అంతటి నరసింహం
రచనలతో ప్రచారం చేసిన
బహుజనుడు అంతటి నరసింహం
‘‘ఎంతటి వారలైనా నీ అవసరం రానంత వరకే నిన్ను విస్మరిస్తారు.’’
ఈ విస్మరణ, వివక్షాపూరిత వైఖరి మూలంగా కొన్ని సార్లు వైయుక్తిక నష్టం కన్నా సమాజానికే ఎక్కువ నష్టం జరుగుతుంది. కొంతమంది సాహితీమూర్తులు సృజించిన రచనలను విస్మరించడం వల్ల వారికన్నా ఎక్కువగా మనకే నష్టం జరుగుతుంది. జరిగింది కూడా! అట్ల ఒకతన్ని అతని రచనలను విస్మరించి మనకు మనం నష్టం చేసుకున్నాము. ఆయన పేరు డాక్టర్ అంతటి నరసింహం.
Add caption |
కడపజిల్లా వెంకటరాజు పల్లెకు చెందిన అంతటి నరసింహం కులం రీత్యా గౌడ్. ఈయన కావ్యాలు, సాంఘిక నవలలు, చారిత్రక రచనలు, నాటకాలు, విమర్శ, బాల సాహిత్యం ఇట్లా అనేక ప్రక్రియల్లో ఆరు దశాబ్దాల పాటు రచనలు చేసిండు. ఇప్పుడిక్కడ ఆయన రాసిన ‘చీకట్లో కాంతి రేఖలు’ అనే నవల గురించి చర్చించుకుందాం.
‘చీకట్లో కాంతిరేఖలు’ నవల మొదట ఆంధ్రభూమి దిన పత్రిక ఆదివారం అనుబంధంలో సీరియల్‌గా ప్రచురితమయింది. అనంతరం 1982లో పుస్తక రూపంలో వెలువడింది. ఈ నవల 1991లో పునర్ముద్రితమయింది. ఒక నవల రెండుసార్లు అక్కవడం అరుదు. రెండోసారి ప్రచురితమైన నవల ఆధారంగానే ఇక్కడ రాస్తున్నాను.
తెలుగునాట 1985లో కారంచేడు సంఘటన తర్వాత దళితోద్యమం పురుడు పోసుకుంది. ఇది సాహిత్యంలోనూ ప్రతిఫలించింది. ఆ తర్వాత 1990లో పూలె శతవర్ధంతి, అనంతరం 1991లో అంబేడ్కర్ శతజయంతి, మండల్ ఉద్యమం, బహుజన సమాజ్ పార్టీ కార్యకలాపాలు అన్నీ కలిసి దళిత చైతన్యానికి పాదులు వేశాయి. అయితే ఇవేవి లేని సమయంలోనే అంతటి నరసింహం ‘చీకట్లో కాంతిరేఖలు’ అనే చారిత్రక, రాజకీయ, దళిత చైతన్య నవలను రాసిండు. నవలా నాయకుడు దళితుడు. మాల కులస్థుడు. పేరు కాంతారావు.
ఈ కాంతారావు ప్రాథమిక విద్య నుంచి ఐఎఎస్ అధికారిగా ఎదిగి వచ్చే క్రమాన్ని అంతటి నరసింహం అత్యంత సమర్ధంగా చిత్రించిండు. చాలా విషయాలు తాను స్వయంగా చూసినవి కావడంతో వాటికి జీవం పోసిండు. ఈ నవల చాలా రకాలుగా కొత్త పుంతలు తొక్కింది. ఇందులోని కథ 1930-1958 మధ్య కాలంలో గుంటూరు, హైదరాబాద్ రాజ్యం, మదరాసు చదువులూ, అమెరికా రాక పోకలు, దళితులపై దాడులు, పొగాకు కూలీలు, వారిపై అత్యాచారాలు, క్రైస్తవం, మతమార్పిడులు, మాల-మాదిగల విభేదాలు, వారిమధ్య సయోధ్యకు కృషి, కమ్యూనిస్టు, కాంగ్రెస్ రాజకీయాలు, తెలంగాణ-ఆంధ్ర సంబంధాలు, రజకార్లు, సాయధ రైతాంగ పోరాటం, ఆంధ్రాధిపత్యం, విద్య ప్రాధాన్యత, దళితుల ఆత్మగౌరవం, మదరాసులో దళితులకు కిరాయికి ఇండ్లు దొరకని స్థితి, తెలంగాణలోదొరలదౌర్జన్యాలు, దళితుల ఉన్నతచదువులు, కులఅంతరాలు- ఇట్లా అనేక విషయాలను మేళవించి దలోతుల జీవితాలను చిత్రించిండు.
అన్నిటి కన్నా ప్రధానంగా కాంగ్రెస్ వాదిగా బయలుదేరిన వ్యక్తి మధ్యలో కమ్యూనిస్టుగా అదీ తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకి పట్టుకొని ప్రత్యక్షంగా పట్టుకున్న వ్యక్తి 1956 నాటికే అంబేడ్కరిస్టుగా, ఐఏఎస్ గా ఎదిగిన తీరు, సమాజంలో వచ్సిన మార్పును పొల్లు పోకుండా కండ్లముందుంచిండు. మొదట్లో గాంధీ-అంబేడ్కర్ ఇద్దరినీ అభిమానించిన వ్యక్తి ఆఖరికి అంబేడ్కర్ దగ్గర వచ్చి ఆగిన తీరుని ఇందులో రాసిండు.
ఇదొక విశిష్టమైన నవల. ఎందుకంటే నవలాకారుడిది రాయలసీమ. కథా నాయకుడు గుంటూరు వాసి. ఈయనకు స్ఫూర్తి, గురువు తెంగాణకు చెందిన కమ్యూనిస్టు, మాలదాసరి. అనంతరం ఈ మాలదాసరి 1952 ఎన్నికల్లో గుంటూరు జిల్లా రిజర్వుడు నియోజక వర్గం నుంచి కమ్యూనిస్టు పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇట్లా ఈయన విజయానికి తోడ్పడింది తెలంగాణలో రజకార్ల దోపిడీలో సర్వం కోల్పోయిన భూస్వామి కూతురు. ఈమె పేరు శశి. ఈమె తర్వాతి కాలంలో అంటే 1952-53 నాటికే అమెరికా వెళ్ళి అక్కడ చదువుకుంటుంది. అక్కడ ఉద్యోగం కూడా చేస్తుంది. దళిత కథానాయకుడు - శశి మధ్యన ప్రేమ, ఆత్మాభిమానం గురించి రచయిత చక్కగా అక్షరాలుగా చెక్కిండు. కాంతారావు అమెరికా వెళ్ళినపుడు అక్కడి హోటల్ యాజమానులు ‘కుక్కల-, ఇండియన్లకు’ ప్రవేశం లేదు అని రాయడాన్ని వ్యతిరేకిస్తాడు. ఇట్లా రచయిత కథానాయకుడు ఇండియాలోనూ, అమెరికాలోనూ ఎదుర్కొన్న వివక్షను అక్షరబద్ధం చేసిండు.
‘‘కాంతారావుది గుంటూరు ప్రక్కన పల్లె. పల్లెగాదు, పల్లె ప్రక్కన హరిజనవాడ. [హరిజన పదం వాడకాన్ని ఇప్పుడు నిషేధించారు.] ఇతరుల దృష్టిలో హరిజన వాడేగాని అది రెండుగా చీలి వుంది. ఒకటి మాలవాడ, రెండవది మాదిగవాడ. మాల వాడకు చెందిన వాడు కాంతారావు’’ అని కథా నాయకుడి గురించి చెబుతాడు.
అదే సమయంలో కథా నాయకుడు కాంతారావు తన ఊరు (గుంటూరు పక్కనే ఉండే ఊరు)లో యువకు కోసం రాత్రి పాఠశా నిర్వహించడం, మా`మాదిగ మధ్యన మైత్రి కోసం ప్రయత్నించడం, దళిత బాలిక విద్య కోసం కృషిచేయడం, గ్రంథాయోద్యమంలో నేరుగా పాల్గొనడం కూడా రాసిండు.
దళితులే ఎక్కువగా కమ్యూనిజం వైపు మళ్ళిన విషయాన్ని కూడా నరసింహం గారు రాసిండ్రు. ‘‘మనదేశంలో హరిజనులు కమ్యూనిజం వైపు మొగ్గు చూపినంతగా మరే జాతీ చూపదు. కమ్యూనిజంలో సమతాభావం వుంది. అది బీద వర్గాల పక్షం వహిస్తుంది. కర్షక కార్మిక పక్షంగా వుంటుంది. కుల మతాలుండరాదని ఆచరణ రీత్యా చూపుతున్న పార్టీ అది అప్పట్లో’’ అని ఆనాటి కమ్యూనిస్టు పార్టీ గురించి చెప్పిండు.
అట్లాగే గాంధీ హత్య గురించి కూడా ఇందులో రాసిండు.
‘‘త్వరగా భోంచేసి పాఠశాలకు వెళ్ళాలని భోజనం ముందు కూర్చున్నాడు. అన్నం కలిపి ముద్ద నోటికెత్తబోతున్నాడు. సోమన్న గసపెట్టుకుంటూ పరుగెత్తుకొని వస్తున్నాడు. కన్నీళ్ళు కారుతున్నాయి. యేడుస్తూ గాద్గదిక స్వరంతో చెప్పబోతున్నాడు. మాట పెగిలి రావడం లేదు. కాంతారావు గాభరాగా ‘‘ఏమిటిది సోమన్నా?’’ అన్నాడు. అతి ప్రయత్నంతో ‘‘గాంధీజీ హత్య’’ అన్నాడతను. ఏం వింటున్నాడో కాంతారావు అన్నం అట్లానే వదిలేసి లేచాడు. ‘‘ఏమిటంటున్నావ్?’’ అన్నాడు నమ్మనట్లుగా.
‘‘గాంధీజీని హత్య చేశాడు ఒక మత మూర్ఖుడు?’’
‘‘ముస్లిమేనా’’
‘‘ఛీ! ఛీ! హిందువే. ఒక కులతత్త్వవాది.’’
అంతే! చెయ్యి కడుక్కొని యాంత్రికంగా మౌనంగా గుంటూరు పరుగెత్తారు. గుంటూరులో ప్రతి రేడియో కూడా విషాద సంగీతం వినిపిస్తున్నది. ‘రఘుపతి రాఘవ’ అని ఆలాపన చేస్తున్నది.’’ (చీకట్లో కాంతిరేఖలు: 56) అని గాంధీ హత్యను రికార్డు చేసిండు.
```
1948లో తెలంగాణలో సాయుధ పోరాటం ఊపందుకోవడంతో తన స్ఫూర్తిప్రదాత ‘దాసు పంతులు’తో పాటు స్వయంగా తుపాకి పట్టిండు. నైజాం సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఈ సందర్భంగా దాసుపంతులు పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడిండు. అట్లాగే సూర్యాపేటకు దగ్గరలోని జగన్నాథపురంలో రజాకార్లు దోపిడికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకొని సాయుధ కమ్యూనిస్టులు అక్కడికి చేరుకున్నారు.అప్పటికే రజాకార్లు గడీలో దొరను చంపేసిండ్రు. ఆయనతో పాటు ఇంట్లో ఉన్న వారినందరిని చంపేసిండ్రు. అయితే కాంతారావు సాహసంతో వ్యవహరించి అక్కడ చిక్కుకు పోయిన భూస్వామి కూతురు శశిని రక్షిస్తాడు. తర్వాత ఆమెను సంస్కరణ భావాలు గల పోలీసు దంపతులు గుంటూరులో తమ దగ్గరే ఉంచుకొని చదివిస్తారు. స్థూలంగా ఇదీ కథ. అయితే ఇందులోనే ఎన్నోఉపాంగాను అంతటి నరసింహం చేర్చిండు.
సాయుధ పోరాట కాలం నాటి తెలంగాణ ప్రజల జీవితాలను చాలా చక్కగా అక్షరబద్ధం చేసిండు. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని, ఆంధ్రా అధికారుల దోపిడీ మనస్తత్వాన్నీ చిత్రించిండు. తెలంగాణ ప్రజల పట్ల పూర్తి సానుభూతి, సహానుభూతితో రాసిండు. పోలీసు చర్య నాటి జీవితాలను ఇట్లా చిత్రించిండు. ‘‘తెలంగాణ ప్రజానీకం చాలా వెనుకబడిన సమాజం. దారిద్య్రంలో అజ్ఞానంలో మునిగి ఎన్నెన్నో కష్టాలను తమ పూర్వజన్మ కర్మ అనుకుంటూ అనుభవించిన అమాయక జనం. కమ్యూనిస్టు అండా, వారు స్థాపించిన గ్రామ రాజ్యమూ కొంత ఊరట కలిగించినా ఎ్లప్పుడూ సింహ వ్యాఘ్రాది క్రూర జంతువుల భయంచేత నిత్య జాగరూకతతో ప్రవర్తించే జింకల్లాగా భూస్వాములా రజాకార్లా దాడులను శంకిస్తూ వుండే నిస్సహాయ జనం. సైన్యాన్ని చూచి ఆనందించిన యీ జనం వారి ఘాతుక చర్యలను చూచి నిర్వేదం పొందింది.
పుండు మీద కారం చల్లినట్లుగా పాలకుల దుర్మార్గం కూడా తోడయింది. నిజాం రాజ్యాన్ని సైన్యాలు మూడు దినాల్లోనే స్వాధీనం చేసుకోగానే యూనియన్ ప్రాంతాల నుండి, ముఖ్యంగా మద్రాసు రాష్ట్రం నుండి అడ్మినిస్ట్రేషన్ కోసం కొందరు డిప్యూటి తహసిల్ దార్లను తహిసిల్‌దార్లుగాను, తహసిల్‌దార్లుగా వున్న వారిని డిప్యూటి కలెక్టర్లుగానూ, సబ్ ఇన్‌స్పెక్టర్లను ఇన్‌స్పెక్టర్లుగానూ, ఇన్‌స్పెక్టర్లను డిప్యూటి సూపర్నెంట్లుగాను ప్రమోషన్ ఇచ్చి తెంగాణాకు పంపారు. నిజాం రాష్ట్ర ఉద్యోగులో అధికాంశం ముస్లిములే గాబట్టి వారి చేతుల్లో అణగారిపోయాం అనుకుంటున్న గ్రామీణ హిందూ ప్రజానీకం యీ అడ్మినిస్ట్రేటర్లను చూచి ఎంతో ఆనందించి హృదయత: స్వాగతం పలికారు. దేవుళ్ళను చూచి మొక్కినట్లుగా నమస్కారం చేస్తూ, ఇక తమ కష్టాులు శాశ్వతంగా తొలగి పోయాయని భావించారు. కాని వ్యక్తి వ్యక్తి స్వార్థ చిత్తుడై వ్యక్తి స్వార్థం కులస్వార్థం అనే మురికి గుంటల్లో నివసిస్తూ యీ అధికారి మండూకాలు నాలుకలు చాచి చిన్న చిన్న కీటకాల్లాంటి యీ జనంపై బడి భక్షించసాగారు.
ఇదిరకటి వారు దండయాత్రలాగా వచ్చి పాడు చేసి వెళ్ళిపోయారు. ఇపుడు వచ్చిన వీరు స్థిరంగా ఒక చోట వుండి నిదానంగా భక్షింపసాగారు. లంచగొండితనం ఎంత పరాకాష్ఠనందుకుందో ఆ ప్రజలకు అర్థమయింది. యూనియన్ అడ్మినిస్ట్రేటర్ల ధనదాహం చెప్పనలవి కానిది. అక్కడ వున్న భూస్వాములపైనా బహీనవర్గాలపైనా వివక్ష లేకుండా పడి దోచుకోవడమే వారి పని! ప్రతివాడూ వాడికి తగిన విధంగా దోచుకోవడమే. సర్వభక్షకుల్లాగా తయారైపోయారు. ఇక వీరి కామదాహం వర్ణనాతీతం. హిందూ ముస్లిం భూస్వాముల యిండ్లలో వచ్చి పసుపు కొమ్ముల్లాంటి అందమైన ఆడవాళ్ళనూ తటస్థపడిన ఆడవాళ్ళనూ బొమ్మల్లాగా వుపయోగించుకున్నారు.
ఇది వరకు రజాకార్ల క్రౌర్యానికి తట్టుకోలేక యూనియన్ ప్రాంతాకు పారిపోయిన వాళ్లంతా తిరిగి తెలంగాణలోకి నిర్భయంగా ప్రవేశించారు. తీరావచ్చి ఇక్కడి పరిస్థితులు చూచి విస్తుపోయారు. యూనియన్ ప్రాంతాల్లో ముఖ్యంగా గుంటూరు బెజవాడ మొదలైన పట్టణాల్లో ప్రాణాలను అరచేత బట్టుకొని పారివచ్చిన తెలంగాణ వారినుండి బాడుగలు అధికంగా లాగడం ద్వారా అధిక ధరలకు మోసంగా వస్తువులు నమ్మడం ద్వారా దగా చేయడం చూచిన యీ శరణార్థులు తిరిగి వచ్చి, తమ వారంతా అధికార్ల చేతుల్లో అనుభవిస్తున్న కడగండ్లను చూచి విస్మయం చెందారు. అదే అప్పటి నుండే ఆంధ్ర ప్రాంతం వారంటే తెంగాణ వారికి మంటలెత్తడం మొదలు.’’ (చీకట్లో కాంతిరేఖలు: 110-111)’’ దీన్ని బట్టి ఆనాటి ఆంధ్రాధికారుల అఘాయిత్యాలు, దోపిడి, దౌర్జన్యం తెలుసుకోవచ్చు. ఇట్లాంటివే అనేక సంఘటనలు అంతటి నరసింహం గారు ఈ నవలలో రాసిండ్రు. మదరాసు పట్టణంలో దళితులకు కిరాయికి ఇండ్లు ఇవ్వని విషయాన్ని, దళితులకు బుద్ధి చెప్పడం కోసం పొగాకు రైతులు సమ్మె చేస్తున్న వారిని బెదిరించడం. అత్యాచారాలకు ఒడిగట్టడం, అత్యాచారాలు చేసి అనివార్య పరిస్థితుల్లో దండుగలు కట్టి ఎట్లా దొరలు లైంగిక దాడికి దిగేవారో రాసిండు. కుల మతా తారతమ్యాలు, అవి పోవడానికి చేయాల్సిన కృషి, కులాంతర వివాహాల ప్రసక్తి ఇట్లా అనేక విషయాలు ఈ నవలలో ఆయన చిత్రించిండు.
- - -
‘‘సమాజాన్ని నడిపించేది నీతి. నీతి అంటే, అదేదో పాతచింతకాయ పచ్చడి అనీ, వేదాంతులకు అవసరమైన పదం అనీ, అనుకోగూడదు. అది ప్రతినిత్యమూ సంఘావసరాన్ని బట్టి మారుతూ సమాజాన్ని ముందుకు నడిపించే చుక్కాని లాంటిది. నిత్యగమనం గలది.
ప్రతి వ్యక్తి జీవితమూ, సంఘర్షణమయమే. స్వార్థమయమే! స్వార్థం యెప్పుడూ అసూయా ద్వేషాలకూ, అక్రమ ప్రవర్తననూ, దారితీస్తూనే వుంటుంది. తత్ఫలంగా సంఘర్షణ జనిస్తుంది. ధనసంచయమూ, కామతృష్ణా, పరిశ్రమ చెయ్యకుండా సుఖజీవిత వాంఛా, భావితరాల సుఖజీవనం కోసం ఆస్తి కూడబెట్టడం వగైరాలు ఈ స్వార్థానికి ఆలంబనాలు’’ అని అంతటి నరసింహం ఈ నవలకు రాసిన ముందుమాటలో చెప్పిండు. అట్లాగే ‘‘ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం. సమాజంలోని అందరికీ సమజీవనం అనుభవించాల్సిన హక్కుంది. అందుకు అవాంతరాలు యేర్పడితే వాటిని తొలగించుకోవసిన హక్కుగూడా అందరికీ వుంది. అయితే అంత చైతన్యం అందరికీ వుండదు. అందుకే రచయితలు ఆ బాధ్యత వహించాలి. రచయితలు ఎప్పుడూ దూరదృష్టి గలవారు. వారికి బాధ్యతున్న విషయం వారు మరువరాదు.’’ అంటూ రచయిత కర్తవ్యాన్ని కూడా చెప్పిండు.
ఆయన కర్తవ్య బోధనే గాకుండా ఆచరించి చూపించిండు. గాంధీ - అంబేడ్కర్ రాజకీయాలను, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఎన్నికలు, కాంగ్రెస్, కమ్యూనిస్టు రాజకీయాలు, ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఇట్లా అనేక రాజకీయ విషయాలను ఈ నవల చిత్రికగట్టింది. కచ్చితంగా ఇది రాజకీయ నవలే. అయితే దళితులకు న్యాయమైన ప్రాతినిధ్యం కోసం కొట్లాడిన రాజకీయ నవల. ఆత్మగౌరం కోసం తండ్లాడిన నవల. ఏ జిల్లాలోనైతే సాయుధ పోరాటంలో తుపాకి పట్టుకొని పోరాటం చేసిండో అదే జిల్లాకు ఓ ఎనిమిదేండ్ల తరువాత ఐఎఎస్ అధికారిగా సబ్‌కలెక్టరుగా వచ్చిండు. దళిత ఐఎఎస్ దగ్గర అగ్రవర్ణాలకు చెందిన ఫ్యూను సైతం పనిచేయడానికి నిరాకరించిన వైనాన్ని అంతటి నరసింహంగారు రాసిండ్రు. ఇట్లా నిజాయితీగా పనిచేసే అధికారులను శశి చిన్నాన్నఎమ్మెల్యే జగన్నాథం లాంటి వారు అడ్డుకోవడం, ఆఖరికి అక్కడి నుంచి కాంతారావుని తబాదలా చేయించడంతో కథా నాయకుడు అంబేడ్కర్ మార్గమే సరైనది. కుల వివక్ష పోవాలంటే కులాంతర వివాహాలు జరగాలని అంతకు ముందు నుంచి చెబుతూ వచ్చాడు. అందుకే కాంతారావు ఇట్లా అభిప్రాయపడ్డాడు. ‘‘ఈ దేశంలో అంబేద్కర్ వాదమే బాగుందనుకున్నాడు. ప్రతీకారాగ్ని ప్రజ్వరిల్లింది. ప్యూనుపై కసిదీర్చుకోవాలనుకున్నాడు. డిస్మిస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా అనుకున్నాడు. వాడి వెనుకవున్న కులవ్యవస్థా, కుల పెద్దలు కారణంగాని వాడు గాదనుకున్నాడు. అయినా క్రమశిక్షణ కోసం చర్య తీసుకోకపోతే ఆ అవమానానికి తల ఒగ్గినట్లవుతుందని, ఎందుకు డిస్మిస్ చేయరాదో సంజాయిషీ యివ్వవలసిందిగా ప్యూనుకు వ్రాయించి పంపాడు’’ అని ఆనాటి తీరుపై రాసిండు. స్వాతంత్య్రం వచ్చిన పదేండ్ల తర్వాత కూడా సమాజంలో ఆశించిన మార్పు లేక పోవడంతో ‘‘ఈకుల వ్యవస్థ పాత కుబుసాన్ని విడిచి కొత్త రూపాన్ని ధరిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఏ స్వార్థంతో అయితే యిది పుట్టిందో ఆ కారణాన్ని సమూలంగా నిర్మూలించాలి. రాజకీయ వ్యవస్థ ద్వారానే దీన్ని దెబ్బకొట్టాలి. మహిళా కళాశాల స్థాపన జరగ్గానే రాజీనామా యిచ్చి అయినా కులవ్యవస్థను దెబ్బతీయాలి. ఈ వ్యవస్థ వల్ల ఏ కులానికీ ఏ వర్గానికీ మేలు లేదు కాబట్టి యిది వుండరాదు’’ అని అంబేడ్కర్ ఐడియాలజీ పట్ల అభిమానాన్ని కథానాయకుడి ఆఖరి మాటల్లో తన అభిప్రాయంగా అంతటి నరసింహం చెప్పిండు.
దళిత సాహిత్యంపై జరిగిన చరిత్ర, పరిశోధన, విమర్శ, పరామర్శల్లో ఈ నవల గురించి ఏ ఒక్కరిద్దరో తప్ప ఎవ్వరూ పేర్కొనలేదు. అదే సమయంలో ఉన్నవ క్ష్మినారాయణ రాసిన ‘మాలపల్లి’ నవలను ఇటు బ్రాహ్మణులు, అటు దళితులూ ఇద్దరూ చాలా చర్చ చేసిండ్రు. అయితే బహుజనుడు ఒక గౌడ కులస్థుడైన అంతటి నరసింహం రాసిన నవలకు అటు దళిత సాహిత్య చరిత్రలోనూ, ఇటు విమర్శలోనూ పెద్దగా చోటు దక్కలేదు. ఇప్పటికైనా ఈ నవలను పునర్ముద్రించి దీనిలోని విషయాలను దళితులు, బహుజనులు అందరూ పట్టించుకోవాల్సిన అవసరమున్నది. అంబేడ్కర్ భావజాలం ఇంత విస్తృతి చెందిన తర్వాత కూడా అంతటి నరసింహం ను విస్మరించడం అన్యాయం. అంబెడ్కర్ భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం 1980లోనే రాసిన ఈ నవలను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు.
అంతటి నరసింహం ఆదర్శాలు రాయడమే కాదు స్వయంగా ఆచరించిన వాడు. తాను కులాంతర వివాహం చేసుకోదలిచి అదే విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించాడు. ఆయనకు ఆ కాలంలో మూడు ఆదర్శాలుండేవి. ఒకటి అస్పృశ్యతా నివారణ, రెండోది స్త్రీ విద్య, మూడోది కులాంతర వివాహం. ఆఖరికి అపరాజిత అనే అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడు.
(కం)కాళరాత్రి అనే పద్య కావాన్ని హైదరాబాద్ వాసి భాషా సేవకుడు ఉన్నతాధికారిఅయిన బహుజనుడుమాటేటి రామప్పకు అంకితమిచ్చిండు. దీనికి తిరుమల రామచంద్ర ముందుమాట రాసిండు.
1925 నవంబర్ 24వ తేదీన కడప జిల్లా కోడూరు తాలూకాలోని వెంకటరాజు పల్లిలో అంతటి సుబ్బమ్మ, పెంచలయ్య దంపతులకు జన్మించిన అంతటి నరసింహం తెలుగులో ఎం.ఎ చదవడమే గాకుండా ‘ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు’ అనే అంశంపై వెంకటేశ్వర యూనివర్సిటీలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. 1946 నుంచి 1976 వరకు అనేక కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సెక్రెటేరియట్‌లో సాంస్కృతిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శిగా 1976లో నియమితులయిండ్రు. 1982 నుంచి వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సహాయ సంస్థ అభివృద్ధి అధికారిగా, అనంతరం ఎ.పి. వాషర్‌మెన్ ఫెడరేషన్ మొదటి చైర్మన్‌గా వ్యవహరించారు. హైదరాబాద్ మెహదిపట్నంలో నివసించిన ఈయన 2010లో చనిపోయారు.
ఈయన (కం)కాళరాత్రి, నవసృష్టి, తాడితవ్యాఘ్రి, ఇప్పుడే, కాలవేదం, ఉషస్వప్నం, ఇరవై ఒకటో శతాబ్దంలోకి, అవతారాలమోసాలు అనే కావ్యాలు, ఆదర్శం, భావం, ప్రేమ భిక్ష, లేడి లెక్చరర్, స్వగతం, శంపాలత, చీకట్లో కాంతిరేఖలు, శోభాదేవి, ఆప్‌బీతీ (హిందీ) నవలలు రాసిండు. సహజీవనం, సమరసత్వం, మానవత్వం, పరిష్కారం, ఎక్కడి గొంగడి అక్కడేనా, మహిళా మహస్సు, వేలం వెర్రి, భువన విజయం, ముక్కంటి ముక్కోణం, నిత్య కళ్యాణి, ముల్లును ముల్లుతోనే ఆనే నాటకాలనూ రాసిండు. ఇంకా ఎంతో బాల సాహిత్యాన్ని సృజించాడు.
తెలుగు సాహిత్యానికి ఇంతటి విశిష్టమైన సేవలందించినఅంతటినరసింహం గురించి ఇప్పుడైనా విశ్వవిద్యాలయాల్లో పనిచేసేవారు దళితోద్యమకారులు, రాయలసీమ సాహితీవేత్తలు బహుజనులు పూనుకొని ఏదయినా యూనివర్సిటీలో ఈ పుస్తకాన్నిపాఠ్యాంశంగా పెట్టించినట్లయితే విద్యప్రాధాన్యత వస్తుంది. ఈ స్ఫూర్తితో మరింత మంది ఐఎఎస్ లుఅవకాశముంది. ఈ 312 పేజీల నవల త్వరలోనే పునర్ముద్రణ కావాలని కోరుకుంటూ..
- సంగిశెట్టి శ్రీనివాస్
No comments:
Post a Comment