Tuesday, August 18, 2020

వృథా పరిశోధన





తెలంగాణ ప్రభుత్వం పూనికతో 2017లో ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా హైదరాబాద్‌లో జరిగాయి. ఈ మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడెమీ చాలా పుస్తకాలు ప్రచురించింది. అయితే ఈ పుస్తకాలన్నింటిలోనూ అత్యధిక పేజీలతో వెలువడిన గ్రంథం ‘తెలంగాణలో భావకవితా వికాసం’. అకాడెమీ 11వ ప్రచురణగా వెలువడిన ఈ గ్రంథానికి సామిడి జగన్‌ రెడ్డి సంపాదకత్వం వహించాడు. ‘ప్రణయం-ప్రకృతి - ప్రశంస - మహిళా కవితావళి - 1920-43, 1948-66’ అనే ఉపశీర్షికతో ఈ కవితలను సంకలనం చేసిండు. 

ఈ పుస్తకం మొత్తం మొదటి పేజీ నుంచి ఆఖరిపేజీ వరకూ తప్పులతడకగా ఉన్నది. ఒక గ్రంథం ఏదైనా ప్రభుత్వ శాఖ తరపున వెలువడినట్లయితే దానికి సాధికారత ఉంటుంది. వివిధ విశ్వవిద్యాలయాల్లో దాన్ని పాఠ్యాంశంగా పెడతారు. రెఫరెన్స్‌ గ్రంథంగా సూచిస్తారు. అట్లాగే యువ పరిశోధకులు ఆ గ్రంథంలోని విషయాలు ప్రామాణికంగా భావిస్తారు. ముఖ్యంగా ప్రాంతేతరులు దాన్ని కరదీపికగా భావిస్తారు. అందుకే తెలంగాణవాదిగా, సాహిత్య విమర్శకుడిగా, పరిశోధకుడిగా ఇందులోని అసత్యాలు, అసంబద్ధ విషయాలను పాఠకుల దృష్టికి తీసుకురావడం బాధ్యతగా భావిస్తున్నాను. అందులో భాగమే ఈ వ్యాసం. ఈ వ్యాసం తెలంగాణ మీది ప్రేమతోనే తప్ప ఎవరిపైనా ఆరోపణలు చేయడం కోసం రాయడం లేదు అనే విషయాన్ని గుర్తించాలి. 

తెలుగు సాహిత్యంలో ఇప్పటి వరకు వెలువడ్డ దాదాపు అన్ని సంకలనాలకు పుస్తకం లోపల ఏమున్నదో తెలియజెప్పేందుకు ‘విషయ సూచిక’ ఉంటుంది. ఈ పుస్తకానికి అట్లాంటి విషయ సూచిక ఏమీ లేదు. మొత్తం 538 కవితలున్న ఈ పుస్తకానికి విషయ సూచిక ఇవ్వక పోవడం వల్ల ఏ కవి రచన ఏ పేజీలో ఉందో వెతకడానికి మొత్తం 638 పేజీలను తిరగేయాల్సి వచ్చింది. సరే అట్లా పుస్తకం మొత్తం తిరగేస్తే గానీ ఒక్కో కవివి 20కి పైగా కవితలున్నాయనే విషయం తెలియలేదు. ఇందులో బూర్గుల రామకృష్ణారావువి 15 కవితలుండగా ఆయన కుమారుడు బూర్గుల రంగనాథరావువి 25 కవితలున్నాయి. అట్లా అని ఇవేవి అరుదైన కవితలేమీ కావు ఈ ఇద్దరి సమగ్ర సాహిత్యాన్ని ఇటీవలే ఆచార్య ఎస్వీరామారావుగారు సంకలనాలుగా తీసుకొచ్చారు. అట్లాగే మరో కవి వానమామలై వరదాచార్యులు గారివి 21 కవితలు. అందులో 18 కవితలు ఒక్క ‘మణిమాల’ సంపుటి నుంచి తీసుకొని దీనిలో జోడించారు. సి. నారాయణరెడ్డి కవితలు మరో 20 ఉన్నాయి. 

వీళ్ళు కొంత మేరకు ఆధునిక దృక్కోణంతో కవితలు రాసిండ్రు. అయితే ఆధ్యాత్మిక కీర్తనలు రాసిన కైరం భూమదాసువి 19 కీర్తనలు ఇందులో ఉన్నాయి. అట్లాగే మామునూరు నాగభూషణరావువి 12 కవితలు సురవరం ప్రతాపరెడ్డివి మరో 11 కవితలు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమయి ఉంటుందనుకుంటా! అదేమి టంటే ‘విషయ సూచిక’లో కవి-కవితను పేర్కొన్నట్లయితే ఒకే కవివి ఎన్ని కవితలు ఇందులో ఉన్నాయో ఈజీగా తెలుస్తుంది కాబట్టి సంపాదకులు ఆ పనిని విరమించుకున్నారు. చూడంగనే ఇట్టే తెలిస్తే ఎవరైనా విమర్శించే అవకాశముంటుంది. అందుకే సంపాదకులు ఆ కష్టానికి ఒడిగట్టలేదు. 

ఈ కవితల కూర్పుకు ఒక కాలక్రమం కూడా ఏమీ పాటించలేదు. అట్లా పాటించినట్లయితే ఒక సంపుటి నుంచి తీసుకున్న రచనలన్నీ ఒకే దగ్గర పేర్కొనాల్సి వస్తది కాబట్టి సంపాదకులు ఆ పని చేయలేదు. ఎందుకంటే బుక్కపట్టణం తిరుమల నరసింహాచార్యులు ‘సురభి’ పేరిట 1927లో ఒక సంపుటిని వెలువరించాడు. కాలక్రమంలో ఈ సంకలనాన్ని వెలువరించినట్లయితే ‘సురభి’లోని కవితలన్నీ ఒకే దగ్గర పేర్కొనేందుకు అవకాశముండేది. ఇట్లా ఒకే కవివి ఎన్ని కవితలు చేర్చిన విషయాన్ని తెలియకుండా పక్కదారి పట్టించేందుకుగాను రెండు కవితలు వేరే కవులవి ఇచ్చి ఆ తర్వాత ‘సురభి’లోనుంచి పేర్కొన్నారు. అట్లాగే ‘మణిమాల’ నుంచి తీసుకున్న 18 కవితలు, ‘బూర్గుల రంగనాథరావు సాహిత్యం’ తదితర పుస్తకాల నుంచి తీసుకున్న సమాచారమంతా ఒకే దగ్గర ఇవ్వాల్సి వస్తది. ఇది సంపాదకులకు ఇష్టం లేదు. నిజానికి ఇది పాఠకులను తప్పుదారి పట్టించడమే! కాలక్రమంలో కవిత్వ కూర్పు చేసినట్లయితే ఇందు లోని కొన్ని తప్పులను ఉపసంహరించుకునేందుకు అవకాశముండేది అట్లనే ఒకే కవితను రెండు సార్లు చదివే కష్టం కూడా పాఠకులకు తప్పి ఉండేది. 

ఇందులో 34వ పేజీలో ‘నిరాశ’ పేరిట బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు రాసిన కవిత మళ్ళీ 76వ పేజీలో కూడా ప్రత్యక్షమైంది. పాలమూరు సంస్థానాలల్లో చాలా మంది తిరుమల/బుక్కపట్టణంవాళ్ళు ఉన్నారు. అట్లాగే ‘సురపురం’ సంస్థానంలో కూడా ఈ ఇంటిపేరు కలవారు ఉన్నారు. ‘సురభి’ సంపుటి ప్రచురణకు జటప్రోలు సంస్థాన రాజా వెంకటలక్ష్మారావు బహ ద్దరు సహాయం చేసిండు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ‘సురభి’ అనే గ్రామం పేరుంది. కానీ తిరుమల బుక్కపట్టణం వారి వంశవృక్షంలో ఎక్కడా కూడా బుక్కపట్టణము తిరుమల నరసింహాచార్యులు పేరు లేదు. మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్యాన్ని విస్తృతంగా అధ్య యనం చేసిన పండితులు వైద్యం వెంకటేశ్వర్లు ఈ కవి అనంతపురం వాడు కావొచ్చని అభిప్రాయపడ్డారు. జగన్‌ రెడ్డి ఏ ఆధారాలతో ఈయన్ని తెలంగాణ వాడుగా నిర్థారించాడో తెలియాలి. 

తిరుమల బుక్కపట్టణం నరసింహాచార్యులు ప్రాంతం సందిగ్ధం కాబట్టి వదిలేసినా ఆంధ్రావారు, ఆంధ్రావాదుల కవితలు కూడా ఇందులో యథేచ్ఛగా సంకలితమయ్యాయి. సంపాదకుడి దృష్టిలో రాయప్రోలు సుబ్బారావు, ఊటుకూరు సత్యనారాయణ, సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, డాక్టర్‌ పి.వి. రమణయ్య, భాగవతుల పూర్ణయ్య, ఇంద్రగంటి నాగేశ్వరశర్మ, ఆదిపూడి సోమనాథరావు, ఆదిపూడి ప్రభాకరామాత్య, యన్‌. భారతీ రత్నాకరాంబ, నౌడూరు బుచ్చిబంగారయ్య ఇంకా తెలంగాణేతర కవులు పదుల సంఖ్యలో ఈ సంకలనంలో స్థానం సంపాదించుకున్నరు. ఇందులో నౌడూరు బుచ్చిబంగారయ్య పేరు మార్చి చౌడూరు బుచ్చిబంగారయ్య పేరిట తెలంగాణ సిటిజన్‌షిప్‌ ఇచ్చేసిండు సంపాదకుడు.

పైన పేర్కొన్న విధంగా వానమామలై, బూర్గుల రంగ నాథాచార్యులు, సి.నారాయణరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డిల రచనలు ఇబ్బడిముబ్బడిగా ఈ సంకలనంలో ఉన్నాయి. బహుశా సంకలనం పేజీల సంఖ్యం పెం చడం కోసం చాలా మంది కవులవి ఐదారుకు మించి కవితలున్నాయి. వారిలో బోయినపల్లి రంగా రావు కవితలు -12, దేవులపల్లి రామానుజరావు కవితలు ఏడు, ఊటుకూరు రంగారావు కవితలు-7, దాశరథి కవితలు -5, శేషభట్టర్‌ వేంకట రామానుజాచార్యులు, గవ్వా సోదరులు, బెల్లకొండ చంద్రమౌళి శాస్త్రి, శేషాద్రి రమణకవులు ఇట్లా చాలా మంది కవుల రచనలు ఒక్కొక్కరివి ఐదారుకు మించి ఉన్నాయి. కవితా సంకలనం అంటే వారి ప్రతిభకు అద్దం పట్టే ఒకటి రెండు కవితలుంటాయి. కాని ఒక్కొక్కరివి 25 అంటే ఆశ్చర్యంగా ఉన్నది.

అత్యధికంగా కవితలు ‘గోలకొండ కవుల సంచిక’ లోనివే. 94 కవితలు తీసుకున్నాడు. ఇది కవిత చివరన సంపాదకులు పేర్కొన్న సమాచారం ద్వారా తెలిసిందే! అయితే లోతుగా పరిశీలించినట్లయితే ఇష్టానుసారంగా వీటిని పేర్కొన్న విషయం అవగతమవుతుంది.ఉదాహరణకు మామునూరు నాగభూషణరావు కవితల్లో ఒక్క ‘నిజాం రాష్ట్ర ప్రశంస’ మాత్రమే గోలకొండ కవుల సంచికలో ఉన్నది. అయితే ఈ సంపాదకుడు మాత్రం ‘వాంఛితము’, ‘జీవితాదర్శము’ కూడా గోలకొండ కవుల సంచిక నుంచే తీసుకున్నట్టు పేర్కొన్నాడు. మరోచోట ‘గోలకొండ కవుల పత్రిక’ పేరిట ఈయన రచన ‘జ్ఞాతివైరము’ను పేర్కొ న్నాడు. రూప్ఖాన్‌పేట రత్నమ అని ఒక దగ్గర మరో దగ్గర రంగమాంబ అని పేర్కొన్నాడు. అట్లాగే సురవరం ప్రతాపరెడ్డి పేరిట పేర్కొన్న కొన్ని కవితలు ‘ఆయనవే’ అని ఎట్లా నిర్ధా రించిండ్రోకూడా పాఠకులకు తెలియాల్సి ఉన్నది. ఎందుకంటే ‘కవికుమారుడు’, ‘దీర్ఘదర్శి’ అనే కలం పేరుతో సురవరం రాసినట్టుగా సంపాదకుడు పేర్కొన్నారు. ఆధారాలు చెప్పలేదు.

ఇందులో ‘సుజాత’ పత్రిక నుంచి తీసుకున్న కవితల్లో ఎక్కువ తెలంగాణేతరులవే! ఇందులోనే శ్రీశ్రీతో, చలం రచనలు చోటు చేసుకున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. జగన్‌రెడ్డి ఈ పుస్తకం చివర్లో ఐదు పేజీల్లో మూడు అనుబంధాలను జోడించాడు. ఇందులో రెండో అనుబంధంలో సుజాత పత్రిక ‘1927-34’ వరకు వెలువడింది అని పేర్కొన్నాడు. అది తప్పు. ఈ పత్రిక 1927 జనవరి నుంచి 1930 జనవరి వరకు వెలువడింది. అట్లాగే దీనికి కొన్ని రోజులు బి.ఎన్‌.శర్మ సంపాదకులుగా వ్యవహరించారు అని రాసిండు. అది కూడా తప్పే. ఈ పత్రికకు కొన్ని రోజులు పి.ఎన్‌.శర్మ అనే పసుమాముల నృసింహశర్మ అనే అతను సంపాదకులుగా వ్యవహరించారు. ఇంకా బోలెడన్ని తప్పులు ప్రతి పేజీలోనూ ఉన్నాయి. బాధాకరమైన విషయమేందంటే సంపాదకుడు కనీస పరిశోధక మర్యాదలు కూడా పాటించలేదు. నా సంపాదకత్వంలో వచ్చిన ‘సురవరం కవిత్వం’ నుంచి కవిత్వాన్ని తీసుకొని డైరెక్ట్‌గా తానే ఒరిజినల్‌ ప్రతులు చూసినట్టుగా పత్రికలను పేర్కొన్నాడు. కొన్ని కవితలకు ‘సురవరం కవిత్వం’ నుంచి అని పేర్కొన్నప్పటికీ అన్ని కవితలూ నా సంకలనంలోనుంచి తీసుకొని కొన్నింటికే క్రెడిట్‌ ఇవ్వడం మర్యాద కాదు. 

ఇందులో ఉన్నదంతా భావకవిత్వమేనా అనే చర్చ కూడా ఇక్కడ చేయడం లేదు. అట్లా చేసినట్లయితే మరిన్ని బొక్కలు బయటపడే అవకాశముంది. ఇందులో కొందరు మహిళల్ని మాత్రమే చేర్చిండు. మిగతా వాళ్ళని ఎందుకు విస్మరించిండో తెలియాలి. ఇట్లా చాలా లోతైన విషయాలపై ఇంకా చర్చ బాకీ ఉంది. బోలెడన్ని అనువాద కవితలు తీసుకోవడంలో ఉద్దేశ్యమేమిటో తేలాలి. ఎంతో ఉదారంగా లక్షల రూపాయలు వెచ్చించి 2000ల ప్రతులు ముద్రించారు. ఇంత నిర్బాధ్యతగా పుస్తకాన్ని అచ్చేసినందుకు, ప్రజాధనాన్ని ఎలాంటి నిపుణుల కమిటీ ఆమోదం లేకుండా (ఉంటే వారి పేర్లు పుస్తకంలో ఉండేవి) విచ్చలవిడిగా ఖర్చు చేసినందుకు అప్పటి తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి బాధ్యత వహించాలి. తప్పులతడకతో నిండిన ఈ పుస్తకాన్ని ప్రభుత్వం అమ్మకాల నుంచి ఉపసంహరించుకోవాలి. అట్లాగే దీనిలోని తప్పులన్నింటిని సవరించి తెలంగాణ ఔన్నత్యాన్ని నిలబెట్టేవిధంగా పునర్ముద్రించాలి. భవిష్యత్‌లో పుస్తకాలు ముద్రించే ముందు విషయ నిపుణుల ఆమోదం మేరకే పుస్తకాలు ప్రచురించాలని వినతి. 

సంగిశెట్టి శ్రీనివాస్

No comments:

Post a Comment

Vattikota natikalu