Monday, August 10, 2020
విజ్ఞతతో వ్యవహరిద్దాం వివి విడుదల కోరుదాం
రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండడం దానికదే నేరం కాదు. చట్టానికి లోబడి ఆ విశ్వాసాలను ఆచరించడం, ప్రచారం చేసుకోవడము న్యాయసమ్మతం. ప్రజలు, సంస్థలు, వ్యక్తుల అభిప్రాయాలతో పాలకులు విబేధించవచ్చు. అంత మాత్రానా వారి నోరునొక్కడం, వేధించడం, నిర్బంధించడం తప్పు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రజల వాక్ స్వాతంత్య్రానికి గ్యారంటీని ఇస్తున్నది. అయితే కాంగ్రెస్ మొదలు ఇవ్వాళటి బిజెపి వరకూ అన్ని ప్రభుత్వాలు మీసా, టాడా, యూఎపిఎ పేరిట కరడుగట్టిన నల్ల చట్టాలను తీసుకొచ్చి భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించాయి. ఈ దుర్మార్గం ఇంకా కొనసాగుతుంది. సంస్థలు, వ్యక్తుల హక్కులను హరిస్తూ, ప్రజస్వామిక భావనలను, విలువలను ఛిద్రం చేస్తూ ప్రభుత్వాలు అమానుషంగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలకు తావులేకుండా పోయింది. ఉంటే మాతోటి ఉండాలె. లేదంటే ‘దేశద్రోహి’వే అనే విధంగా అధికార మత్తులో పాలక పార్టీలు తమకు గిట్టని వారిపై ముద్రలు వేస్తున్నాయి.
సమాజం చైతన్యం అవుతున్న కొద్దీ నేర విచారణలోనూ, నిర్ధారణలోనూ మేలైన మార్పు రావాలి. కాని అందుకు విరుద్ధంగా విచారణ లేకుండానే నిందితులను- నేరస్థులుగా పరిగణించడం, వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా నిర్ధారించడం జరుగుతోంది. ఇవ్వాళ రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండడమే నేరంగా మారింది.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర చేసిండ్రంటూ ‘భీమా కోరెగావ్’ (ఎల్గర్ పరిషత్) ‘కుట్ర’ కేసులో దేశ వ్యాప్తంగా పదిమంది బుద్ధిజీవులను అరెస్టు చేసిండ్రు. వారిపై సవరణలు చేసి, మరింతగా పదును పెట్టిన అమానుష ‘యూఎపిఎ’ (అన్ లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్) చట్టాన్ని ప్రయోగించి బెయిల్‌కు వీలు లేకుండా కేసులు నమోదు చేసిండ్రు. ఇలాంటి కేసులే విప్లవ కవి, తెలంగాణ వాది వరవరరావు మీద కూడా పెట్టిండ్రు. అట్లాగే మరో కేసులో అంతర్జాతీయ న్యాయసూత్రాలకు పూర్తి విరుద్ధంగా 90శాతం వికలాంగుడైన సాయిబాబను ‘అండాసెల్’లో పెట్టిండ్రు.
న్యాయంకోసం- చట్టపరిధిలో కొట్లాడేందుకు ప్రభుత్వాలు ‘యూఎపిఎ’ పేరిట పెట్టిన కేసులు అడ్డొస్తున్నాయి. న్యాయదేవత కళ్ళకు గంతలు బదులు ఏకంగా ముసుగేసిండ్రు. ఇట్లాంటి కేసుల్లో సాధారణంగా విచారణాధికారం రాష్ట్రాలకు ఉంటుంది. అయితే అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారాలను సైతం హరించింది. మహారాష్ట్ర పరిధిలోని కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ తమ ఆధీనంలోకి తీసుకున్నది. కేంద్రం కక్ష సాధింపుకు, హై హాండెడ్నెస్ ధోరణికి ఇది మచ్ఛు తునక. ఈ పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా హక్కుల కార్యకర్తలు కరోనా సమయంలో సైతం ఈ బుద్ధిజీవుల విడుదలను డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. సభలు సమావేశాలను నిర్వహిస్తున్నారు. చట్టం పేరిట తమ పాలకులు తమ ఇంటరెస్టులను అమల్లో బెడుతున్నారు. కాసేపు చట్టం ఏమి చెబుతుందనేది కొంచెంసేపు పక్కనబెడితే.. ముందుగా మనం మనుషులం. మనుషులుగా... మానవత్వమున్న మనుషులుగా ఆలోచిద్దాం.
ఇండియన్ పీనల్ కోడ్ మే 1, 1861 నుంచి అమల్లోకి వచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) సెక్షన్ 82 ప్రకారం ఏడేండ్ల లోపు బాలుడు ఏమి చేసిన నేరం కాదు. 2012 -నిర్భయ కేసు తర్వాతనే 16-18 ఏండ్లలోపు పిల్లలను తీవ్రాతి తీవ్రమైన కేసుల్లో మాత్రమే శిక్షార్హులుగా నిర్ణయించాలని తీర్పునిచ్చారు. నిజానికి 18 ఏండ్లలోపు పిల్లలు నేరాలు చేసినట్లయితే దానికి సమాజమే బాధ్యత వహించాలి. బాల నేరస్థులను ‘కరెక్షన్’ సెంటర్లో ఉంచి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని రాజ్యాంగం చెప్పింది. ఇందులో వయసు రీత్యా, నేర స్వభావం రీత్యా కొంత శిక్షల్లో తేడా ఉన్నది.
బాలలకు వర్తిస్తున్న చట్టాలే ‘వయోవృద్ధు’లకు కూడా అమలు చేయాలి. ఇందుకు ప్రభుత్వాలు మానవీయ దృష్టికోణాన్ని అలవరచుకోవాలి. ‘భీమా కోరెగావ్’ కేసులో అందరు నిందితులు ‘వయోవృద్ధులు.’ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ‘సీనియర్ సిటి జన్ చట్టం-2007’కు సవరణలు తీసుకొచ్చింది. దీని ప్రకారం పెద్దలను వేధిస్తే ఆరు నెలలు జైలు, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ సవరణలు తీసుకొచ్చింది. ఈ సవరణలను ప్రస్తుత బిజెపి ప్రభుత్వం తరపున సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థాపర్చంద్ గహలోత్ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిండు. వేధింపులంటే శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపూరితంగా, ఆర్థికంగా, దూషణ ద్వారా హింసించింనా వేధింపులే అని చట్టం చెబుతుంది. అట్లాగే సంరక్షణలో నిర్లక్ష్యం వహించినా వేధింపుగానే గుర్తించింది. కన్నపిల్లలు, దత్తత సంతానం, సవతి పిల్లలు, మనమలు, మనవరాండ్రు, అల్లుళ్ళు ఈ సంరక్షణ బాధ్యత తీసుకోవాలని చెబుతుంది. అంతేగాకుండా ఇట్లాంటి కేసుల్లో ప్రత్యేక ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేసి సత్వర న్యాయాన్ని చేకూర్చాలని కూడా చెప్పింది. 80 ఏళ్ళకు పైబడిన వారు దాఖలు చేసే పిటిషన్లను రోజుల్లోనే పరిష్కరించాలని కూడా ఈ చట్టం చెబుతుంది. అయితే బిజెపి ప్రభుత్వం తాను చేసిన చట్టాలను తానే అతిక్రమిస్తోంది. కనీసం తాము చెప్పే ‘పెద్దలను గౌరవించడం’ అనే సంప్రదాయానికి కూడా కట్టుబడి లేదు. పెద్దలు, వృద్ధులు, వికలాంగుల పట్ల ఎలాంటి ప్రత్యేకమైన శ్రద్ధ లేకుండానే కరడుగట్టిన నేరస్థులతో వ్యవహరించినట్లుగానే వారితోనూ వ్యవహరిస్తోంది.
వరవర రావు ఎనిమిది పదులు దాటిన వయసులో ఎక్కడికి పారిపోతాడని నిర్బంధంలో ఉంచి విచారిస్తున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో ‘కరోనా’ వైరస్ రాపిడ్గా స్ప్రెడ్ అవుతున్నది. ఈ పాండమిక్ పరిస్థితుల్లో జైలులో నిందితులకు, మరీ ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉండే ‘వయోవృద్ధుల’కు వైరస్ వేగంగా సోకే ప్రమాదమున్నది. అల్రెడీ వరవరరావుకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. హక్కుల సంఘాల ప్రతినిధులు కోర్టుని ఆశ్రయిస్తే గాని మెరుగైన వైద్య సహాయం అందని స్థితి. వరవరరావు బాడీలో ఉండాల్సిన సోడియం, పోటాషియం లెవెల్స్ గణనీయంగా పడిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు హక్కుల సంఘాల వాండ్లు, ప్రజాస్వామిక వాదులు ఆందోళనలో ఉన్నారు. అట్లాగే 90శాతం వైకల్యంతో తన పనులు తాను చేసుకోవడమే కష్టంగా గడుపుతున్న సాయిబాబపై ‘దేశద్రోహం’ లాంటి తీవ్రమైన నేరాలు మోపిండ్రు. వికలాంగుల పట్ల కనీస గౌరవం, మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నారు.
గత ఐదు దశాబ్దాలుగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న ఉద్యమకారుడు, విప్లవ రచయిత సంఘం స్థాపకుల్లో ఒకరైన వరవరరావు రాజకీయ కార్యాచరణతో అందరికీ ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు అభిప్రాయం కలిగి ఉండడమే నేరం అనే విధంగా అరెస్టులకు తెరలేపింది. ఈ పరిస్థితుల్లో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం మెరుగైన, మేధోవంతమైన సమాజానికి సూచికగా గుర్తించాలి. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విఘాతం కలిగిస్తూ అమానవీయమైన చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. చట్టాలు అమానవీయంగా ఉన్నప్పుడు మాట్లాడాల్సింది ప్రజా ప్రతినిధులు. అయితే ఈ ప్రజా ప్రతినిధులు ప్రజలకు పూచిదారులుగా కాకుండా, కాళోజి అన్నట్టు ‘పార్టీవ్రత్యం’తో పార్టీలకు బద్ధులు కావడంతో సమస్యలు మరింత జఠిలంగా తయారయ్యాయి. ఎక్కడ సమస్యుందో పరిష్కారం కోసం కూడా అక్కడే వెతకాల్సిన అవసరమున్నది. అందులో భాగంగానే చట్ట పరిధిలోనే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. ప్రజాస్వామిక వాదులందరూ ప్రభుత్వంపై వత్తిడి పెంచి నల్ల చట్టాలు చెల్లబోవని తేల్చి చెప్పాలి.
ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని, దేశ చట్టాలను గౌరవిస్తామని ప్రమాణం చేసి పదవులు చేపట్టిన వ్యక్తులు ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు రోజుకు 50వేలు దాటి విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో జైళ్లల్లో ఖైదీలకు ముఖ్యంగా ‘వయోవృద్ధులై’న ఖైదీలకు రక్షణ లేదు కాబట్టి వారిని వెంటనే విడుదల చేయాలి. ఆరు పదులు దాటిన వారందరినీ ప్రభుత్వం ‘రిటైర్’ చేసి వృద్ధులుగా గుర్తిస్తుంది. అంతర్జాతీయ కోర్టు ప్రమాణాలను లెక్కలోకి తీసుకున్నా 65 ఏండ్లు నిండిన వారిని ‘వయోవృద్ధులు’గా గురించాలి. అంతర్జాతీయ మానవ హక్కుల చార్టర్- వృద్ధుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెబుతుంది. అందువల్ల ఈ విషయంలోనూ అరవైఐదేండ్లు దాటిన వారిని, విచారణలో ఉన్న నిందితులను వెంటనే విడుద చేయాలి. ‘కరోనా’ సమయంలో ఇది ప్రభుత్వాల బాధ్యత కూడా!
నిజానికి ‘జువెనైల్’ చట్టం లాగానే ‘సీనియర్ సిటిజెన్’ చట్టంలో మెరుగైన మార్పులు తీసుకొచ్చి నేర తీవ్రత/శిక్షార్హతను బట్టి వారికి మినహాయింపును ఇవ్వాలి. బెయిలు సదుపాయం కల్పించాలి. ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు అంతర్జాతీయ న్యాయసూత్రాలను, మానవ హక్కుల కమిటీ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలి. వాటిని ఆదర్శంగా పాటించాలి.
వచ్చే పంద్రాగస్టు (2020) నాటికి తెలంగాణలోని జీవిత ఖైదీలను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది ఆహ్వానించదగ్గ నిర్ణయం. అట్లాగే తెలంగాణ ముద్దుబిడ్డ వరవరరావు విడుదలకు కూడా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాల్సిన బాధ్యత ఉన్నది. 2005లో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కేంద్రమంత్రి హోదాలో చంచల్గూడా జైలులో ఖైదీగా ఉన్న (నిషేధిత విరసం సంస్థ బాధ్యుడుగా) వరవరరావుని నిబంధనలను అధిగమిస్తూ కలిసిండు. ఆయన విడుదలను డిమాండ్ చేసిండు. ప్రజల హక్కుల కోసం పోరాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు గౌరవం, మర్యాద, గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తి వరవరరావు. అంతే కాదు నిఖార్సైన తెలంగాణ వాది. తెలంగాణ ప్రేమికుడు. 1968 నుంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఆనాడు తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరపున జయశంకర్ సార్‌తో కలిసి ఉద్యమాలు చేసిండు. రచయితగా తన కర్తవ్యాన్ని నిర్వర్వించిండు. అట్లాంటి వ్యక్తిని ‘యూఎపిఎ’ చట్టం కింద అరెస్టు చేసి బెయిలు నిరాకరించడం అమానుషం. వరవరరావు అరెస్టు తెలంగాణ గౌరవం, ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి ఆయన విడుదలకు చట్ట పరిధిలో ఉన్న అవకాశాలన్నింటిని తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోవాలి. తమకు కేంద్ర నాయకులతో ఉన్న సత్సంబంధాలను వివి విడుదల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వినియోగిస్తే తప్పేమి లేదు. ఎందుకంటే 2018-19 ఎన్నికల సమయములో ఈ విషయాలను కేసీఆర్ సభల్లో మాట్లాడిండు కూడా. వివి విడుదలను డిమాండ్ చేయడం వల్ల కేసీఆర్ గౌరవం ఇనుమడిస్తది కూడా. కాళన్న, జయశంకర్ సారు బతికుంటే ఇదే కోరుకునేవారు. జయశంకర్ సారు సిద్ధాంతాలతో నడుస్తున్న టీఆర్ఎస్ పార్టీ కూడా వివి విడుదలకు కృషి చేయాలి.
వరవరరావు రాజకీయ విశ్వాసాలతో విభేధాలున్నప్పటికీ చట్టపరిధిలో తెలంగాణ ప్రభుత్వం ఆయన విడుదలకు ఏ విధంగా తోడ్పడగలదో ఆలోచించాలి. మాట సాయం, న్యాయ సాయం, నైతిక మద్ధతు ఇట్లా అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం మద్ధతు తెలిపేందుకు అవకాశమున్నది. నల్ల చట్టాలను సమర్ధిస్తూ పోయినట్లయితే ఎపుడో అపుడు ఎంతటి వారైనా దాని కోరల్లో చిక్కుకు పోయే ప్రమాదమున్నదనే సోయితో ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు మెలగాలి.
వీటన్నింటి కన్నా ముందుగా జాతీయ మానవహక్కుల సంఘం జోక్యంతో ముంబయి సెయింట్ జార్జ్ హాస్పిటల్లో కోవిడ్-19కు చికిత్స పొందుతున్న వరవరరావుకి మెరుగైన వైద్య సహాయం అందేలా మహారాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్రం తరపున అధికారికంగా వత్తిడి తీసుకురావాలి. ఆయన ప్రాణాలు కాపాడడం తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా గుర్తించి అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.
Tributes to Samala Sadashiva
Tributes to Samala Sadashiva
It is hard to digest that the multi-talented son of the soil Samala Sadashiva has not got his due recognition even in our own state Telangana. He is the last Telangana person to receive(till now) Kendra sahitya academy award in Telugu. He got this award in 2011 for his book titled ‘swaralayalu’.Poet, story writer, essayist, novelist and learned musicologist who hailed from Adilabad strived hard to serve the language, literature and culture of Telangana. Apart from this he is a wonderful painter. On the advice of luminary Suravaram Prathapa Reddy he took to poetry and excelled in it. Over six decades he constantly wrote in different genres. He dedicated his life to study and expose the Telangana talent. He was gulf between the younger and old generation of literary saga. Sadashiva was a hard core Telangaanite. When the Telangana writers meet was held at Adilabad on the initiation of Sridhar Deshpande and other friends as a father figure he inaugurated it and spoke at length. I was one of the many curious participants of the meet.After the formation of Telangana state, school textbooks changed. In the changed scenario Sadashiva’s writings included it. It is a welcome step. But the government of Telangana should recognize his yeoman service and name any one of the music college after Sadashiva, and his birth anniversary may be celebrated as native music day.Friends are celebrating this august month as “social justice month” hence I request the friends to pay floral tributes to this Padmashali pioneer on his Vardhanthi..
సామాజిక సంతకం మండల్
సామాజిక సంతకం మండల్
దళిత చైతన్యం, భావజాల వ్యాప్తి, ఉద్యమ కార్యాచరణ మూలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ప్రపంచమంతటా తెలిసింది. అంబేద్కర్ గురువు, బహుజనోద్యమాలకు మూల పురుషుడు జ్యోతిబా ఫూలే జీవిత విశేషాలు ఇప్పుడిప్పుడు దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ వరుసలో వారి సరసన నిలబడాల్సిన మరోవ్యక్తి ఉన్నారు. ఆయన గురించి అందరికీ తెలియదు. దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న ఓబీసీలకు మేలు చేసిన మహనీయుడీయన. ఆయనే బిందేశ్వరి ప్రసాద్ మండల్ (బి.పి. మండల్). కేంద్రంలో విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈయన నేతృత్వంలోని మండల్ కమిషన్ ప్రతిపాదించింది. దాన్ని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం దశాబ్దం తర్వాత అమల్లోకి తెచ్చింది.బహుజన సమాజానికి ఈయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. బీహార్ రాష్ర్టానికి తొలి బీసీ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కేవలం 48 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నా వత్తిళ్లకు లొంగకుండా తన పదవినే త్యాగం చేసిండు. జిల్లా మెజిస్ర్టేట్‌గా, దేశ స్వాతంత్య్రం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీహార్ అసెంబ్లీకి, ఆ తర్వాత ఎంపీగా ఎన్నుకోబడ్డారు. శోషిత్ దళ్ పేరిట పీడిత ప్రజల పార్టీని ఏర్పాటు చేసిండు. జయప్రకాశ్ నారాయణ పిలుపు మేరకు పదవుల్ని త్యాగం చేసిండు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల పక్షాన నిలబడ్డందుకు ఇబ్బందులెదుర్కొన్నడు. గుర్తింపునకు నోచుకోకుండా పోయిన ఈయన నిజంగా ఈ దేశ బహుజనుల ఆరాధ్యుడు. ఇంతటి జాతీయ నాయకుడి గురించి అందరికీ తెలియదు. ఆ కొరత తీర్చే ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం.
బి.పి. మండల్ యాదవ కులంలో 1918, ఆగస్టు 25న బీహార్‌లోని మాధేపూర్ జిల్లాలోని మర్హో గ్రామంలో జన్మించిండు. బాల్యమంతా అక్కడే గడిచింది. ఈయన తండ్రి రాస్ బిహారీలాల్ మండల్ అక్కడ చిన్నపాటి జమిందార్. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నట్లయితే తన జమిందారీ రద్దవుతుందని తెలిసి కూడా ఉద్యమంలో పాల్గొన్నడు. జంద్యాలు కేవలం బ్రాహ్మణులే ఎందుకు వేసుకోవాలె, మేము వేసుకుంటామనే ఉద్యమాన్ని లేవనెత్తిండు. బహుజనులకు మెరుగైన విద్యావకాశాలు, అభివృద్ధికి తోడ్పడే సకల చర్యలు చేపట్టాలంటూ ‘మార్లో-మింటో’ కమిటీకి విజ్ఞాపనలు అందజేసిండు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల వల్ల జైలు శిక్ష కూడా అనుభవించిండు. మిత్రులతో కలిసి అఖిలభారత యాదవ (గోపీ) మహాసభను స్థాపించిండు. మండల్ కుటుంబం మొత్తం 1920లకు ముందు నుంచే ప్రజోద్యమాల్లో ఉండింది. బి.పి. మండల్ పెద్దన్న భువనేశ్వరి ప్రసాద్ మండల్ 1920లోనే బీహార్-ఒరిస్సా శాసనమండలికి జరిగిన తొలి ఎన్నికల్లో సభ్యుడిగా ఎన్నికయిండు. ఈయన కొడుకు జస్టిస్ రాజేశ్వర్ ప్రసాద్ మండల్ పాట్నా హైకోర్టులో తొలి బీసీ జడ్జి. బి.పి. మండల్ రెండో అన్న కమలేశ్వరి ప్రసాద్ స్వాతంత్ర్యోద్యమంలో జయప్రకాశ్ నారాయణతో పాటు పాల్గొని 1937లో జైలుకు వెళ్లిండు. ఈయన కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిండు. ఈ రాజకీయ పరంపరను కొనసాగించడమేగాకుండా ఓబీసీలందరూ సదా స్మరించుకొని, నివాళి అర్పించే విధంగా బిందేశ్వరి ప్రసాద్ మండల్ పనిచేసిండు. ఓబీసీలకు దేశంలో మొట్టమొదటిసారిగా విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే మండల్ నివేదికను తయారు చేసిండు. నిజాయితీగా ఉంటూ నిప్పులా బతికిండు. పదవుల్ని తృణప్రాయంగా భావించిండు. చివరికి నమ్మిన సిద్ధాంతం కోసం ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకుండు.
దర్భంగాలో రాజ్ పాఠశాలలో చదువుతున్న కాలంలోనే జమిందారు కొడుకయినప్పటికీ బి.పి. మండల్ కుల వివక్షను ఎదుర్కొన్నడు. అగ్రవర్ణాల వారితో గాకుండా ఉపాధ్యాయులు ఇతన్ని వేరుగా కూర్చొండబెట్టిండ్రు. తినేప్పుడు కూడా కలువనియ్యక పోయేది. ఆ తర్వాత పాట్నాలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించి, కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఇంగ్లీషులో బి.ఎ. ఆనర్స్ పాసయిండు. చిన్నతనంలో తాను అనుభవించిన వివక్ష జీవితాంతం అతన్ని వెన్నాడింది. హమేషా పీడితుల పక్షాన నిలబడేలా చేసింది.
1945-51 మధ్యకాలంలో గౌరవ మెజిస్ర్టేటుగా ఉన్నడు. ఫ్రీ ఇండియాలో జరిగిన తొలి సార్వత్రక ఎన్నికల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నకయిండు. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కృష్ణ సిన్హా మంత్రి పదవిని ఆఫర్ చేసినా కేబినెట్ హోదా పదవి కావాలని పట్టుపట్టడంతో అది దక్కలేదు. అనంతరం 1965 ఆ ప్రాంతంలో తన నియోజకవర్గంలోని దళితులు, ముస్లింలపై పోలీసుల దాడిని ఖండించిండు. వారికి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ఆ విషయాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిండు. అంతకు ముందు ముఖ్యమంత్రి కె.బి. సహాయ్ పార్టీ ఆదేశాల పేరిట, ఈ అంశాలను అసెంబ్లీలో మట్లాడొద్దని హెచ్చరించినా వినకుండా ప్రజల పక్షంగా నిలబడే నాయకుడు కావడంతో వాటిని ఉల్లంఘించిండు. ఆ తర్వాత ఆత్మను చంపుకొని కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక సంయుక్త సోషలిస్టు పార్టీలో చేరిండు. చేరడమే గాకుండా రాష్ట్రమంతటా పర్యటించి 1967 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 69 సీట్లు సాధించి పెట్టిండు. అంతకు ముందు సభలో ఆ పార్టీ బలం కేవలం ఏడు సీట్లు మాత్రమే. ఇలా బీహార్‌లో తొలి కాంగ్రెసేతర పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో తొలి సారిగా మండల్ ఆరోగ్యశాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక్కడ కూడా ఇమడ లేక శోషిత్ దళ్ పేరిట పీడిత ప్రజల పార్టీని ఏర్పాటు చేసిండు.
తర్వాతి కాలంలో 1968 ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి 22 వరకు మండల్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. మొత్తం 48 రోజులు మాత్రమే ఈయన అధికారంలో ఉన్నడు. ఈయనే తొలి బీహార్ ఓబీసీ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సక్రమంగా పాలన చేయకుండా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డంకులు కల్పించింది. అంతకుముందు మంత్రులు చేసిన అవినీతిపై వేసిన కమిటీ రిపోర్టుని బహిర్గతం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఇందిరాగాంధీ మండల్‌కు చెప్పినప్పటికీ ఆమె మాటను పెడచెవిన పెట్టిండు. దీంతో అప్పటి వరకు మండల్‌కు ఇస్తున్న మద్దతును కాంగ్రెస్ పార్టీ ఉపసంహరించుకుంది. ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఈ సమయంలో గవర్నర్ పాత్రపై పెద్దఎత్తున దుమారం రేగింది. అదంతా చరిత్రలో భాగమయింది.
మండల్ మరోసారి 1970లో అసెంబ్లీకి ఎన్నకయిండు. అయితే జయప్రకాశ్ నారాయణ పిలుపు మేరకు పదవికి రాజీనామా చేసిండు. ఎమర్జెన్సీ సమయంలో మొత్తం జయప్రకాశ్ నారాయణ వెంటే ఉన్నాడు. 1977లో పార్లమెంటుకు ఎన్నికయిండు. ఈ దశలోనే అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ బి.పి.మండల్ నేతృత్వంలో ఓబీసీల అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన చర్యలు సూచించే విధంగా కమిటీని ఏర్పాటు చేసిండు. ఇది జనతాపార్టీ మేనిఫెస్టోలో ప్రధానాంశం. ఈ కమిటీలో హైదరాబాదీ అయినప్పటికీ తర్వాతి కాలంలో బొంబాయిలో ఉంటూ అక్కడి నుంచి పార్లమెంటుకు ఎన్నికైన దళిత జడ్జి రాజారాంభోలే కూడా సభ్యుడిగా ఉన్నారు. మండల్ కమిషన్ ఏర్పాటుకు 1978లో నిర్ణయం జరిగినా రాష్ట్రపతి ఉత్తర్వులు జనవరి ఒకటి 1979న వెలువడ్డాయి. ఆనాటి నుంచి ఏడాదిలోగా నివేదిక సమర్పించాల్సిందిగా అందులో పేర్కొన్నారు. అయితే సమయం సరిపోక పోవడంతో ఈ కమిటీ కాల పరిమితిని మరో ఏడాది పొడిగించిండ్రు. చివరికి మండల్ కమిటీ నివేదికను అప్పటి హోంమంత్రి జ్ఞాని జైల్‌సింగ్‌కు డిసెంబర్ 31, 1980 నాడు మండల్ సమర్పించిండు. దేశం నలుమూలలా విస్తృతంగా పర్యటించడమే గాకుండా, విశ్వవిద్యాలయాలు, ప్రొఫెసర్లు, విషయనిపుణులను సంప్రదించి అత్యంత సమగ్రమైన నివేదికను తయారు చేసిండు. ఈ నివేదిక సమర్పించిన 15 నెలలకే 1982 ఏప్రిల్ 13న మండల్ కన్నుమూసిండు.
మండల్ కమిషన్ చేసిన 40 సూచనల్లో ఒకటైన విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు 1990 ఆగస్టు 7న అమలు చేస్తూ అప్పటి ప్రధాని విశ్వనాథ్ ప్రతా్‌పసింగ్ ఉత్తర్వులు జారీ చేసిండు. దీనికి వ్యతిరేకంగా అనేకమంది అలజడులు సృష్టించిండ్రు. బీజేపీ చివరికి ఆయన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని రథయాత్రను చేపట్టింది. అందుకే ఆనాటి ఎన్నికలు మండల్ వర్సెస్ కమండల్‌గా జరిగాయి.
మండల్ కమిషన్ చేసిన సూచనలు అమలు చేయాలని వి.పి.సింగ్ ప్రకటించిన ఉత్తర్వులకు ఈ ఏడాది ఆగస్టులో 25 ఏండ్లు నిండినయి.
మండల్ సిఫారసులు అమలు చేయాలనే నిర్ణయం 1990లో జరిగినా అనేక కోర్టు అడ్డంకులెదుర్కొని 1993 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, 2008 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో 27 శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు అమలవుతున్నాయి. ఈ రిజర్వేషన్లు పొందడానికి క్రీమీలేయర్‌తో పాటు సవాలక్ష ఆంక్షలు ఉండడంతో ఇప్పటికీ ఓబీసీలకు సరైన న్యాయం జరగడం లేదు. 22 ఏండ్ల నుంచి రిజర్వేషన్లు అమలవుతున్నా ఇంకా కేంద్రంలో 10 శాతం కూడా ఓబీసీ ఉద్యోగస్తులు లేరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీన్ని అధిగమించడానికి మండల్ కమిషన్ చేసిన సిఫార్సులన్నింటినీ పూర్తిగా అమలు జరపాలి. అలాగే చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే గాకుండా, బీసీ జనగణన కూడా కేంద్రం ప్రకటించాలి. ఈ జనాభా లెక్కలు బయటికి వచ్చినప్పుడే ఓబీసీలకు జరుగుతున్న అన్యాయం సరిగ్గా అంచనా వేయడానికి వీలు కాదు. వీటన్నింటి సాధన కోసం కలిసి వచ్చే వారందరినీ భాగస్వాములుగా చేస్తూ ఉద్యమించాల్సిన అవసరముంది. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే మండల్‌కు నిజమైన నివాళి. అంబేద్కర్, ఫూలేని గుర్తు చేసుకుంటున్నట్లుగానే మండల్ని కూడా గుర్తు పెట్టుకొని, ఆయన ఆశించిన ‘బహుజన రాజ్యాధికారం’ కోసం అందరూ కొట్లాడాలె!
(నేడు బి.పి. మండల్ జయంతి)
Wednesday, July 1, 2020
శాహు మహారాజు - మద్యపాన వ్యతిరేకత
దేశంలో మొట్టమొదటిసారిగా అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి బ్రాహ్మణాధిపత్యాన్ని నిలువరించిన ధీరుడు ఛత్రపతి శాహు మహారాజు. ఇవ్వాళ ఆయన 146వ జయంతి. కొల్లాపూర్ (మహారాష్ట్ర) సంస్థానాధీశుడైన ఈయన తన సంస్థానంలో మొదటి సారిగా బహుజనులకు, దళితులకు హాస్టల్ సదుపాయం, విద్యావకాశాలు కల్పించిండు. బాలగంగాధర్ తిలక్ లాంటి హిందూత్వ వాదుల బెదిరింపులకు ఏ మాత్రం భయపడకుండా తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిండు. ప్రచారం చేసిండు. అంబేడ్కర్‌తో కలిసి అనేక దళిత సభల్లో పాల్గొన్నాడు. 1920 జనవరి 31న మూక్‌నాయక్ (గొంతులేని వారి గొంతుక) పత్రికను అంబేడ్కర్ బొంబాయిలో స్థాపించిండు. దీనికి ఆర్థికంగా అండగా నిబడింది శాహు మహారాజు.
ఈయన నుంచి దేశ ప్రజలు ముఖ్యంగా బహుజనులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది. శాహుమహారాజు తండ్రి అబ్బాసాహెబ్ ఘట్గే. ఈయన కొడుక్కు అధికారం దక్కిన తర్వాత బ్రిటీష్ వారితో రాయబార సంబంధాలు నెరపడానికి లండన్‌కు వెళ్ళిండు. అక్కడ విందుల్లో మద్యం సేవించడం అవాటయింది. ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత కూడా అతిగా తాగడం మూలంగా మార్చి 20, 1886 నాడు మరణించిండు.
తండ్రి తాగుడుకు బానిసై కేవలం 30 ఏండ్ల వయసులోనే చనిపోవడంతో శాహు జీవితాంతం మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిండు. ఒక సారి శాహు గురువు కె.బి.గోఖలే ఒక ప్రస్తావన తీసుకొస్తూ ‘‘గౌరవనీయులైన, మర్యాదస్తులైన మీ నాన్న గారి మిత్రులను మీరు ఆదరించాలి.’’ అని అన్నాడు. దానికి శాహు సమాధాన మిస్తూ ‘‘తెలుసు. ఈ మర్యాదస్తులు మా నాన్నకు ఎలాంటి సాహచర్యం మిచ్చిండ్రో బాగా తెలుసు. వీరి మూలంగానే కదా ఆయన ఆరోగ్యం కరాబయింది. వీళ్ళే కదా ఆయన్ని వ్యసన పరుణ్ణి చేసింది. అవసరం లేదు. వీళ్ళనెవరినీ నేను గౌరవించాల్సిన, ఆదరించాల్సిన అవసరం లేదు’’ అని తేల్చి చెప్పిండు. ఈ విషయాన్ని ‘శాహు చక్రవర్తి - ఎ రాయల్ రెవల్యూషనరీ’ గ్రంథంలో ధనంజయ కీర్ రాసిండు. ఈ పుస్తకాన్ని బొంబాయిలో పాపులర్ ప్రకాశన్ వారు 1975లో అచ్చేసిండ్రు.
శాహు మహారాజు స్ఫూర్తిని దళిత, బహుజనులు ఆవాహన చేసుకోవాల్సిన సందర్భమిది. కనీసం మద్యపానం విషయంలోనైనా శాహుని స్ఫూర్తిగా తీసుకొని దానికి వ్యతిరేకంగా ప్రచారం చేద్దాం.. -సంగిశెట్టి శ్రీనివాస్
విస్మృత నవలాకారిణి కృపాబాయి
తీగ లాగితె డొంక కదులుతుందంటరు. బాయిల పాతాళగరిగె ఏస్తె ఎప్పుడో మరిచిపోయినయి దొరుకుతయి. కొత్తగా బయటపడుతయి. అట్లనే సాహిత్యంలో ఒక లింక్‌ని వెదుకుతూ ఉంటే అనేక మూలాలు దొరుకుతూ ఉంటాయి. ఈ లింక్‌తో అన్ని సార్లు కాకపోయినా కొన్ని సార్లయినా కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. అట్లా తెలియ వచ్చిన మహిళే కృపాబాయి సత్యనాథన్. ఈమె ఇంగ్లీషులో ఆత్మకథాత్మక నవల ‘సగుణ- ఎ స్టోరీ ఆఫ్ నేటివ్ క్రిస్టియన్’ పేరిట రాసింది. ఇట్లా ఇంగ్లీషులో ఆత్మకథను నవలగా రాసిన మొట్టమొదటి భారతీయ మహిళ. దేశంలో ఇంగ్లీషులో నవలలు రాసిన రెండో మహిళ. 1874లో జనవరి నుంచి ఎప్రిల్ వరకు (నాలుగు సంచికలు) ‘బెంగాల్ మ్యాగజైన్’లో తోరుదత్ ‘బియాంక’ పేరిట ఒక నవలను సీరియల్‌గా ప్రచురించింది. అది అసంపూర్ణ నవల. (మార్కండ్ ఆర్. పరాంజ్‌పె 2013; 113) అయినప్పటికీ అదే ఇండియాలో మహిళ రాసిన మొదటి ఇంగ్లీషు నవలగా సాహిత్య చరిత్రలో రికార్డయింది. ఇక్కడ మనం చర్చించుకుంటున్న కృపాబాయి సత్యనాథన్ 1888 నాటికే నవల రాయడమే గాకుండా ముస్లిం బాలికల కోసం పాఠశాల స్థాపించింది. మిషనరీ పాఠశాలను ఏర్పాటు చేసింది. అందులో బోధించింది. బాలికల విద్యాభివృద్ధికి కృషి చేసింది. వైద్య విద్యను అభ్యసించింది. భర్తతో పాటు మదరాసు, రాజమండ్రి, కుంభకోణం, నీలగిరి తదితర ప్రదేశాలు తిరిగింది. అక్కడ నివాసమున్నది. ఈమె గురించి మొదటి సారిగా భండారు అచ్చమాంబ రాసిన అబలా సచ్చరిత్ర రత్నమాలలో చదివిన. ఆ తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు అచ్చేసిన ‘ఆంధ్ర వాఙ్మయ సూచిక’లో రెండు తెలుగు నవలలు ఈమె రచనలుగా నమోదయ్యాయి. అప్పటి నుంచి ఈమె ఎవరూ అని వెతుకుతూ ఉంటే అనేక కొత్త విషయాలు అందుబాటులోకి వచ్చాయి. అవి మీ ముందుంచుతున్నాను.
ఇండియాలో మహిళల రచనలను పరిచయం చేస్తూ వచ్చిన సాధికారికమైన పరిశోధక గ్రంథం (రెండు భాగాలు) ‘విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా’. (తెలుగులో దారులేసిన అక్షరాలు) దీనికి సుప్రసిద్ధ విమర్శకులు, ఫెమినిస్ట్ ఉద్యమకారులు సూజితారు, కె.లితలు సంపాదకత్వం వహించారు. ఇందులో కృపాబాయి గురించి రెండు పేజీల్లో సమాచారమిచ్చిండ్రు. ఈ పుస్తకం 1993లో అచ్చయింది. అయితే 1902 నాటికే కృపాబాయి నవల ‘సగుణ’ తెలుగు లోకి అనువాదమయిందని భండారు అచ్చమాంబ రాతల వల్ల తెలుస్తుంది. బహుశా ఇంగ్లీషు నుంచి తెలుగు లోకి అనువాదమయిన మొదటి మహిళా రచయిత్రి కృపాబాయియే కావొచ్చు. ఈమె మరో నవల ‘కమల’ 1909లో తెలుగులోకి అనువాదమయింది.
‘సగుణ’ నవలను 1998లో లోకుగె చందాని అనే ఆస్ట్రేలియాలో నివసించే శ్రీలంక వనిత తన సంపాదకత్వంలో వెలువరించింది. దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ప్రచురించారు. ఇట్లా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా తెలుగు సాహిత్య చరిత్రకు కొత్తగా జోడించుకోవాల్సిన, మరచిన రచయిత్రి కృపాబాయి సత్యనాథన్.
బొంబాయి ప్రెసిడెన్సీలో క్రైస్తవ మతంలోకి మారిన మొట్టమొదటి బ్రాహ్మణ వ్యక్తి హరిపంత్ ఖిస్తి, ఆయన భార్య రాధాబాయి. ఈ దంపతులకు 14మంది సంతానం. ఇందులో 13వ సంతానం కృపాబాయి. ఈమె 1862 ఫిబ్రవరి 14 నాడు ఇప్పటి మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో జన్మించింది. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి రాధాబాయి అన్నీ తానే అయి పిల్లల్ని పెంచి పెద్ద జేసింది. ఇంటికి పెద్దవాడయిన భాస్కర్ కుటుంబాన్ని కొంత వరకు పోషించిండు. ఇతడు కూడా చిన్న వయసులోనే (1875లో) చనిపోయిండు.
1847 ఆ ప్రాంతంలో సావిత్రిబాయి కొన్ని రోజులు విద్యాభ్యాసం చేసిన అహ్మద్‌నగర్‌లోని మిషనరీ పాఠశాలలోనే ఈమె కూడా మొదట్లో చదువుకున్నది(?). బహుశా తర్వాతి కాలంలో కృపాబాయి పాఠశాలల స్థాపనకు సావిత్రిబాయి పూలె స్ఫూర్తి ఎంతవరకున్నదో భవిష్యత్ పరిశోధనల్లో తేలాల్సి ఉన్నది. ఈమె జీవిత చరిత్రకు సంబందించిన కొంత సమాచారం ‘కమల - ఎ స్టోరీ ఆఫ్ హిందూ లైఫ్’ పుస్తకానికి హెచ్.బి.గ్రిగ్ అనే మహిళ రాసిన ముందుమాట ద్వారా తెలుస్తోంది. ఈ నవల కృపాబాయి చనిపోయిన తర్వాత వెలువడింది. తనకు స్ఫూర్తిగా నిలిచిన విద్యావంతుడైన సోదరుడు భాస్కర్ చనిపోవడంతో కృపాబాయి డిప్రెషన్‌కు గురయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు 13వ యేట బొంబాయిలోని జనానా మిషనరీ పాఠశాలలో చేర్పించారు. అక్కడ ఆమె ప్రతిభను గుర్తించిన మిషనరీ మహిళా డాక్టర్ ప్రోత్సహించారు. వైద్య విద్యలో శిక్షణనిప్పించేందుకు ఇంగ్లండ్‌కు పంపేందుకు ఆర్థికంతో పాటు అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. అయితే కృపాబాయి శారీరకంగా బలహీనంగా ఉండడంతో ఆ పనిని మిషన్ నిర్వాహకులు విరమించుకున్నారు. అయితే అప్పుడప్పుడే మద్రాసులో మహిళలకు సైతం వైద్య విద్యను నేర్పించడం ప్రారంభించడంతో కృపాబాయిని మిషనరీ నిర్వాహకులు అక్కడికి పంపిస్తారు. బొంబాయి నుంచి ఒక్కతే 1878 ఆ ప్రాంతంలో మదరాసుకు చేరుకుంది. ఇక్కడ మద్రాసు మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం ఒక్క కెమిస్ట్రీలో మినహా మిగతా అన్ని సబ్జెక్టులో ఆమె టాపర్‌గా నిలిచింది. అయితే ఒక ఏడాది గడిచిన తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వైద్య విద్యకు స్వస్తి పలికింది. ఈ సమయంలో అక్కడ మిషనరీగా పనిచేస్తున్న రెవరెండ్ విలియం థామస్ సత్యనాథన్ (1830-1892) ఇంట్లో ఆమెకు వసతి ఏర్పాట్లు చేసిండ్రు. సత్యనాథన్ భార్య అన్నా సత్యనాథన్ (1832-1924) కూడా కృపాబాయిని సొంత కూతురిలా చూసుకున్నారు. చదువుపట్ల మొదటి నుంచి కృపాబాయికి ఆసక్తి ఉండింది. అందుకే ఆమె ఆ రంగంలో రాణించింది. కృపాబాయికి చదువుపట్ల గల ఆసక్తిని అచ్చమాంబ ఇలా రాసిండ్రు. ‘‘కృపాబాయి బాల్యమునుండియే మిగుల తెలివి గలది యనిపించుకొనెను. ఈమె విద్యనభ్యసించునపుడు తన సహోదరునితోడ గూర్చుండి చదువవలయునని కోరుచుండెను గాని యామె తన వద్ద చదువ కూర్చుండినచో తన తప్పిదములను దిద్దునని యెంచి యట్టి యవమానమున కోర్వ జాలక యామె సహోదరుడామెను దగ్గర జేరనిచ్చెడివాడు కాడు. చిన్నయన్న యట్లు చేసినను కృపాబాయి జ్యేష్ఠ భ్రాత యగు భాస్కరుడు తన ముద్దుల చెల్లెలియం దధిక ప్రీతి కలవాడై యామె విద్యాభ్యాసము చక్కగా జరుపుచుండెను. ఆమెకు సృష్టి సౌందర్యావలోకమునం ధధిక ప్రీతిగాన నామె నిత్యము భాస్కరునితోడ బోయి యనేక పర్వతములను, వనములను, ఉవవనములను దప్పక చూచుచుండెను.’’ (అచ్చమాంబ, భండారు, 1917: 37)
ఇదే సమయంలో రెవరెండ్ సత్యనాథన్ కుమారుడు సామ్యూల్ సత్యనాథన్ ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాయంలో నాలుగేండ్లు విద్యాభ్యాసం చేసి ఇండియాకు చేరుకున్నాడు. సామ్యూల్, కృపాబాయి ఒకే ఇంట్లో నివసించారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. 1881లో పెండ్లి చేసుకున్నారు. ఇండియాకు చేరుకున్న సామ్యూల్ సత్యనాథన్ మొదట ఉదకమండలంలోని ‘బ్రీక్స్ స్మారక పాఠశాల’లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఇక్కడే హోబర్ట్ కళాశాలలో కొన్ని రోజులు ఆయన లెక్చరర్‌గా పనిచేసిండు.
ఉదకమండలంలో ఉన్న సమయంలోనే కృపాబాయి సత్యనాథన్ ముస్లిం బాలికల దురవస్థను గమనించి వారి కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించింది. ఆ తర్వాత మిషనరీ తరపున మరో విద్యాలయాన్ని కూడా ఆమె ఏర్పాటు చేసింది. వీటిని నిర్వహించడమే గాకుండా అందులో ఆమె బోధన కూడా చేసింది. సామ్యూల్ సత్యనాథన్‌ను అధికారులు బదిలీపై ఉదకమండలం నుంచి రాజమండ్రికి పంపించారు. ఇక్కడ ఆయన ఒక్క సంవత్సరం 1884-85 మధ్యన ఉన్నాడు. రాజమండ్రి నుంచి ఆయనకు తమిళనాడులోని కుంభకోణంకు బదిలీ అయింది. అక్కడ ఒక ఏడాది ఉన్న తర్వాత ఆయన్ని ప్రభుత్వం విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమించింది. ఇది 1886లో జరిగింది. ఈ అన్ని ప్రదేశాల్లోనూ ఆమె కొంత ఆరోగ్యం, మరికొంత అనారోగ్యంతో సావాసం చేసింది.
ఉదకమండలంలో ఉన్న సమయంలోనే కృపాబాయి తన రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించింది. మొదట అక్కడి వాతావరణాన్ని, ప్రకృతిని వర్ణిస్తూ ‘ది ఇండియన్ అబ్జర్వర్’, ‘నేషనల్ ఇండియన్ జర్నల్’ మొదలైన పత్రికలకు అనేక వ్యాసాలు రాసింది. భర్త ఉద్యోగం మదరాసుకు మారిన తర్వాత ఆమె ఆరోగ్యం కూడా కొంత కుదుట పడింది. 1888 చివర్లో ఒక బిడ్డకు తల్లి అయింది. అయితే ఆ బిడ్డ ఏడాది తిరగకుండానే చనిపోయింది. దీంతో ఆమె కృంగిపోయింది. అయితే ఈ సమయంలో ఒక స్నేహితురాలితో పాటు భర్త కూడా చిన్న చిన్న వ్యాసాలు, కవిత్వం రాసే బదులు నవల రాయమని ప్రోత్సహించారు. వారి ప్రోత్సహం మేరకు ఆమె మొదట 1887-88 మధ్య కాలంలో ‘మదరాసు క్రిస్టియన్ మ్యాగజైన్’లో తన కుటుంబ జీవితాన్ని నవలగా రాసింది. ఇది నవలా రూపంలో వెలువడిన తర్వాత ఇండియాతో పాటు విదేశాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. తొలిసారిగా ఒక భారతీయ మహిళ, అదీ మతం మార్చుకున్న రెండో తరం మహిళగా తన అనుభవాలు, జ్ఞాపకాలను ‘సగుణ’ నవలలో రికార్డు చేసింది. భారతీయుల ఆచార వ్యవహారాల గురించి రాసేప్పుడు వాటి గురించి అంతగా తెలియని పాఠకులను సైతం దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థమయ్యే విధంగా నవలను రాసింది. ఇందులో చిన్నప్పుడే అంటే తన ఆరేండ్ల వయసులో (1868)లో చనిపోయిన తండ్రితో పాటు తల్లి రాధాబాయి, ఆమె మిత్రురాలు లక్ష్మి, తన మిత్రురాండ్రు ప్రేమ, హరిణి, మిషనరీ మిసెస్ రాబర్ట్స్, సోదరుడు భాస్కర్ ఇట్లా అనేక సజీవ పాత్రతో నవలను నడిపించింది. అందుకే ఈ నవల గురించి విదేశాల్లో సైతం మంచి గుర్తింపు ఉండింది. ఈ విషయమై కృపాబాయి రాసిన మరో నవల ‘కమల’కు ముందుమాట రాస్తూ గ్రిగ్స్ అనే విమర్శకురాలు ఇలా చెప్పిండ్రు. “Her writings seem even better known to English than to Indian readers, some of them having been reviewed in flattering terms in the leading English journals. Her majesty the Queen Empress had recently accepted a copy of “saguna” and was graciously pleased to request that any other work by the authoress should be sent to her.” (Memoirs, Mrs H.B.Grigg, 1894)
ఈమె రెండో నవల ‘కమల’ 1893లో మళ్ళీ ‘మదరాసు క్రిస్టియన్ మాగజైన్’లో సీరియల్‌గా ప్రచురితమయింది. ఇది 1894 డిసెంబర్లో పుస్తక రూపంలో అచ్చయింది. ఈ రెండు నవలలను శ్రీనివాసన్, వరదన్ అండ్ కంపెనీ అనే ప్రచురణ సంస్థ మదరాసులో ముద్రించింది. ‘సగుణ’లో క్రైస్తవ జీవితాలను, ఇండియన్స్, విదేశీయుల మధ్యన వైరుధ్యాలు, ఆచార వ్యవహారాలల్లో తేడాను రికార్డు చేస్తే ‘కమల’ నవలలో హిందూ మహిళల జీవితాలను, వారి ఆచారాలను, విద్యావశ్యకతను రికార్డు చేసింది. కృపాబాయి రాసిన వ్యాసాలు, కవిత్వం కూడా పుస్తకంగా అచ్చయింది.
సామ్యూల్ సత్యనాథన్ ఇంట్లో అందరూ రచయితలే కావడం విశేషం.లూ సామ్యూల్ తండ్రి డబ్ల్యు.టి. సత్యనాథన్ రచనలు చేసిండు. సామ్యూల్ (1861-1906) ‘క్రిస్టియన్ పేట్రియాట్’ అనే పత్రికకు సంపాదకత్వం వహించడమే గాకుండా, కొన్ని పుస్తకాలు రాసిండు. సామ్యూల్ తల్లి అన్నా సత్యనాథన్ (1832-1894) కూడా రచనలు చేసింది. అట్లాగే సామ్యూల్ రెండో భార్య కమల సత్యనాథన్ (1879-1950) ‘హిందూ హిరోయిన్ శకుంతల’ పేరిట రచనలు చేసింది. సామ్యూల్-కమల సత్యనాథన్‌ల సంతానం పద్మినీ సేన్ గుప్త (1906-1988) కూడా గొప్ప రచయిత్రి.
కృపాబాయికి ఇష్టమైన కవి వర్డ్స్ వర్త్. ఈమె వర్డ్స్‌వర్త్‌తో పాటు, టెన్నిసన్, లాంగ్‌ఫెలో, బ్రౌనింగ్, లూయిస్ మోరిస్, జార్జ్ ఎలియట్, మిల్టన్, రుడ్యర్డ్ కిప్లింగ్ తదితరుల రచనలు విరివిగా చదివింది. అందుకే ఆమె తన రచనలను చక్కగా తీర్చి దిద్దగలిగింది. సంస్కరణ భావాల దృష్ట్యా ఇంగ్లీష్ సాహిత్యంలో ఇప్పటికీ ఈమెను ‘నూతన మానవి’గా పేర్కొంటారు.
ఇక ఈమె తెలుగు వారికి ఎట్లా దగ్గరయ్యిందో చూద్దాం. బండారు అచ్చమాంబ 1905లో చనిపోయింది. ‘అబలా సచ్చరిత్ర రత్నమాల’ మొదటి భాగం అచ్చమాంబ బతికుండగానే 1901లో అచ్చయింది. రెండో సంపుటం ఎప్పుడు అచ్చయిందో తెలియదు. అయితే ఎన్.వి.కృష్ణ అండ్ కో వారు 1913లో మొదటి భాగాన్ని మూడు వేల కాపీలతో పునర్ముద్రించారు. ఈ కంపెనీలో భాగస్వామి అయిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు రెండో భాగాన్ని 1917లో ప్రచురించాడు. ఈ పుస్తకం ‘ఉత్తమ గ్రంథాలయం’ ప్రచురణ సంస్థ తరపున వెలువరించారు. ‘సగుణ’ గురించి అచ్చమాంబ రాస్తూ ‘‘1886వ సంవత్సరమునందామె భర్తను చెన్నపట్టణమునకు మార్చిరి. యచటికి వచ్చిన యనంతరము పత్రికకు వ్యాసములు వ్రాయుటలోనే కాలము గడపక, ప్రబంధ రచన చేయుట మంచిదియని యామె భర్త సూచించెను. అందుపై నామె తన బాల్యము నందలి యనేక సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొని వానితో దన కల్పనను గూర్చి ‘సగుణమ్మ’ యను ప్రబంధమును నొకదాని నింగ్లీషునందు వ్రాసెను. అది ప్రస్తుతము తెలుగునందు భాషాంతరీకరింపబడి యున్నది’’ అని చెప్పింది. అంటే 1905 కన్నా ముందే ఈ పుస్తకం తెలుగులో కూడా అచ్చయింది.
అట్లాగే ఆంగ్లంలో ‘కమల’ నవల 1894లో అచ్చయింది. దీన్ని కూడా తెలుగులోకి తర్జుమా చేసిండ్రు. ఈ అనువాద నవలను 1909లో మదరాసులోని ఎస్‌పిసికె ప్రెస్‌లో అచ్చేసిండ్రు. మొత్తం 143 పేజీల్లో ఈ నవ అచ్చయింది. అయితే ఈ రెండు నవలల మూల ప్రతులు మాత్రం లభ్యం కావడం లేదు. అవి దొరికినప్పుడు మాత్రమే వాటిని ఎవరు తర్జుమా చేసిండ్రో తెలుసుకునేందుకు అవకాశముంటుంది. ఇందులో ‘కమల’ నవల తెలుగు ప్రతి బ్రిటీష్ లైబ్రరీలో ఉన్నట్లు అక్కడ పనిచేసిన బార్నెట్ అనే అతను రాసిండు. (ఎ కేటలాగ్ ఆఫ్ తెలుగు బుక్స్ 1912; 90).
అచ్చమాంబ జీవితానికి కృపాబాయి సత్యనాథన్ జీవితానికి చాలా సారుప్యాలున్నాయి. ఇద్దరు కూడా స్వయంకృషితో పట్టుబట్టి విద్యాభ్యాసం చేసిండ్రు. ఇద్దరు కూడా తమ సమకాలీన జీవితాలను సృజనాత్మకంగా సైతం రికార్డు చేసిండ్రు. ఇద్దరు కూడా దాదాపు ఒకే వయసులో మరణించారు. ఇద్దరూ తమ పిల్లలను చిన్నతనంలోనే కోల్పోయిండ్రు. అచ్చమాంబ 1905 జనవరి 18న 30వ యేట మరణించగా, కృపాబాయి సత్యనాథన్ 32వ యేట ఆగస్టు 8, 1894 నాడు మదరాసులో మరణించింది. ఈమె సమాధి మదరాసులోని పరశువాకంలోని సెమిట్రీలో ఉన్నది.
కృపాబాయి రాసిన రచనలను అచ్చమాంబ ప్రబంధాలు అని రాసింది. అంటే అప్పటికి నవల అనే పదం ఖాయం కాలేదు. ఇట్లా తెలుగు సాహిత్యములో మొదటి సారిగా ఇంగ్లీషు నుంచి ఒక మహిళ రచనలు తర్జుమా అయిన తీరుని చరిత్రలో శాశ్వతంగా ముఖ్యంగా మహిళా సాహిత్య చరిత్రలో రికార్డు చేయాల్సిన అవసరమున్నది.
-సంగిశెట్టి శ్రీనివాస్
Subscribe to:
Posts (Atom)
-
మన గొప్ప మనం చెప్పుకుంటే అది హెచ్చులు/ఏతులుగా అనిపిస్తయి. అదే విషయాన్ని వేరేవాళ్ళు జెబితే దానికి ఆమోదనీయత, గౌరవం రెండూ ఉంటాయి. హైదరాబాద్ రా...
-
Tributes to Samala Sadashiva It is hard to digest that the multi-talented son of the soil Samala Sadashiva has not got his due recognition...