా నిట్లుల చెప్పుము. ‘‘ఇప్పుడు మన కిద్దఱకును సంధి కుదిరినది కావున మన మన్యోన్య స్నేహితులము. నల్లగొండ దుర్గము అత్యున్నతమై శత్రువుకగమ్యమై కాన్పించు చున్నది. ఇట్టి యద్భుత విషయమును నీ మిత్రుడునగు నేను చూచిపో నిచ్చగించితి’’ నని చెప్పెను. హరిశ్చంద్రుడా మాటల వలన కుతుబుషా దురుద్దేశ్యమును తక్షణము గ్రహించి యాతని కిట్లు చెప్పి యంపెను.
‘‘మీరు మీయిష్ట ప్రకారమే దుర్గము జూచి వెళ్ళవచ్చును.’’ కాని మీ వెంట మాత్రము కొందరు ముఖ్యానుచరులు తప్ప సైన్య మేదియు నుండరాదు.’’ ఇట్లు చెప్పి పంపి తన దుర్గ రక్షకులకు యాతనిని కైదు చేయవలయునని గట్టి తాకీదు చేసెను. వారునుతమ కార్యము నందు ప్రమత్తులయి యేయుండిరి. అయినను దైవ బలము లేనప్పుడు మనుష్య ప్రయత్నము నిరర్ధకమగును గదా కుతుబుషా కొందరు మెఱియలవంటి యనుచరులను వెంట నిడుకొని దుర్గద్వారము గుండ లోనికి బోయి యచ్చటి ద్వార రక్షకులను జెండివైచెను. అప్పుడు ద్వారమును బంధించువారెవరునూ లేక పోగా నది వఱకే కుతుబుషా ఆజ్ఞవలన సన్నద్ధులై వచ్చుచున్న యాతని భటులు లోనికి జొరబడిరి. అప్పుడిరు తెగ వారికి పోరు ఘోరమయ్యెను. తెలుగు భటులు స్వల్పముగా నుండుటచే కుతుబుషా సైన్యము వారందరిని నాడు నిశ్శేషముగా సంహరించెనట! హరిశ్చంద్రుడు కైదు చేయబడి అటు పిమ్మట వేంకటగిరి సంస్థానాధిపతిగా జేయబడెననియు నిప్పటికిని, ఆ సంతతివారే దానికి రాజుగా నున్నారనియు నొకరు వ్రాయు చున్నారు’’ అని ఉర్దూ పుస్తకాల ఆధారంగా శేషభట్టర్‌ గారు రాసిండ్రు. ముందుమాటలో ‘మౌల్వీ మొహమ్మద్‌ సుల్తాన్‌ రాసిన ‘జొగరాఫియా దక్కన్‌, సయ్యదు అహమదలీ రాసిన ‘తారీఖె నల్‌గొండ’ పుస్తకాలు ఉపయోగ పడ్డాయని ఇందులో పేర్కొన్నాడు. ఇదంతా నల్లగొండ చరిత్రకు కొత్తగా ఉపయుక్తమయ్యే అంశం. నల్లగొండ చారిత్రాభిమానులు పూనుకొని వీటిని పరిశోధించాల్సిన అవసరమున్నది. ముఖ్యంగా ఉర్దూ ఆధారాలను పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు అంతగా వెలుగు లోకి రాని చరిత్రపై వెలుగులు ప్రసరించే అవకాశమున్నది.
అంతా బాగానే ఉన్నది కానీ రంగాచార్య గారు సంపాదకత్వం వహించిన పుస్తకములోని నల్లగొండ చరిత్రలో మూడున్నర పేజీలకు మించి మ్యాటర్ మిస్సయ్యింది. పుస్తకం మొత్తం కలిపి 30 పేజీలు కూడా లేదు. అందులో మూడు పేజీలు మిస్‌ కావడంతో ‘సయ్యద్‌ లతీఫుల్లా ఖాదరీ’ గోరీ, దుర్గ నిర్మాణానికి సంబంధించిన చాలా విషయాలు అచ్చు కాకుండా పోయాయి. సమగ్ర రచనల్లోని పేజి 296, 15 వలైను నుంచి సమాచారం జోడించాల్సి ఉంటుంది. ఒరిజినల్‌ పుస్తకంలోని 15వ పేజీలో రాను రాను భాషా పరిణామ మహత్వ మున ‘నల్లగండి’ ని ‘నల్లగొండ’ యని పిలువజొచ్చిరి. ఈ యూరికీ పేరు వచ్చుటకీ కారణమే విశ్వసనీయముగా గన్పట్టు చున్నది. అని నల దమయంతుల్లోని నలుని పేరిట నల్‌గొండ వచ్చిందనే ఒక ప్రచారాన్ని కూడా పేర్కొన్నారు. కాకపొతే అది అంట విశ్వసనీయం కాదన్నారు. అయితే రంగాచార్య సారు సంపాదకత్వం వహించిన ఈ పుస్తకంలో రాను రాను భాషా పరిణామ..... తర్వాత మ్యాటర్‌ మిస్సయి మళ్ళీ 18వ పేజీలోని ..... మాతయునైన అనే దగ్గరి నుంచి ప్రారంభమయింది. దీన్ని సవరించాల్సిన అవసరమున్నది.
ఇప్పటి యాదాద్రి-నల్లగొండ జిల్లా దత్తప్పగూడెం గ్రామానికి చెందిన శేషభట్టర్‌ ఏప్రిల్‌ 16, 1900వ సంవత్సరంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు రామానుజమ్మ కృష్ణమాచార్యులు. ఈయన వకీలుగా మహబూబాబాద్‌, భువనగరి, నల్లగొండ, దేవరకొండ తదితర ప్రాంతాల్లో పనిచేస్తూ చిన్న వయసులోనే అంటే 44 ఏండ్లకే హైదరాబాద్‌లో మే 19, 1944 నాడు మరణించారు.
1927 నాటికే అస్పృశ్య నివారణపై పద్యాలు రాసిన శేషభట్టర్‌ వెంకటరామానుజాచార్య రచనలు ఒక్క దగ్గరి తీసుకు వచ్చినందుకు శ్రీరంగాచార్య గారు ఎంతైనా అభినందనీయులు. ఈ పనికి శేషభట్టర్‌ కుటుంబ సభ్యులు పూనుకోవడం ముదావహం. మిగిలిన రచనలు కూడా వెలుగు వచ్చినట్లయితే ఆయన ప్రతిభ, పాండిత్యం ప్రపంచానికి తెలిసే అవకాశముంటుంది.
శేషభట్టర్‌ గురించి రాసిన ‘తెలంగాణ నవలా చరిత్ర’ (2017) గ్రంథంలో ఇట్లా రాసిన ‘‘లోకజ్ఞుడు కలం పేరుతో అనేక రచనలు వెలువరించిన ఈయన నల్లగొండ జిల్లా వాడు. సంస్కృతం, ఉర్దూ, అరబ్బీ, ఫార్సీ, మహారాష్ట్ర, కన్నడ, ఇంగ్లీష్‌ భాషలు స్వయంగా నేర్చుకోవడమే గాకుండా అందులో కవిత్వం చెప్పిన దిట్ట శేషభట్టరు’’. అదీ ఆయన ప్రతిభ. ఈ ప్రతిభావంతుడిని తెలుగు సాహితీ ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- సంగిశెట్టి శ్రీనివాస్



fsar Mohammed, Nawian Samala and 7 others
4 comments
Like
Comment
Share

Comments

View 1 more comment

Friday, June 12, 2020

అంతటి నరసింహం

 



అంబేడ్కర్‌ భావజాలాన్ని ఆచరించి

రచనలతో ప్రచారం చేసిన

బహుజనుడు అంతటి నరసింహం

‘‘ఎంతటి వారలైనా నీ అవసరం రానంత వరకే నిన్ను విస్మరిస్తారు.’’
    ఈ విస్మరణ, వివక్షాపూరిత వైఖరి మూలంగా కొన్ని సార్లు వైయుక్తిక నష్టం కన్నా సమాజానికే ఎక్కువ నష్టం జరుగుతుంది. కొంతమంది సాహితీమూర్తులు సృజించిన రచనలను విస్మరించడం వల్ల వారికన్నా ఎక్కువగా మనకే నష్టం జరుగుతుంది. జరిగింది కూడా! అట్ల ఒకతన్ని అతని రచనలను విస్మరించి మనకు మనం నష్టం చేసుకున్నాము. ఆయన పేరు డాక్టర్‌ అంతటి నరసింహం.
Add caption
కడపజిల్లా వెంకటరాజు పల్లెకు చెందిన అంతటి నరసింహం కులం రీత్యా గౌడ్. ఈయన కావ్యాలు, సాంఘిక నవలలు, చారిత్రక రచనలు, నాటకాలు, విమర్శ, బాల సాహిత్యం ఇట్లా అనేక ప్రక్రియల్లో ఆరు దశాబ్దాల పాటు రచనలు చేసిండు. ఇప్పుడిక్కడ ఆయన రాసిన ‘చీకట్లో కాంతి రేఖలు’ అనే నవల గురించి చర్చించుకుందాం.
‘చీకట్లో కాంతిరేఖలు’ నవల మొదట ఆంధ్రభూమి దిన పత్రిక ఆదివారం అనుబంధంలో సీరియల్‌గా ప్రచురితమయింది. అనంతరం 1982లో పుస్తక రూపంలో వెలువడింది. ఈ నవల 1991లో పునర్ముద్రితమయింది. ఒక నవల రెండుసార్లు అక్కవడం అరుదు. రెండోసారి ప్రచురితమైన నవల ఆధారంగానే ఇక్కడ రాస్తున్నాను.
తెలుగునాట 1985లో కారంచేడు సంఘటన తర్వాత దళితోద్యమం పురుడు పోసుకుంది. ఇది సాహిత్యంలోనూ ప్రతిఫలించింది. ఆ తర్వాత 1990లో పూలె శతవర్ధంతి, అనంతరం 1991లో అంబేడ్కర్‌ శతజయంతి, మండల్‌ ఉద్యమం, బహుజన సమాజ్‌ పార్టీ కార్యకలాపాలు అన్నీ కలిసి దళిత చైతన్యానికి పాదులు వేశాయి. అయితే ఇవేవి లేని సమయంలోనే అంతటి నరసింహం ‘చీకట్లో కాంతిరేఖలు’ అనే చారిత్రక, రాజకీయ, దళిత చైతన్య నవలను రాసిండు. నవలా నాయకుడు దళితుడు. మాల కులస్థుడు. పేరు కాంతారావు.
    ఈ కాంతారావు ప్రాథమిక విద్య నుంచి ఐఎఎస్‌ అధికారిగా ఎదిగి వచ్చే క్రమాన్ని అంతటి నరసింహం అత్యంత సమర్ధంగా చిత్రించిండు. చాలా విషయాలు తాను స్వయంగా చూసినవి కావడంతో వాటికి జీవం పోసిండు. ఈ నవల చాలా రకాలుగా కొత్త పుంతలు తొక్కింది. ఇందులోని కథ 1930-1958 మధ్య కాలంలో గుంటూరు, హైదరాబాద్‌ రాజ్యం, మదరాసు చదువులూ, అమెరికా రాక పోకలు, దళితులపై దాడులు, పొగాకు కూలీలు, వారిపై అత్యాచారాలు, క్రైస్తవం, మతమార్పిడులు, మాల-మాదిగల విభేదాలు, వారిమధ్య సయోధ్యకు కృషి, కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ రాజకీయాలు, తెలంగాణ-ఆంధ్ర సంబంధాలు, రజకార్లు, సాయధ రైతాంగ పోరాటం, ఆంధ్రాధిపత్యం, విద్య ప్రాధాన్యత, దళితుల ఆత్మగౌరవం, మదరాసులో దళితులకు కిరాయికి ఇండ్లు దొరకని స్థితి, తెలంగాణలోదొరలదౌర్జన్యాలు, దళితుల ఉన్నతచదువులు, కులఅంతరాలు- ఇట్లా అనేక విషయాలను మేళవించి దలోతుల జీవితాలను చిత్రించిండు.
అన్నిటి కన్నా ప్రధానంగా కాంగ్రెస్‌ వాదిగా బయలుదేరిన వ్యక్తి మధ్యలో కమ్యూనిస్టుగా అదీ తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకి పట్టుకొని ప్రత్యక్షంగా పట్టుకున్న వ్యక్తి 1956 నాటికే అంబేడ్కరిస్టుగా, ఐఏఎస్ గా ఎదిగిన తీరు, సమాజంలో వచ్సిన మార్పును పొల్లు పోకుండా కండ్లముందుంచిండు. మొదట్లో గాంధీ-అంబేడ్కర్‌ ఇద్దరినీ అభిమానించిన వ్యక్తి ఆఖరికి అంబేడ్కర్‌ దగ్గర వచ్చి ఆగిన తీరుని ఇందులో రాసిండు.
ఇదొక విశిష్టమైన నవల. ఎందుకంటే నవలాకారుడిది రాయలసీమ. కథా నాయకుడు గుంటూరు వాసి. ఈయనకు స్ఫూర్తి, గురువు తెంగాణకు చెందిన కమ్యూనిస్టు, మాలదాసరి. అనంతరం ఈ మాలదాసరి 1952 ఎన్నికల్లో గుంటూరు జిల్లా రిజర్వుడు నియోజక వర్గం నుంచి కమ్యూనిస్టు పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇట్లా ఈయన విజయానికి తోడ్పడింది తెలంగాణలో రజకార్ల దోపిడీలో సర్వం కోల్పోయిన భూస్వామి కూతురు. ఈమె పేరు శశి. ఈమె తర్వాతి కాలంలో అంటే 1952-53 నాటికే అమెరికా వెళ్ళి అక్కడ చదువుకుంటుంది. అక్కడ ఉద్యోగం కూడా చేస్తుంది. దళిత కథానాయకుడు - శశి మధ్యన ప్రేమ, ఆత్మాభిమానం గురించి రచయిత చక్కగా అక్షరాలుగా చెక్కిండు. కాంతారావు అమెరికా వెళ్ళినపుడు అక్కడి హోటల్‌ యాజమానులు ‘కుక్కల-, ఇండియన్లకు’ ప్రవేశం లేదు అని రాయడాన్ని వ్యతిరేకిస్తాడు. ఇట్లా రచయిత కథానాయకుడు ఇండియాలోనూ, అమెరికాలోనూ ఎదుర్కొన్న వివక్షను అక్షరబద్ధం చేసిండు.
    ‘‘కాంతారావుది గుంటూరు ప్రక్కన పల్లె. పల్లెగాదు, పల్లె ప్రక్కన హరిజనవాడ. [హరిజన పదం వాడకాన్ని ఇప్పుడు నిషేధించారు.] ఇతరుల దృష్టిలో హరిజన వాడేగాని అది రెండుగా చీలి వుంది. ఒకటి మాలవాడ, రెండవది మాదిగవాడ. మాల వాడకు చెందిన వాడు కాంతారావు’’ అని కథా నాయకుడి గురించి చెబుతాడు.
అదే సమయంలో కథా నాయకుడు కాంతారావు తన ఊరు (గుంటూరు పక్కనే ఉండే ఊరు)లో యువకు కోసం రాత్రి పాఠశా నిర్వహించడం, మా`మాదిగ మధ్యన మైత్రి కోసం ప్రయత్నించడం, దళిత బాలిక విద్య కోసం కృషిచేయడం, గ్రంథాయోద్యమంలో నేరుగా పాల్గొనడం కూడా రాసిండు.
దళితులే ఎక్కువగా కమ్యూనిజం వైపు మళ్ళిన విషయాన్ని కూడా నరసింహం గారు రాసిండ్రు. ‘‘మనదేశంలో హరిజనులు కమ్యూనిజం వైపు మొగ్గు చూపినంతగా మరే జాతీ చూపదు. కమ్యూనిజంలో సమతాభావం వుంది. అది బీద వర్గాల పక్షం వహిస్తుంది. కర్షక కార్మిక పక్షంగా వుంటుంది. కుల మతాలుండరాదని ఆచరణ రీత్యా చూపుతున్న పార్టీ అది అప్పట్లో’’ అని ఆనాటి కమ్యూనిస్టు పార్టీ గురించి చెప్పిండు.
అట్లాగే గాంధీ హత్య గురించి కూడా ఇందులో రాసిండు.
‘‘త్వరగా భోంచేసి పాఠశాలకు వెళ్ళాలని భోజనం ముందు కూర్చున్నాడు. అన్నం కలిపి ముద్ద నోటికెత్తబోతున్నాడు. సోమన్న గసపెట్టుకుంటూ పరుగెత్తుకొని వస్తున్నాడు. కన్నీళ్ళు కారుతున్నాయి. యేడుస్తూ గాద్గదిక స్వరంతో చెప్పబోతున్నాడు. మాట పెగిలి రావడం లేదు. కాంతారావు గాభరాగా ‘‘ఏమిటిది సోమన్నా?’’ అన్నాడు. అతి ప్రయత్నంతో ‘‘గాంధీజీ హత్య’’ అన్నాడతను. ఏం వింటున్నాడో కాంతారావు అన్నం అట్లానే వదిలేసి లేచాడు. ‘‘ఏమిటంటున్నావ్‌?’’ అన్నాడు నమ్మనట్లుగా.
‘‘గాంధీజీని హత్య చేశాడు ఒక మత మూర్ఖుడు?’’
‘‘ముస్లిమేనా’’
‘‘ఛీ! ఛీ! హిందువే. ఒక కులతత్త్వవాది.’’
అంతే! చెయ్యి కడుక్కొని యాంత్రికంగా మౌనంగా గుంటూరు పరుగెత్తారు. గుంటూరులో ప్రతి రేడియో కూడా విషాద సంగీతం వినిపిస్తున్నది. ‘రఘుపతి రాఘవ’ అని ఆలాపన చేస్తున్నది.’’ (చీకట్లో కాంతిరేఖలు: 56) అని గాంధీ హత్యను రికార్డు చేసిండు.
```
1948లో తెలంగాణలో సాయుధ పోరాటం ఊపందుకోవడంతో తన స్ఫూర్తిప్రదాత ‘దాసు పంతులు’తో పాటు స్వయంగా తుపాకి పట్టిండు. నైజాం సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఈ సందర్భంగా దాసుపంతులు పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడిండు. అట్లాగే సూర్యాపేటకు దగ్గరలోని జగన్నాథపురంలో రజాకార్లు దోపిడికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకొని సాయుధ కమ్యూనిస్టులు అక్కడికి చేరుకున్నారు.అప్పటికే రజాకార్లు గడీలో దొరను చంపేసిండ్రు. ఆయనతో పాటు ఇంట్లో ఉన్న వారినందరిని చంపేసిండ్రు. అయితే కాంతారావు సాహసంతో వ్యవహరించి అక్కడ చిక్కుకు పోయిన భూస్వామి కూతురు శశిని రక్షిస్తాడు. తర్వాత ఆమెను సంస్కరణ భావాలు గల పోలీసు దంపతులు గుంటూరులో తమ దగ్గరే ఉంచుకొని చదివిస్తారు. స్థూలంగా ఇదీ కథ. అయితే ఇందులోనే ఎన్నోఉపాంగాను అంతటి నరసింహం చేర్చిండు.
సాయుధ పోరాట కాలం నాటి తెలంగాణ ప్రజల జీవితాలను చాలా చక్కగా అక్షరబద్ధం చేసిండు. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని, ఆంధ్రా అధికారుల దోపిడీ మనస్తత్వాన్నీ చిత్రించిండు. తెలంగాణ ప్రజల పట్ల పూర్తి సానుభూతి, సహానుభూతితో రాసిండు. పోలీసు చర్య నాటి జీవితాలను ఇట్లా చిత్రించిండు. ‘‘తెలంగాణ ప్రజానీకం చాలా వెనుకబడిన సమాజం. దారిద్య్రంలో అజ్ఞానంలో మునిగి ఎన్నెన్నో కష్టాలను తమ పూర్వజన్మ కర్మ అనుకుంటూ అనుభవించిన అమాయక జనం. కమ్యూనిస్టు అండా, వారు స్థాపించిన గ్రామ రాజ్యమూ కొంత ఊరట కలిగించినా ఎ్లప్పుడూ సింహ వ్యాఘ్రాది క్రూర జంతువుల భయంచేత నిత్య జాగరూకతతో ప్రవర్తించే జింకల్లాగా భూస్వాములా రజాకార్లా దాడులను శంకిస్తూ వుండే నిస్సహాయ జనం. సైన్యాన్ని చూచి ఆనందించిన యీ జనం వారి ఘాతుక చర్యలను చూచి నిర్వేదం పొందింది.
పుండు మీద కారం చల్లినట్లుగా పాలకుల దుర్మార్గం కూడా తోడయింది. నిజాం రాజ్యాన్ని సైన్యాలు మూడు దినాల్లోనే స్వాధీనం చేసుకోగానే యూనియన్‌ ప్రాంతాల నుండి, ముఖ్యంగా మద్రాసు రాష్ట్రం నుండి అడ్మినిస్ట్రేషన్‌ కోసం కొందరు డిప్యూటి తహసిల్‌ దార్లను తహిసిల్‌దార్లుగాను, తహసిల్‌దార్లుగా వున్న వారిని డిప్యూటి కలెక్టర్లుగానూ, సబ్‌ ఇన్‌స్పెక్టర్లను ఇన్‌స్పెక్టర్లుగానూ, ఇన్‌స్పెక్టర్లను డిప్యూటి సూపర్నెంట్లుగాను ప్రమోషన్‌ ఇచ్చి తెంగాణాకు పంపారు. నిజాం రాష్ట్ర ఉద్యోగులో అధికాంశం ముస్లిములే గాబట్టి వారి చేతుల్లో అణగారిపోయాం అనుకుంటున్న గ్రామీణ హిందూ ప్రజానీకం యీ అడ్మినిస్ట్రేటర్లను చూచి ఎంతో ఆనందించి హృదయత: స్వాగతం పలికారు. దేవుళ్ళను చూచి మొక్కినట్లుగా నమస్కారం చేస్తూ, ఇక తమ కష్టాులు శాశ్వతంగా తొలగి పోయాయని భావించారు. కాని వ్యక్తి వ్యక్తి స్వార్థ చిత్తుడై వ్యక్తి స్వార్థం కులస్వార్థం అనే మురికి గుంటల్లో నివసిస్తూ యీ అధికారి మండూకాలు నాలుకలు చాచి చిన్న చిన్న కీటకాల్లాంటి యీ జనంపై బడి భక్షించసాగారు.
ఇదిరకటి వారు దండయాత్రలాగా వచ్చి పాడు చేసి వెళ్ళిపోయారు. ఇపుడు వచ్చిన వీరు స్థిరంగా ఒక చోట వుండి నిదానంగా భక్షింపసాగారు. లంచగొండితనం ఎంత పరాకాష్ఠనందుకుందో ఆ ప్రజలకు అర్థమయింది. యూనియన్‌ అడ్మినిస్ట్రేటర్ల ధనదాహం చెప్పనలవి కానిది. అక్కడ వున్న భూస్వాములపైనా బహీనవర్గాలపైనా వివక్ష లేకుండా పడి దోచుకోవడమే వారి పని! ప్రతివాడూ వాడికి తగిన విధంగా దోచుకోవడమే. సర్వభక్షకుల్లాగా తయారైపోయారు. ఇక వీరి కామదాహం వర్ణనాతీతం. హిందూ ముస్లిం భూస్వాముల యిండ్లలో వచ్చి పసుపు కొమ్ముల్లాంటి అందమైన ఆడవాళ్ళనూ తటస్థపడిన ఆడవాళ్ళనూ బొమ్మల్లాగా వుపయోగించుకున్నారు.
ఇది వరకు రజాకార్ల క్రౌర్యానికి తట్టుకోలేక యూనియన్‌ ప్రాంతాకు పారిపోయిన వాళ్లంతా తిరిగి తెలంగాణలోకి నిర్భయంగా ప్రవేశించారు. తీరావచ్చి ఇక్కడి పరిస్థితులు చూచి విస్తుపోయారు. యూనియన్‌ ప్రాంతాల్లో ముఖ్యంగా గుంటూరు బెజవాడ మొదలైన పట్టణాల్లో ప్రాణాలను అరచేత బట్టుకొని పారివచ్చిన తెలంగాణ వారినుండి బాడుగలు అధికంగా లాగడం ద్వారా అధిక ధరలకు మోసంగా వస్తువులు నమ్మడం ద్వారా దగా చేయడం చూచిన యీ శరణార్థులు తిరిగి వచ్చి, తమ వారంతా అధికార్ల చేతుల్లో అనుభవిస్తున్న కడగండ్లను చూచి విస్మయం చెందారు. అదే అప్పటి నుండే ఆంధ్ర ప్రాంతం వారంటే తెంగాణ వారికి మంటలెత్తడం మొదలు.’’ (చీకట్లో కాంతిరేఖలు: 110-111)’’ దీన్ని బట్టి ఆనాటి ఆంధ్రాధికారుల అఘాయిత్యాలు, దోపిడి, దౌర్జన్యం తెలుసుకోవచ్చు. ఇట్లాంటివే అనేక సంఘటనలు అంతటి నరసింహం గారు ఈ నవలలో రాసిండ్రు. మదరాసు పట్టణంలో దళితులకు కిరాయికి ఇండ్లు ఇవ్వని విషయాన్ని, దళితులకు బుద్ధి చెప్పడం కోసం పొగాకు రైతులు సమ్మె చేస్తున్న వారిని బెదిరించడం. అత్యాచారాలకు ఒడిగట్టడం, అత్యాచారాలు చేసి అనివార్య పరిస్థితుల్లో దండుగలు కట్టి ఎట్లా దొరలు లైంగిక దాడికి దిగేవారో రాసిండు. కుల మతా తారతమ్యాలు, అవి పోవడానికి చేయాల్సిన కృషి, కులాంతర వివాహాల ప్రసక్తి ఇట్లా అనేక విషయాలు ఈ నవలలో ఆయన చిత్రించిండు.
- - -
‘‘సమాజాన్ని నడిపించేది నీతి. నీతి అంటే, అదేదో పాతచింతకాయ పచ్చడి అనీ, వేదాంతులకు అవసరమైన పదం అనీ, అనుకోగూడదు. అది ప్రతినిత్యమూ సంఘావసరాన్ని బట్టి మారుతూ సమాజాన్ని ముందుకు నడిపించే చుక్కాని లాంటిది. నిత్యగమనం గలది.
ప్రతి వ్యక్తి జీవితమూ, సంఘర్షణమయమే. స్వార్థమయమే! స్వార్థం యెప్పుడూ అసూయా ద్వేషాలకూ, అక్రమ ప్రవర్తననూ, దారితీస్తూనే వుంటుంది. తత్ఫలంగా సంఘర్షణ జనిస్తుంది. ధనసంచయమూ, కామతృష్ణా, పరిశ్రమ చెయ్యకుండా సుఖజీవిత వాంఛా, భావితరాల సుఖజీవనం కోసం ఆస్తి కూడబెట్టడం వగైరాలు ఈ స్వార్థానికి ఆలంబనాలు’’ అని అంతటి నరసింహం ఈ నవలకు రాసిన ముందుమాటలో చెప్పిండు. అట్లాగే ‘‘ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం. సమాజంలోని అందరికీ సమజీవనం అనుభవించాల్సిన హక్కుంది. అందుకు అవాంతరాలు యేర్పడితే వాటిని తొలగించుకోవసిన హక్కుగూడా అందరికీ వుంది. అయితే అంత చైతన్యం అందరికీ వుండదు. అందుకే రచయితలు ఆ బాధ్యత వహించాలి. రచయితలు ఎప్పుడూ దూరదృష్టి గలవారు. వారికి బాధ్యతున్న విషయం వారు మరువరాదు.’’ అంటూ రచయిత కర్తవ్యాన్ని కూడా చెప్పిండు.
ఆయన కర్తవ్య బోధనే గాకుండా ఆచరించి చూపించిండు. గాంధీ - అంబేడ్కర్‌ రాజకీయాలను, రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌, ఎన్నికలు, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు రాజకీయాలు, ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఇట్లా అనేక రాజకీయ విషయాలను ఈ నవల చిత్రికగట్టింది. కచ్చితంగా ఇది రాజకీయ నవలే. అయితే దళితులకు న్యాయమైన ప్రాతినిధ్యం కోసం కొట్లాడిన రాజకీయ నవల. ఆత్మగౌరం కోసం తండ్లాడిన నవల. ఏ జిల్లాలోనైతే సాయుధ పోరాటంలో తుపాకి పట్టుకొని పోరాటం చేసిండో అదే జిల్లాకు ఓ ఎనిమిదేండ్ల తరువాత ఐఎఎస్‌ అధికారిగా సబ్‌కలెక్టరుగా వచ్చిండు. దళిత ఐఎఎస్‌ దగ్గర అగ్రవర్ణాలకు చెందిన ఫ్యూను సైతం పనిచేయడానికి నిరాకరించిన వైనాన్ని అంతటి నరసింహంగారు రాసిండ్రు. ఇట్లా నిజాయితీగా పనిచేసే అధికారులను శశి చిన్నాన్నఎమ్మెల్యే జగన్నాథం లాంటి వారు అడ్డుకోవడం, ఆఖరికి అక్కడి నుంచి కాంతారావుని తబాదలా చేయించడంతో కథా నాయకుడు అంబేడ్కర్‌ మార్గమే సరైనది. కుల వివక్ష పోవాలంటే కులాంతర వివాహాలు జరగాలని అంతకు ముందు నుంచి చెబుతూ వచ్చాడు. అందుకే కాంతారావు ఇట్లా అభిప్రాయపడ్డాడు. ‘‘ఈ దేశంలో అంబేద్కర్‌ వాదమే బాగుందనుకున్నాడు. ప్రతీకారాగ్ని ప్రజ్వరిల్లింది. ప్యూనుపై కసిదీర్చుకోవాలనుకున్నాడు. డిస్మిస్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా అనుకున్నాడు. వాడి వెనుకవున్న కులవ్యవస్థా, కుల పెద్దలు కారణంగాని వాడు గాదనుకున్నాడు. అయినా క్రమశిక్షణ కోసం చర్య తీసుకోకపోతే ఆ అవమానానికి తల ఒగ్గినట్లవుతుందని, ఎందుకు డిస్మిస్‌ చేయరాదో సంజాయిషీ యివ్వవలసిందిగా ప్యూనుకు వ్రాయించి పంపాడు’’ అని ఆనాటి తీరుపై రాసిండు. స్వాతంత్య్రం వచ్చిన పదేండ్ల తర్వాత కూడా సమాజంలో ఆశించిన మార్పు లేక పోవడంతో ‘‘ఈకుల వ్యవస్థ పాత కుబుసాన్ని విడిచి కొత్త రూపాన్ని ధరిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఏ స్వార్థంతో అయితే యిది పుట్టిందో ఆ కారణాన్ని సమూలంగా నిర్మూలించాలి. రాజకీయ వ్యవస్థ ద్వారానే దీన్ని దెబ్బకొట్టాలి. మహిళా కళాశాల స్థాపన జరగ్గానే రాజీనామా యిచ్చి అయినా కులవ్యవస్థను దెబ్బతీయాలి. ఈ వ్యవస్థ వల్ల ఏ కులానికీ ఏ వర్గానికీ మేలు లేదు కాబట్టి యిది వుండరాదు’’ అని అంబేడ్కర్‌ ఐడియాలజీ పట్ల అభిమానాన్ని కథానాయకుడి ఆఖరి మాటల్లో తన అభిప్రాయంగా అంతటి నరసింహం చెప్పిండు.
దళిత సాహిత్యంపై జరిగిన చరిత్ర, పరిశోధన, విమర్శ, పరామర్శల్లో ఈ నవల గురించి ఏ ఒక్కరిద్దరో తప్ప ఎవ్వరూ పేర్కొనలేదు. అదే సమయంలో ఉన్నవ క్ష్మినారాయణ రాసిన ‘మాలపల్లి’ నవలను ఇటు బ్రాహ్మణులు, అటు దళితులూ ఇద్దరూ చాలా చర్చ చేసిండ్రు. అయితే బహుజనుడు ఒక గౌడ కులస్థుడైన అంతటి నరసింహం రాసిన నవలకు అటు దళిత సాహిత్య చరిత్రలోనూ, ఇటు విమర్శలోనూ పెద్దగా చోటు దక్కలేదు. ఇప్పటికైనా ఈ నవలను పునర్ముద్రించి దీనిలోని విషయాలను దళితులు, బహుజనులు అందరూ పట్టించుకోవాల్సిన అవసరమున్నది. అంబేడ్కర్‌ భావజాలం ఇంత విస్తృతి చెందిన తర్వాత కూడా అంతటి నరసింహం ను విస్మరించడం అన్యాయం. అంబెడ్కర్ భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం 1980లోనే రాసిన ఈ నవలను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు.
అంతటి నరసింహం ఆదర్శాలు రాయడమే కాదు స్వయంగా ఆచరించిన వాడు. తాను కులాంతర వివాహం చేసుకోదలిచి అదే విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించాడు. ఆయనకు ఆ కాలంలో మూడు ఆదర్శాలుండేవి. ఒకటి అస్పృశ్యతా నివారణ, రెండోది స్త్రీ విద్య, మూడోది కులాంతర వివాహం. ఆఖరికి అపరాజిత అనే అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడు.
(కం)కాళరాత్రి అనే పద్య కావాన్ని హైదరాబాద్ వాసి భాషా సేవకుడు ఉన్నతాధికారిఅయిన బహుజనుడుమాటేటి రామప్పకు అంకితమిచ్చిండు. దీనికి తిరుమల రామచంద్ర ముందుమాట రాసిండు.
1925 నవంబర్‌ 24వ తేదీన కడప జిల్లా కోడూరు తాలూకాలోని వెంకటరాజు పల్లిలో అంతటి సుబ్బమ్మ, పెంచలయ్య దంపతులకు జన్మించిన అంతటి నరసింహం తెలుగులో ఎం.ఎ చదవడమే గాకుండా ‘ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు’ అనే అంశంపై వెంకటేశ్వర యూనివర్సిటీలో పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా అందుకున్నాడు. 1946 నుంచి 1976 వరకు అనేక కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ సెక్రెటేరియట్‌లో సాంస్కృతిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శిగా 1976లో నియమితులయిండ్రు. 1982 నుంచి వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సహాయ సంస్థ అభివృద్ధి అధికారిగా, అనంతరం ఎ.పి. వాషర్‌మెన్‌ ఫెడరేషన్‌ మొదటి చైర్మన్‌గా వ్యవహరించారు. హైదరాబాద్‌ మెహదిపట్నంలో నివసించిన ఈయన 2010లో చనిపోయారు.
ఈయన (కం)కాళరాత్రి, నవసృష్టి, తాడితవ్యాఘ్రి, ఇప్పుడే, కాలవేదం, ఉషస్వప్నం, ఇరవై ఒకటో శతాబ్దంలోకి, అవతారాలమోసాలు అనే కావ్యాలు, ఆదర్శం, భావం, ప్రేమ భిక్ష, లేడి లెక్చరర్‌, స్వగతం, శంపాలత, చీకట్లో కాంతిరేఖలు, శోభాదేవి, ఆప్‌బీతీ (హిందీ) నవలలు రాసిండు. సహజీవనం, సమరసత్వం, మానవత్వం, పరిష్కారం, ఎక్కడి గొంగడి అక్కడేనా, మహిళా మహస్సు, వేలం వెర్రి, భువన విజయం, ముక్కంటి ముక్కోణం, నిత్య కళ్యాణి, ముల్లును ముల్లుతోనే ఆనే నాటకాలనూ రాసిండు. ఇంకా ఎంతో బాల సాహిత్యాన్ని సృజించాడు.
తెలుగు సాహిత్యానికి ఇంతటి విశిష్టమైన సేవలందించినఅంతటినరసింహం గురించి ఇప్పుడైనా విశ్వవిద్యాలయాల్లో పనిచేసేవారు దళితోద్యమకారులు, రాయలసీమ సాహితీవేత్తలు బహుజనులు పూనుకొని ఏదయినా యూనివర్సిటీలో ఈ పుస్తకాన్నిపాఠ్యాంశంగా పెట్టించినట్లయితే విద్యప్రాధాన్యత వస్తుంది. ఈ స్ఫూర్తితో మరింత మంది ఐఎఎస్ లుఅవకాశముంది. ఈ 312 పేజీల నవల త్వరలోనే పునర్ముద్రణ కావాలని కోరుకుంటూ..
                                                                                                     - సంగిశెట్టి శ్రీనివాస్

Vattikota natikalu