Monday, August 10, 2020

సామాజిక సంతకం మండల్

 సామాజిక సంతకం మండల్

దళిత చైతన్యం, భావజాల వ్యాప్తి, ఉద్యమ కార్యాచరణ మూలంగా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ గురించి ప్రపంచమంతటా తెలిసింది. అంబేద్కర్‌ గురువు, బహుజనోద్యమాలకు మూల పురుషుడు జ్యోతిబా ఫూలే జీవిత విశేషాలు ఇప్పుడిప్పుడు దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ వరుసలో వారి సరసన నిలబడాల్సిన మరోవ్యక్తి ఉన్నారు. ఆయన గురించి అందరికీ తెలియదు. దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న ఓబీసీలకు మేలు చేసిన మహనీయుడీయన. ఆయనే బిందేశ్వరి ప్రసాద్‌ మండల్‌ (బి.పి. మండల్‌). కేంద్రంలో విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈయన నేతృత్వంలోని మండల్‌ కమిషన్‌ ప్రతిపాదించింది. దాన్ని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం దశాబ్దం తర్వాత అమల్లోకి తెచ్చింది.
బహుజన సమాజానికి ఈయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. బీహార్‌ రాష్ర్టానికి తొలి బీసీ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కేవలం 48 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నా వత్తిళ్లకు లొంగకుండా తన పదవినే త్యాగం చేసిండు. జిల్లా మెజిస్ర్టేట్‌గా, దేశ స్వాతంత్య్రం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీహార్‌ అసెంబ్లీకి, ఆ తర్వాత ఎంపీగా ఎన్నుకోబడ్డారు. శోషిత్‌ దళ్‌ పేరిట పీడిత ప్రజల పార్టీని ఏర్పాటు చేసిండు. జయప్రకాశ్‌ నారాయణ పిలుపు మేరకు పదవుల్ని త్యాగం చేసిండు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల పక్షాన నిలబడ్డందుకు ఇబ్బందులెదుర్కొన్నడు. గుర్తింపునకు నోచుకోకుండా పోయిన ఈయన నిజంగా ఈ దేశ బహుజనుల ఆరాధ్యుడు. ఇంతటి జాతీయ నాయకుడి గురించి అందరికీ తెలియదు. ఆ కొరత తీర్చే ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం.

బి.పి. మండల్‌ యాదవ కులంలో 1918, ఆగస్టు 25న బీహార్‌లోని మాధేపూర్‌ జిల్లాలోని మర్హో గ్రామంలో జన్మించిండు. బాల్యమంతా అక్కడే గడిచింది. ఈయన తండ్రి రాస్‌ బిహారీలాల్‌ మండల్‌ అక్కడ చిన్నపాటి జమిందార్‌. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నట్లయితే తన జమిందారీ రద్దవుతుందని తెలిసి కూడా ఉద్యమంలో పాల్గొన్నడు. జంద్యాలు కేవలం బ్రాహ్మణులే ఎందుకు వేసుకోవాలె, మేము వేసుకుంటామనే ఉద్యమాన్ని లేవనెత్తిండు. బహుజనులకు మెరుగైన విద్యావకాశాలు, అభివృద్ధికి తోడ్పడే సకల చర్యలు చేపట్టాలంటూ ‘మార్లో-మింటో’ కమిటీకి విజ్ఞాపనలు అందజేసిండు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల వల్ల జైలు శిక్ష కూడా అనుభవించిండు. మిత్రులతో కలిసి అఖిలభారత యాదవ (గోపీ) మహాసభను స్థాపించిండు. మండల్‌ కుటుంబం మొత్తం 1920లకు ముందు నుంచే ప్రజోద్యమాల్లో ఉండింది. బి.పి. మండల్‌ పెద్దన్న భువనేశ్వరి ప్రసాద్‌ మండల్‌ 1920లోనే బీహార్‌-ఒరిస్సా శాసనమండలికి జరిగిన తొలి ఎన్నికల్లో సభ్యుడిగా ఎన్నికయిండు. ఈయన కొడుకు జస్టిస్‌ రాజేశ్వర్‌ ప్రసాద్‌ మండల్‌ పాట్నా హైకోర్టులో తొలి బీసీ జడ్జి. బి.పి. మండల్‌ రెండో అన్న కమలేశ్వరి ప్రసాద్‌ స్వాతంత్ర్యోద్యమంలో జయప్రకాశ్‌ నారాయణతో పాటు పాల్గొని 1937లో జైలుకు వెళ్లిండు. ఈయన కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిండు. ఈ రాజకీయ పరంపరను కొనసాగించడమేగాకుండా ఓబీసీలందరూ సదా స్మరించుకొని, నివాళి అర్పించే విధంగా బిందేశ్వరి ప్రసాద్‌ మండల్‌ పనిచేసిండు. ఓబీసీలకు దేశంలో మొట్టమొదటిసారిగా విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే మండల్‌ నివేదికను తయారు చేసిండు. నిజాయితీగా ఉంటూ నిప్పులా బతికిండు. పదవుల్ని తృణప్రాయంగా భావించిండు. చివరికి నమ్మిన సిద్ధాంతం కోసం ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకుండు.


దర్భంగాలో రాజ్‌ పాఠశాలలో చదువుతున్న కాలంలోనే జమిందారు కొడుకయినప్పటికీ బి.పి. మండల్‌ కుల వివక్షను ఎదుర్కొన్నడు. అగ్రవర్ణాల వారితో గాకుండా ఉపాధ్యాయులు ఇతన్ని వేరుగా కూర్చొండబెట్టిండ్రు. తినేప్పుడు కూడా కలువనియ్యక పోయేది. ఆ తర్వాత పాట్నాలో ఇంటర్మీడియట్‌ విద్యనభ్యసించి, కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఇంగ్లీషులో బి.ఎ. ఆనర్స్‌ పాసయిండు. చిన్నతనంలో తాను అనుభవించిన వివక్ష జీవితాంతం అతన్ని వెన్నాడింది. హమేషా పీడితుల పక్షాన నిలబడేలా చేసింది.

1945-51 మధ్యకాలంలో గౌరవ మెజిస్ర్టేటుగా ఉన్నడు. ఫ్రీ ఇండియాలో జరిగిన తొలి సార్వత్రక ఎన్నికల్లో బీహార్‌ అసెంబ్లీకి ఎన్నకయిండు. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కృష్ణ సిన్హా మంత్రి పదవిని ఆఫర్‌ చేసినా కేబినెట్‌ హోదా పదవి కావాలని పట్టుపట్టడంతో అది దక్కలేదు. అనంతరం 1965 ఆ ప్రాంతంలో తన నియోజకవర్గంలోని దళితులు, ముస్లింలపై పోలీసుల దాడిని ఖండించిండు. వారికి నష్ట పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీలో ఆ విషయాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిండు. అంతకు ముందు ముఖ్యమంత్రి కె.బి. సహాయ్‌ పార్టీ ఆదేశాల పేరిట, ఈ అంశాలను అసెంబ్లీలో మట్లాడొద్దని హెచ్చరించినా వినకుండా ప్రజల పక్షంగా నిలబడే నాయకుడు కావడంతో వాటిని ఉల్లంఘించిండు. ఆ తర్వాత ఆత్మను చంపుకొని కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగలేక సంయుక్త సోషలిస్టు పార్టీలో చేరిండు. చేరడమే గాకుండా రాష్ట్రమంతటా పర్యటించి 1967 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 69 సీట్లు సాధించి పెట్టిండు. అంతకు ముందు సభలో ఆ పార్టీ బలం కేవలం ఏడు సీట్లు మాత్రమే. ఇలా బీహార్‌లో తొలి కాంగ్రెసేతర పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో తొలి సారిగా మండల్‌ ఆరోగ్యశాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక్కడ కూడా ఇమడ లేక శోషిత్‌ దళ్‌ పేరిట పీడిత ప్రజల పార్టీని ఏర్పాటు చేసిండు.

తర్వాతి కాలంలో 1968 ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి 22 వరకు మండల్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. మొత్తం 48 రోజులు మాత్రమే ఈయన అధికారంలో ఉన్నడు. ఈయనే తొలి బీహార్‌ ఓబీసీ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సక్రమంగా పాలన చేయకుండా ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ అనేక అడ్డంకులు కల్పించింది. అంతకుముందు మంత్రులు చేసిన అవినీతిపై వేసిన కమిటీ రిపోర్టుని బహిర్గతం చేయొద్దని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి ఇందిరాగాంధీ మండల్‌కు చెప్పినప్పటికీ ఆమె మాటను పెడచెవిన పెట్టిండు. దీంతో అప్పటి వరకు మండల్‌కు ఇస్తున్న మద్దతును కాంగ్రెస్‌ పార్టీ ఉపసంహరించుకుంది. ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఈ సమయంలో గవర్నర్‌ పాత్రపై పెద్దఎత్తున దుమారం రేగింది. అదంతా చరిత్రలో భాగమయింది.

మండల్‌ మరోసారి 1970లో అసెంబ్లీకి ఎన్నకయిండు. అయితే జయప్రకాశ్‌ నారాయణ పిలుపు మేరకు పదవికి రాజీనామా చేసిండు. ఎమర్జెన్సీ సమయంలో మొత్తం జయప్రకాశ్‌ నారాయణ వెంటే ఉన్నాడు. 1977లో పార్లమెంటుకు ఎన్నికయిండు. ఈ దశలోనే అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ బి.పి.మండల్‌ నేతృత్వంలో ఓబీసీల అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన చర్యలు సూచించే విధంగా కమిటీని ఏర్పాటు చేసిండు. ఇది జనతాపార్టీ మేనిఫెస్టోలో ప్రధానాంశం. ఈ కమిటీలో హైదరాబాదీ అయినప్పటికీ తర్వాతి కాలంలో బొంబాయిలో ఉంటూ అక్కడి నుంచి పార్లమెంటుకు ఎన్నికైన దళిత జడ్జి రాజారాంభోలే కూడా సభ్యుడిగా ఉన్నారు. మండల్‌ కమిషన్‌ ఏర్పాటుకు 1978లో నిర్ణయం జరిగినా రాష్ట్రపతి ఉత్తర్వులు జనవరి ఒకటి 1979న వెలువడ్డాయి. ఆనాటి నుంచి ఏడాదిలోగా నివేదిక సమర్పించాల్సిందిగా అందులో పేర్కొన్నారు. అయితే సమయం సరిపోక పోవడంతో ఈ కమిటీ కాల పరిమితిని మరో ఏడాది పొడిగించిండ్రు. చివరికి మండల్‌ కమిటీ నివేదికను అప్పటి హోంమంత్రి జ్ఞాని జైల్‌సింగ్‌కు డిసెంబర్‌ 31, 1980 నాడు మండల్‌ సమర్పించిండు. దేశం నలుమూలలా విస్తృతంగా పర్యటించడమే గాకుండా, విశ్వవిద్యాలయాలు, ప్రొఫెసర్లు, విషయనిపుణులను సంప్రదించి అత్యంత సమగ్రమైన నివేదికను తయారు చేసిండు. ఈ నివేదిక సమర్పించిన 15 నెలలకే 1982 ఏప్రిల్‌ 13న మండల్‌ కన్నుమూసిండు.

మండల్‌ కమిషన్‌ చేసిన 40 సూచనల్లో ఒకటైన విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు 1990 ఆగస్టు 7న అమలు చేస్తూ అప్పటి ప్రధాని విశ్వనాథ్‌ ప్రతా్‌పసింగ్‌ ఉత్తర్వులు జారీ చేసిండు. దీనికి వ్యతిరేకంగా అనేకమంది అలజడులు సృష్టించిండ్రు. బీజేపీ చివరికి ఆయన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని రథయాత్రను చేపట్టింది. అందుకే ఆనాటి ఎన్నికలు మండల్‌ వర్సెస్‌ కమండల్‌గా జరిగాయి.
మండల్‌ కమిషన్‌ చేసిన సూచనలు అమలు చేయాలని వి.పి.సింగ్‌ ప్రకటించిన ఉత్తర్వులకు ఈ ఏడాది ఆగస్టులో 25 ఏండ్లు నిండినయి.

మండల్‌ సిఫారసులు అమలు చేయాలనే నిర్ణయం 1990లో జరిగినా అనేక కోర్టు అడ్డంకులెదుర్కొని 1993 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, 2008 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో 27 శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు అమలవుతున్నాయి. ఈ రిజర్వేషన్లు పొందడానికి క్రీమీలేయర్‌తో పాటు సవాలక్ష ఆంక్షలు ఉండడంతో ఇప్పటికీ ఓబీసీలకు సరైన న్యాయం జరగడం లేదు. 22 ఏండ్ల నుంచి రిజర్వేషన్లు అమలవుతున్నా ఇంకా కేంద్రంలో 10 శాతం కూడా ఓబీసీ ఉద్యోగస్తులు లేరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీన్ని అధిగమించడానికి మండల్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులన్నింటినీ పూర్తిగా అమలు జరపాలి. అలాగే చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే గాకుండా, బీసీ జనగణన కూడా కేంద్రం ప్రకటించాలి. ఈ జనాభా లెక్కలు బయటికి వచ్చినప్పుడే ఓబీసీలకు జరుగుతున్న అన్యాయం సరిగ్గా అంచనా వేయడానికి వీలు కాదు. వీటన్నింటి సాధన కోసం కలిసి వచ్చే వారందరినీ భాగస్వాములుగా చేస్తూ ఉద్యమించాల్సిన అవసరముంది. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే మండల్‌కు నిజమైన నివాళి. అంబేద్కర్‌, ఫూలేని గుర్తు చేసుకుంటున్నట్లుగానే మండల్‌ని కూడా గుర్తు పెట్టుకొని, ఆయన ఆశించిన ‘బహుజన రాజ్యాధికారం’ కోసం అందరూ కొట్లాడాలె!

(నేడు బి.పి. మండల్‌ జయంతి) 

No comments:

Post a Comment