Wednesday, July 1, 2020

శాహు మహారాజు - మద్యపాన వ్యతిరేకత

దేశంలో మొట్టమొదటిసారిగా అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి బ్రాహ్మణాధిపత్యాన్ని నిలువరించిన ధీరుడు ఛత్రపతి శాహు మహారాజు. ఇవ్వాళ ఆయన 146వ జయంతి. కొల్లాపూర్‌ (మహారాష్ట్ర) సంస్థానాధీశుడైన ఈయన తన సంస్థానంలో మొదటి సారిగా బహుజనులకు, దళితులకు హాస్టల్‌ సదుపాయం, విద్యావకాశాలు కల్పించిండు. బాలగంగాధర్‌ తిలక్‌ లాంటి హిందూత్వ వాదుల బెదిరింపులకు ఏ మాత్రం భయపడకుండా తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిండు. ప్రచారం చేసిండు. అంబేడ్కర్‌తో కలిసి అనేక దళిత సభల్లో పాల్గొన్నాడు. 1920 జనవరి 31న మూక్‌నాయక్‌ (గొంతులేని వారి గొంతుక) పత్రికను అంబేడ్కర్‌ బొంబాయిలో స్థాపించిండు. దీనికి ఆర్థికంగా అండగా నిబడింది శాహు మహారాజు.
ఈయన నుంచి దేశ ప్రజలు ముఖ్యంగా బహుజనులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది. శాహుమహారాజు తండ్రి అబ్బాసాహెబ్‌ ఘట్గే. ఈయన కొడుక్కు అధికారం దక్కిన తర్వాత బ్రిటీష్‌ వారితో రాయబార సంబంధాలు నెరపడానికి లండన్‌కు వెళ్ళిండు. అక్కడ విందుల్లో మద్యం సేవించడం అవాటయింది. ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత కూడా అతిగా తాగడం మూలంగా మార్చి 20, 1886 నాడు మరణించిండు.
తండ్రి తాగుడుకు బానిసై కేవలం 30 ఏండ్ల వయసులోనే చనిపోవడంతో శాహు జీవితాంతం మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిండు. ఒక సారి శాహు గురువు కె.బి.గోఖలే ఒక ప్రస్తావన తీసుకొస్తూ ‘‘గౌరవనీయులైన, మర్యాదస్తులైన మీ నాన్న గారి మిత్రులను మీరు ఆదరించాలి.’’ అని అన్నాడు. దానికి శాహు సమాధాన మిస్తూ ‘‘తెలుసు. ఈ మర్యాదస్తులు మా నాన్నకు ఎలాంటి సాహచర్యం మిచ్చిండ్రో బాగా తెలుసు. వీరి మూలంగానే కదా ఆయన ఆరోగ్యం కరాబయింది. వీళ్ళే కదా ఆయన్ని వ్యసన పరుణ్ణి చేసింది. అవసరం లేదు. వీళ్ళనెవరినీ నేను గౌరవించాల్సిన, ఆదరించాల్సిన అవసరం లేదు’’ అని తేల్చి చెప్పిండు. ఈ విషయాన్ని ‘శాహు చక్రవర్తి - ఎ రాయల్‌ రెవల్యూషనరీ’ గ్రంథంలో ధనంజయ కీర్‌ రాసిండు. ఈ పుస్తకాన్ని బొంబాయిలో పాపులర్ ప్రకాశన్ వారు 1975లో అచ్చేసిండ్రు.
శాహు మహారాజు స్ఫూర్తిని దళిత, బహుజనులు ఆవాహన చేసుకోవాల్సిన సందర్భమిది. కనీసం మద్యపానం విషయంలోనైనా శాహుని స్ఫూర్తిగా తీసుకొని దానికి వ్యతిరేకంగా ప్రచారం చేద్దాం.. -సంగిశెట్టి శ్రీనివాస్

No comments:

Post a Comment

Vattikota natikalu