Friday, June 5, 2020

భారత కార్మికోద్యమ పితామహుడు లొఖండె Article On Deenabandhu Editor Father of Indina labour movement, Bahujan Leader Narayana Meghaji Lokhande


భారత కార్మికోద్యమ పితామహుడు లొఖండె

ఇవ్వాళ మేడే. (May 1, 2020) (కార్మికుల దినోత్సవం. అమెరికాలోని షికాగోలోని హేమార్కెట్‌లో జరిగిన ఉద్యమాల స్ఫూర్తితో 1886 నుంచి ప్రపంచమంతటా మే ఒకటో తేదిని ‘కార్మికుల దినోత్సవం’గా జరుపుకుంటున్నారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో ఇండియాలో కమ్యూనిస్టులు, వారి అనుబంధ సంఘాలు, మిగతా అన్ని పార్టీలకు అనుబంధంగా నడుస్తున్న కార్మిక సంఘాలు మే -1’ని కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సంతోషం. అయితే దేశంలో మొట్టమొదటిసారిగా కార్మికసంఘాలను నిర్మించి నడిపించిన నారాయణ మేఘాజీ లొఖండేను మాత్రం ఏమాత్రం గుర్తు చేసుకోరు. ఎందుకంటే శ్రీపాద అమృత డాంగె లాంటి బొంబాయి కార్మిక, కమ్యూనిస్టు, బ్రాహ్మణ నాయకుల కృషిని ఇది దిగదుడుపు చేస్తుంది. అంతేకాదు లొఖండే బీసీ కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం. ఇట్లాంటి సమయంలో బహుజన స్ఫూర్తి ప్రదాతలను బహుజనులే పూనుకొని ప్రచారంలో పెట్టాలె. పాఠ్యపుస్తకాల్లో వీరి జీవిత చరిత్రలను జోడించేందుకు కొట్లాడాలె. వారి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలె.


పూలెతో కలిసి ‘సత్యశోధక్‌ సమాజ్‌’ని నిర్మించిన నాయకుడు, దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్మిక సమస్యలను బహుజన దృక్కోణంలో వెలుగులోకి తేవడానికి, పరిష్కరించడానికి ‘దీనబంధు’ అనే పత్రికను నడిపించిండు. ఆయన గురించి మొట్టమొదటిసారిగా మరాఠీయేతర ప్రజలకు తెలిసింది 1960లో మాత్రమే! ధనంజయకీర్‌ రాసిన ‘సామాజిక విప్లవకారుడు మహాత్మ పూలె’ (1960) పుస్తకంలో కొంత సమాచారమిచ్చిండు. మనోహర్‌ కదమ్‌ అనే మరాఠీ చరిత్రకారుడు, రచయిత ఆయన జీవిత చరిత్రను 1995లో రాసి ప్రచురించిండు. మనోహర్ కదమ్ “బొంబాయి నిర్మాణములో తెలుగువారు” నేపుస్తకాన్ని కూడా రాసిండు. మనోహర్ రాసిన లోఖండ్ జీవిత చరిత్ర ఆధారంగా నళిని అనెస్కాలరు ఒక వ్యాసం రాసింది. ఆమె లొఖండే శతజయంతి సందర్భంగా 1997లో ‘ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ’లో ఒక వ్యాసం రాసింది. అట్లాగే 2018లో ఆదిత్య సర్కార్‌ ‘ట్రబుల్‌ ఎట్‌ద మిల్‌’ పేరిట ఒక పుస్తకాన్ని వెలువరించిండు. అట్లా కొంచెం ఇతర ప్రాంత ప్రజలకు కూడా ఆయన గురించి తెలిసి వచ్చింది. అయినప్పటికీ సంప్రదాయ కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌, సోషలిస్టులు ఎవ్వరూ ఆయన్ని ‘భారత కార్మికోద్యమ పితామహుడి’గా గుర్తించలేదు. కార్మికుల్లో ఎక్కువశాతం కింది కులాల వారే అయినప్పటికీ వారికి తమ ఆత్మ బంధువైన నారాయణ మేఘాజీ లొఖండే గురించి తెలియకుండా జేసిండ్రు. ఇది కచ్చితంగా కావాలని చేసిన విస్మరణే! ఈ చరిత్రను తిరగరాయాల్సిన అవసరముంది.

నారాయణ్‌ మేఘాజీ లొఖండె బంధుమిత్రుల సహాయంతో చదువుకున్నడు. కొన్ని రోజులు రైల్వే, పోస్టాఫీసుల్లో పనిజేసిండు. అయితే ఇవేవి ఆయనకు సంతృప్తినియ్యలేదు. దీనితో ఆయన బొంబాయిలోని మొరార్జీ గోకుల్‌ దాస్‌, హిందూస్థాన్‌, మాండ్వి బట్టల మిల్లుల్లో వివిధ హోదాల్లో పనిచేసిండు. (ఆదిత్య సర్కార్‌:2018) ఈ మిల్లుల్లో దళితులు కూడా పనిచేసేవారు. అయితే వారిని మిల్లులోని ఇతర విభాగాల్లోకి రానిచ్చేవారు కాదు. అంతేకాదు మిల్లు కార్మికులు మధ్యలో ఒక అర గంట భోజన విరామం మినహా దాదాపు 13-14 గంటు పనిచేసేవారు. ఇట్లా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న కార్మికుల అనారోగ్యం పాలు కావడాన్ని దగ్గర నుంచి చూసిండు. దళితుల పట్ల వివక్షనూ గమనించిండు. ఇదే సమయంలో బొంబాయిలో 1874లో రామయ్య వెంకయ్య అయ్యవారు, నర్సుజి తదితరులు ‘మాలి మహాసభ’ను నిర్వహించిండ్రు. ఇందులో జోతిరావు పూలే పాల్గొని ప్రసంగించిండు. (ధనంజయ కీర్‌: 1964) ఈ సభకు హాజరైన నారాయణ మేఘాజీ లొఖండే ఆనాటి నుంచి సత్యశోధక్‌ సమాజ్‌ కార్యకర్తగా, పూలె అనుయాయిగా మారిండు. ఇట్లా పూలెతో కలిసి ఎన్నో సత్యశోధక్‌ సమాజ్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. పూలె సూచనతో సత్యశోధక్‌ సమాజ్‌ పుట్టిన రోజు సెప్టెంబర్‌ 23 నాడు 1884లో ‘బొంబాయి మిల్‌ హ్యాండ్స్‌ అసోసియేషన్‌’ అనే కార్మిక సంఘాన్ని స్థాపించిండు. సెప్టెంబర్‌ 23 నాడు తిరిగి సెప్టెంబర్‌ 26 నాడు బొంబాయిలో భారీ బహిరంగ సభలు నిర్వహించిండు. ఈ సభల్లో ఐదువేలకు పైగా కార్మికులు పాల్గొన్నారు. ఇది బొంబాయిలో మొట్టమొదటి ప్రజా ప్రదర్శన, సభ. (ఆదిత్య సర్కార్‌: 2018).

లొఖండె బొంబాయి శాఖ ‘సత్యశోధక్‌ సమాజ్‌’ అధ్యక్షుడిగా కూడా ఉండేవాడు. దీంతో కార్మికుకులకు, సత్యశోధక్‌ సమాజ్‌కు మంచి స్నేహశీలత ఏర్పడింది. మార్వాడీల అప్పుల బారిన పడకుండా కార్మికులకు యాజమాన్యమే తక్కువ ధరకు నాణ్యమైన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేసిండు. ఈ కార్యక్రమాలు కార్మికులను ముఖ్యంగా బహుజనులను లొఖండేకు, సత్యశోధక్‌ సమాజ్‌కు మరింత దగ్గర చేశాయి.

1890లో ఆర్థిక మాంద్యం మూలంగా వారంలో రెండు రోజు మిల్లులను మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. అంటే నెలకు ఎనిమిది రోజుల జీతాన్ని కార్మికులు కోల్పోవాల్సి రావడంతో లొఖండే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీసిండు. 1890 ఏప్రిల్‌ 24 నాడు మహలక్ష్మి రేస్‌కోర్సు (బొంబాయి)లో పదివేల మందితో నిరసన ప్రదర్శనను నిర్వహించిండు.(నళిని:1997) దీంతో యాజమాన్యాలు దిగివచ్చాయి. ఇట్లా కొట్లాడి సాధించుకున్నదే ప్రతి ఆదివారం సెలవు. ఈ సెలవు మొట్టమొదటిసారిగా జూన్‌, 10, 1890 నాడు అమల్లోకి వచ్చింది. (నళిని:1997)

లొఖండే స్థాపించిన ‘బొంబాయి కామ్‌గార్‌ సంఘం’, దాని ఉద్యమాల మూలంగా మిల్‌ కార్మికులకు ప్రతి ఆదివారం సెలవు దొరికింది. సాయంత్రం పూట ఒక అరగంట విశ్రాంతి, ప్రతి మిల్లు ఉదయం ఆరున్నర నుంచి సూర్యస్తమయం వరకు మాత్రమే నడిపించాలి, ప్రతి కార్మికుడికి లుపదిహేనురోజులకోసారి జీతాలివ్వాలి, ఎవరైనా కార్మికుడు పనిచేస్తున్న క్రమంలో ప్రమాదంలో గాయపడితే అతను తిరిగి కోలుకునే వరకు పూర్తి జీతాలివ్వాలి’ అనే డిమాండ్లు సాధించుకున్నారు. బ్రిటీష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్మిక సంక్షేమ కమిటీల్లో కూడా ఈయన పనిచేసిండు. 1890లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఫ్యాక్టరీ కమిషన్‌’లో సభ్యుడిగా ఉన్నాడు. ఈయన చేసిన సూచనలను ప్రభుత్వం ఒప్పుకుంది లొఖండే కృషికి గుర్తింపుగా బ్రిటీష్‌ ప్రభుత్వం ‘రావుబహదూర్‌’ అనే బిరుదుని ప్రదానం చేసింది.

కార్మికోద్యమ నాయకుడిగా వివిధ మిల్లుల్లో సంస్థల్లో పనిచేసే కార్మికుల పిల్లలందరికీ ప్రభుత్వం ఉచితంగా విద్యనందించాలనీ, వీరు నివసించే ప్రదేశాల్లో మద్యనిషేధాన్ని అమలు చేయాలని, వెనుకబడిన వర్గాల వారికి ఉద్యోగాలు కల్పించాలని, విద్యార్థులకు ఫీజుల్లో రాయితీలు కల్పించాని ఆయన డిమాండ్‌ చేసిండు. అంతేగాకుండా సత్యశోధక్‌ సమాజ్‌ కార్యకలాపాలను విస్తరించే దిశలో బొంబాయిలో వితంతు పునర్వివాహాలకు మద్ధతుగా, వితంతు శిరోముండనానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిండు. దీంతో బొంబాయిలో శిరోముండనానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు లండన్‌ లాంటి ప్రాంతాల నుంచి మహిళలు అభినందనలు చెబుతూ లేఖలు రాశారంటే దాని యొక్క విశిష్టత తెలుసుకోవచ్చు.

కార్మికోద్యమ నాయకుడిగా ఉంటూనే ఉద్యమావసరాల కోసం, అదే విధంగా సత్యశోధక్‌ సమాజ్‌ కార్యకలాపాలకు ప్రచారం కల్పించే ఉద్దేశ్యంతో అప్పటికి కష్టాల్లో నడుస్తున్న ‘దీనబంధు’ పత్రిక సంపాదకత్వ బాధ్యతలను చేపట్టిండు. ఈ పత్రికను మొదట 1877-80 మధ్య కాలంలో పుణె నుంచి సత్యశోధక్‌ సమాజ్‌ కార్యదర్శిగా పనిచేసిన కృష్ణారావు పాండురంగ్‌ భాలేకర్‌ నడిపించిండు. ఈయన కూడా మాలి. అయితే ఆర్థిక వనరుల లేమితో పత్రిక ఆగిపోవడంతో దాని కార్యస్థానాన్ని బొంబాయికి మార్చిండ్రు. బొంబాయిలో పత్రిక స్థాపనలోనూ, ముద్రణా యంత్రాన్ని కొనివ్వడంలోనూ హైదరాబాద్‌ రాజ్యం నుంచి బొంబాయి వలసబోయిన ప్రఖ్యాత కాంట్రాక్టర్లు రామయ్య వెంకయ్య అయ్యవారు, నర్సూ సాబ్‌, నాగు సాయజీ, జాయ కారడి లింగూ, వెంకూ బాలాజీ తదితరులు ఆర్థికంగా ఆదుకున్నారు. ఇట్లా స్థాపితమైన ‘దీనబంధు’ వార పత్రిక బొంబాయి నుంచి మే 1880 నుంచి 1897లో లొఖండే చనిపోయే వరకూ అంటే 17 ఏండ్ల పాటు నిరంతరాయంగా నడిచింది. కార్మికుల పక్షాన నిలబడింది. ఆర్థికంగా నష్టమొచ్చినా ఈ పత్రికను ఆయన నడిపించిండు. ఈ నష్టాలను మరో పూలే అనుయాయి ఎస్.ఆర్. లాడ్ ఎక్కువగా భరించిండు. అట్లాగే ‘గురఖి’ అనే దినపత్రికను కూడా లొఖండె నిర్వహించిండు.

1893లో తిలక్‌, ఆయన అనుయాయులు, ‘కేసరి’ పత్రిక మూలంగా బొంబాయిలో మొదటిసారిగా మతకహాలు జరిగాయి. ఈ మతకహాలను నివారించేందుకు, కార్మికుల మధ్యన సఖ్యత చేకూర్చేందుకు ఏర్పాటు చేసిన ‘శాంతి సంఘం’లో లొఖండే సభ్యుడిగా ఉన్నాడు. “ఏహ్య మేళ”ను నిర్వహించిండ్రు. మతసామరస్యానికి కృషి చేసిండు.

బొంబాయికి దగ్గరలోని థానెలో 1848 ఫిబ్రవరి ఎనిమిది నాడు ఈయన జన్మించిండు. కష్టనష్టాలకోర్చి చదువుకున్నాడు. బొంబాయిలో ఉద్యోగం చేసుకుంటున్న సమయంలో 1874లో

పూలె అక్కడొక సభలో పాల్గొన్నాడు. ఆ సభలో పూలె ఉపన్యాసం విని ఆయన శిష్యుడిగా మారిండు. ఆయన నాయకత్వంలో వివిధ సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నాడు. అట్లాంటిదే శిరోముండనానికి వ్యతిరేకంగా పోరాటం. అలాగే రాయ్‌గఢ్‌లో శివాజీ సమాధిని రక్షించాలని, దానిని తీర్చిదిద్దాలని కూడా ఉద్యమాలు చేసిండు. పూలె అనుయాయిగా ఉంటూ పుణె జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో ‘సత్యశోధక్‌ సమాజ్‌’ కార్యకలాపాలు నిర్వహించడంలో చురుగ్గా పాల్గొన్నాడు.

భార్య గోపికాబాయి, కొడుకు పేరు గోపినాథ్‌. ఈయన స్మారకార్థం 2005 మే మూడు నాడు భారత ప్రభుత్వం పోస్టల్‌ స్టాంప్‌ని విడుద చేసింది.

ఇది కరోనా సమయం. అంటువ్యాధులు సోకుతున్నాయి. 1897లో మహారాష్ట్రలో కూడా ప్లేగు వ్యాధి సోకింది. ఇట్లా ప్లేగు వ్యాధి సోకిన వారికి సేవ చేస్తూ (నళిని: 1997) నారాయణ మేఘాజీ లొఖండే ప్లేగు పీడితులకు సేవ చేస్తూ 1898 ఫిబ్రవరి 9 నాడు చనిపోయిండు.

- సంగిశెట్టి శ్రీనివాస్‌
References:
(O’ Hanlan, Rosalind (2002) Caste, Conflict and Ideology: Mahatma Jotirao Phule and Low Caste Protest in Nineteenth Century Western India, Cambrdige University press, Cambridge.
keer,Dhananjay (1974) Mahatma Jotirao Phule: Father of Indian Social Revolution, Popular Prakashan, Bombay.
Pandit, Nalini (1997). "Narayan Meghaji Lokhande: The Father of Trade Union Movement in India". Economic and Political Weekly. 32 (7): 327–329.
Sarkar, Aditya (2018). Trouble at the Mill: Factory Law and the Emergence of the Labour Question in Late Nineteenth-Century Bombay. Oxford University Press, New Delhi.)

No comments:

Post a Comment